English | Telugu
'కన్నప్ప'లో మోహన్ బాబు.. మరో సీనియర్ స్టార్ కూడా!
Updated : Nov 9, 2023
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి సూపర్ స్టార్స్ కన్నప్ప ప్రాజెక్ట్ లోకి రావడంతో ఈ మూవీ స్థాయి పెరిగింది. ఇప్పుడు ఈ భారీ తారాగణంలోకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విలక్షణ నటుడు శరత్ కుమార్ కూడా వచ్చారు. ఈ ఇద్దరు సీనియర్ నటులు తమ విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పుడు ఈ ఇద్దరు 'కన్నప్ప'లో ఎలాంటి పాత్రలు పోషించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.తాజాగా ఈ ఇద్దరు కన్నప్ప సెట్స్ లో అడుగుపెట్టారు.
శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీకాళహస్తిలోని గుడిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మహాభారతం సీరియల్ తీసిన ముకేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుగుతోంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. విష్ణు సరైన విజయాన్ని అందుకొని చాలా కాలం అవుతోంది. మరి ఎందరో స్టార్స్ భాగమైన ఈ భారీ సినిమాతోనైనా విష్ణు ఘన విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.