English | Telugu

‘మలైకోటై వాలిబన్’ మూవీ రివ్యూ


మూవీ : మలైకోటై వాలిబన్
నటీనటులు: మోహన్ లాల్, సోనాలి కులకర్ణి, హరీశ్ పేరడీ, ధనీష్ సైత్, మనోజ్ మోసెస్, మణికందన్ ఆర్. ఆచారి తదితరులు
ఎడిటింగ్: దీపు ఎస్. జోసెఫ్
సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్
మ్యూజిక్: ప్రశాంత్ పిల్లై
నిర్మాతలు:  శిబు బేబీ జాన్ , విక్రమ్ మెహతా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్
దర్శకత్వం: లిజో జోస్ పెల్లిస్సేరి
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

తాజాగా నెరు మూవీతో హిట్ ని పొందిన మోహన్ లాల్ .. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ' మలైకోటై వాలిబన్' లో నటించాడు. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...

కథ:-

ఓ ఎడారి ప్రాంతంలోని 'మలైకోటై' లో.. ఒక రెజ్లర్ తన కండబలంతో అక్కడి బలహీనులని భయపెట్టి పనిచేపిస్తుంటాడు. అక్కడికి మరో రెజ్లర్ వాలిబన్ అక్కడికి తన తమ్ముడితో కలిసి వస్తాడు‌. ఇక అక్కడి రెజ్లర్ కి వాలిబన్ కి మధ్య జరిగిన పోటీలో వాలిబన్ గెలిచి 'మలైకోటై వాలిబన్' గా నిలుస్తాడు. అయితే అక్కడ మొదలైన శత్రుత్వం అతడికి ప్రతీ గెలుపులో పరిచయం అవుతుంది. ఇక ఒక ప్రాంతంలో ఆంగ్లేయుల చేతిలో బందీలుగా ఉన్న కొంతమంది వీరులని కాపాడటానికి వాలిబన్ వెళ్తాడు. అయితే వాలిబన్ కి తెలియకుండా అతని గురువు మరో శత్రువుని తయారు చేస్తాడు. వాలబన్ తమ్ముడు ఓ అమ్మాయిని ఇష్టపడతాడు. వారి పెళ్ళికి వాలబన్ అంగీకరిస్తాడు. అయితే ఆంగ్లేయుల నుండి రెజర్లని వాలిబన్ కాపాడగలిగాడా? అతని గురువు చెప్పని శత్రువు ఎవరు? చివరికి వాలిబన్ పోటీ ఎవరితో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 


విశ్లేషణ:-

ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది వీరులు తమ ప్రాణాలని అర్పించారు. అయితే అలాంటి వీరులని ఎందరినో బంధించిన ఆంగ్లేయలు నుండి విడిపించడానికి రెజ్లర్  వాలిబన్ చేసిన పోరాటాన్ని చూపించడంలో దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరి విజయం సాధించాడు.

ఈ సినిమా కథ స్క్రీన్‌ప్లే బాగుంది. కానీ నెమ్మదిగా సాగే కొన్ని సీన్లు కాస్త ఇబ్బంది పెడతాయి.  అక్కడక్కడ కొన్ని లాజిక్ లేని సీన్లు ఉంటాయి. అయితే ఈ సినిమాకి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అదనపు బలంగా నిలిచాయి. ఆంగ్లేయుల చేతిలో చిక్కినపుడు, వాలిబన్‌ సోదరుడిలా భావించే చిన్న చనిపోయేముందు, ఇంటర్వెల్ ముందు అగోరాలతో పాటలో సినిమాటోగ్రఫీ కట్టిపడేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది.  వాలిబన్ కి విద్య నేర్పిన గురువు చెప్పే సూత్రాలు, క్లైమాక్స్ లో కొన్ని డైలాగులు గుర్తుండిపోతాయి. 

వీరుడి జీవితంలోకి ఓ స్త్రీ వస్తే అతని ప్రయాణం మరింత కఠినతరం అవుతుంది. నీతో ఉండేవాళ్ళని కూడా నువ్వు నమ్మొద్దని చెప్పే కొన్ని డైలాగులు ఆలోచింపజేస్తాయి. అయితే డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, మోహన్ లాల్ నటన అంతా బాగుంది కానీ కథే కాస్త బలహీనంగా ఉంది. ఇదే కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ప్రతీ హిస్టారికల్ థీమ్ తో వచ్చిన సినిమాలలో ఇదే జరుగుతుందనే భావన ప్రతీ ప్రేక్షకుడిలో నెలకొంటుంది. అయితే ఎన్ని గెలిచినా ఏదో ఒక పోటీలో ఓడిపోతారు. అసలు ఓటమే లేని వీరుడి కథలా ఈ కథను మలిచారు మేకర్స్.

కథనం నెమ్మదిగా సాగడం కాస్త ఇబ్బంది పెట్టిన మల్లయుద్ధం లాంటి సీక్వెన్స్, కర్రసాము , ఆంగ్లేయులతో పోరాడే సీన్స్ కొన్ని కథని చివరిదాకా చూసేలా చేస్తాయి. అయితే ఈ వీరుడికి తెలియకయండా గురువు మరో శత్రువుని తయారు చేశానని చెప్పడం వరకు బాగుంటుంది. అతనెవరో చూపించకుండా రెండవ భాగంలో ఉండుందని చెప్పడం కాస్త నిరాశకి గురిచేస్తుంది. అయితే రెండవ భాగం త్వరగా రిలీజ్ చేస్తేనే ఈ సినిమా చూసినవాళ్ళు అదీ చూస్తారు. లేదంటే ఆ క్యూరియాసిటి మిస్ అవుతుంది. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. అసభ్య పదజాలం లేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. దీపు ఎస్.‌ జోసెఫ్ ఎడిటింగ్ బాగుంది. మధు నీలజందన్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ప్రశాంత్ పిల్లై మ్యూజిక్ ప్రతీ  ఫైట్ సీక్వెన్స్ ని ఎలవేట్ చేశాయి. నిర్మాణ విలవలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:-

వాలిబన్ పాత్రలో మోహన్ లాల్ ఒదిగిపోయాడు. ఎంతలా అంటే ఈ కథకి అతనే సరైనోడులా అనిపించాడు. ప్రతీ సీన్ లో మోహన్ లాల్ హావభావాలు కట్టిపడేస్తాయి. ఇక అతనికి విద్య నేర్పిన గురువు పాత్రలో నటించిన అతను జీవించాడు. ఇక మిగిలిన పాత్రలు వారికి తగ్గట్టుగా నటించారు.


ఫైనల్ గా :-

  మోహన్ లాల్ కి సరైన కథ దొరికింది. కుటుంబంతో సహా చూసే ఓ వీరుడి కథ. 


రేటింగ్: 2.75 /5

✍️. దాసరి  మల్లేశ్