English | Telugu

ఒకేరోజు రెండు సార్లు పెళ్లి.. ఘనంగా కీర్తి సురేష్‌ వివాహ వేడుక!

సాధారణంగా హీరోయిన్ల పెళ్లిళ్లు మొదట లవ్‌ అనే రూమర్‌తో మొదలవుతాయి. అలా కొన్నాళ్ళు ప్రచారం జరిగిన తర్వాత ఓ శుభముహూర్తాన తాము పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఆ జంట ప్రకటిస్తుంది. కానీ, ఇక్కడ అలాంటి రూమర్‌ లేదు, గాసిప్‌ లేదు. డైరెక్ట్‌గా పెళ్ళే. మహానటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ తన పెళ్లి విషయంలో ఎలాంటి న్యూస్‌ బయటికి రాకుండా ఎంతో సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేసింది. చివరి క్షణంలో తన క్లాస్‌ మేట్‌ ఆంటోనిని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పది రోజుల ముందే తన వివాహ విషయాన్ని ప్రకటించింది.

గురువారం గోవా వేదికగా కీర్తి సురేష్‌, ఆంటోని తట్టిల్‌ల వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు, కొందరు సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఇక సౌత్‌ చిత్ర పరిశ్రమల్లోని పలువురు ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా కీర్తి సురేషే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. మూగ జీవాలను ఎక్కువ ఇష్టపడే కీర్తి తన పెళ్లి ఫోటోల్లో ఒక కుక్క పిల్లకు కూడా చోటిచ్చింది. హిందూ సంప్రదాయం తర్వాత క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో కూడా వీరిద్దరూ వివాహం చేసుకోవాల్సి ఉంది. అది గురువారం సాయంత్రం ఓ చర్చిలో జరిపేందుకు పెద్దలు నిర్ణయించారట. దానికి సంబంధించిన ఫోటోలు కూడా త్వరలోనే సోషల్‌ మీడియాలో దర్శనమిస్తాయి.