English | Telugu

ఎన్టీఆర్ బాటలోనే ప్రభాస్.. 'కల్కి 2898 AD' వాయిదా!

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న పలు పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన 'దేవర'(Devara) అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఆగస్టు 15న 'పుష్ప-2'(Pushpa 2) విడుదల కావాల్సి ఉండగా.. ఆ తేదీకి రావడం అనుమానమే అంటున్నారు. ఇప్పుడదే బాటలో 'కల్కి 2898 AD' పయనించనుందని తెలుస్తోంది.

ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ లెవెల్ లో సత్తా చాటగలిగే తెలుగు సినిమా 'కల్కి' అనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కావడంతో ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలి అనుకున్నారు.. కానీ కుదరలేదు. మే 9న విడుదల చేయనున్నట్లు ఆమధ్య ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీకి విడుదల కావడం కూడా అనుమానమే అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుందట. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్ కి మరింత సమయం తీసుకోవాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట. అందుకే ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారని సమాచారం.

ఒకవేళ 'పుష్ప-2' వాయిదా పడితే.. ఆగస్టు 15వ తేదీకి 'దేవర' రావాలని చూస్తోంది. అప్పుడు అక్టోబర్ 10కి 'కల్కి' వచ్చే అవకాశముంది. 'పుష్ప-2' వాయిదా పడకపోతే మాత్రం.. సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో కల్కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.