Read more!

English | Telugu

రిలీజ్‌కి ముందే చచ్చిపోతున్న సినిమాలు.. పోలీసులను ఆశ్రయించిన నిర్మాత!

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తెలుగు సినిమా వన్నె తగ్గుతోంది. అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న సినిమాలు కొన్ని ఉన్నప్పటికీ అవి పరిమితంగానే ఉంటాయి. సంవత్సరానికి 100కి పైగా తెలుగు సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. వాటిలో ఒకటి రెండు సినిమాలకు మాత్రమే గొప్ప పేరు వస్తుంది. కలెక్షన్లు ఓ రేంజ్‌లో ఉంటాయి. మిగతా సినిమాల పరిస్థితి ఏమిటి? పాన్‌ ఇండియా తప్ప లోకల్‌గా సినిమాలు చూసే ప్రేక్షకులు లేరా? అంటే.... ఉన్నారు. అది సినిమాలో ఉన్న స్టఫ్‌ని బట్టి ఉంటుంది. ఈమధ్యకాలంలో అలాంటి సినిమాలు కూడా వచ్చాయి. మూసధోరణిలో వెళ్తున్న సినిమాలకు కొత్త టర్న్‌ ఇచ్చేందుకు గతంలోనే ఎంతో మంది దర్శకులు ప్రయత్నించారు, విజయాలు సాధించారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మంచి కంటెంట్‌ ఉన్నా కొన్ని కారణాల వల్ల సినిమాలు కిల్‌ అయిపోతోంది.  దీనిపై తెలుగు సినిమా నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. దానికి కారణం కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌ అంటున్నారు. 

ఇటీవల విడుదలైన విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్‌’కు ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చాయి. సినిమా విడుదల కాకుండానే కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌లో నెగెటివ్‌ రివ్యూస్‌ ఇచ్చేశారు. దీంతో సినిమా బాగాలేదని బాగా ప్రచారం జరిగింది. ఇది సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించింది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో చిత్ర నిర్మాత దిల్‌రాజు సయంగా రంగంలోకి దిగారు. మైక్‌ పట్టుకొని పబ్లిక్‌ ఒపీనియన్‌ అడిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తమ సినిమాను కావాలనే బ్యాడ్‌ చేస్తూ తమపై టార్గెట్‌ చేస్తున్నారని విజయ్‌ దేవరకొండ మేనేజర్‌ అనురాగ్‌ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్న యూనిట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సోషల్‌ మీడియా అంతగా అందుబాటులో లేని రోజుల్లో సినిమా రిలీజ్‌ అయిన తర్వాత వారం రోజులకు ఒక దినపత్రికలో దానికి సంబంధించిన రివ్యూ వచ్చేది. ఆరోజుల్లో దాన్నే ప్రామాణికంగా తీసుకునేవారు. మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీ పెరిగింది. సినిమా రిలీజ్‌ అయిన కొన్ని గంటల్లోనే రివ్యూ వచ్చేస్తోంది. ఒక సినిమా భవితవ్యాన్ని రివ్యూ మార్చగలదా? సినిమా బాగున్నప్పటికీ నెగెటివ్‌ రివ్యూ ఇస్తే జనం సినిమాను చూడరా? మీడియాకు అంత శక్తి ఉందా? కావాలని చేసే ఇలాంటి వాటిని ఎలా అడ్డుకోవాలి? బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ హాట్‌గా చర్చ జరుగుతోంది. 

సినిమాల ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి విజయ్‌ దేవరకొండ మేనేజర్‌ అనురాగ్‌ వివరిస్తూ ‘వరల్డ్‌వైడ్‌గా సినిమాలు రిలీజ్‌ అయితే మొదట అమెరికాలో షోలు వేస్తారు. అక్కడ సినిమా చూసిన వారు వెంటనే రివ్యూ పోస్ట్‌ చేసేస్తారు. దీంతోపాటు బుక్‌మై షో ఆడియన్స్‌ నుంచి రేటింగ్స్‌ కలెక్ట్‌ చేస్తుంది. ఇండియాలో షోలు వేసే టైమ్‌కి అమెరికాలో షోలు పూర్తయిపోతాయి. రిజల్ట్‌ బయటికి వచ్చేస్తుంది. అక్కడ షో పూర్తయిన వెంటనే ట్విట్టర్‌ రివ్యూ పోస్ట్‌ చేస్తారు. సినిమా బాగోలేదని ట్విట్టర్‌లో నెగెటివ్‌ రివ్యూలు వరసగా రావటం మొదలైతే వాటి ప్రభావం ప్రేక్షకులపై పడుతుంది. సినిమా చూడాలా వద్దా అని ఆలోచిస్తారు. బుక్‌మై షోలో ఇచ్చే రేటింగ్స్‌ వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి’ అంటూ తెలిపారు. 

విదేశాల్లో తెలుగు సినిమాలకు ఈమధ్యకాలంలో మంచి క్రేజ్‌ వచ్చింది. అక్కడ మంచి కలెక్షన్స్‌ రాబడితే నిర్మాతకు ఎంతో లాభం చేకూరుతుంది. అక్కడ కలెక్షన్లు తగ్గితే నిర్మాతకు ఎంతో భారీ నష్టం వస్తుంది. అది గమనించిన కొందరు కావాలనే తమ సినిమాపై దుష్ప్రచారం చేస్తునారని అంటున్నారు దర్శకనిర్మాతలు. యూట్యూబ్‌లో సినిమా రిలీజ్‌కి ముందే రివ్యూ ఇవ్వడం అనే విషయాన్ని చిత్ర పరిశ్రమ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఛాంబర్‌ తరపున కొన్ని నియంత్రణ చర్యలు తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో పోలీసు డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉన్నతాధికారులతో కూడా చర్చలు జరిపారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు కోరుతున్నారు.