English | Telugu
జూనియర్ ఎన్టీఆర్ అయినా.. జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒక్కటే!
Updated : Oct 14, 2023
పోసాని అంటే వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. అతను ప్రెస్ మీట్ పెట్టాడంటే ఏదో ఒక వివాదం ఉంటుందని అందరూ అనుకుంటారు. అనుకున్నట్టుగానే తాజాగా పోసాని పెట్టిన ప్రెస్‌మీట్‌లో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టీవీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పోసాని. ఇటీవల ఆయన పెట్టిన ప్రెస్‌మీట్‌లో జూనియర్ ఆర్టిస్టులకు భరోసా కల్పించబోతున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌ని జూనియర్ ఆర్టిస్ట్‌లతో పోల్చుతూ ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానుల్ని హర్ట్ అయ్యేలా చేశాయి.
అసలు పోసాని ఏం మాట్లాడారు... ‘ఇండస్ట్రీలో అందరూ సమానమే. ఇది అందరిదీ. బి.ఎ., ఎం.ఎ. చదివిన వాళ్ళు కూడా జూనియర్ ఆర్టిస్టుల్లో ఉన్నారు. వారి సంక్షేమం కోసం సి.ఎం.గారితో మాట్లాడాను. జూనియర్, సీనియర్ అనే తేడా లేదు. వారంతా నటులు. అంతే. జూనియర్ ఎన్టీఆర్ అయినా.. జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒకటే. పెద్ద హీరోయిన్ పూజా హెగ్డే అయినా.. చిన్న హీరోయిన్ అయినా మనకి అనవసరం. వాళ్లు నటులు అంతే. పెద్ద, చిన్న అనే తేడా ఇక్కడ లేదు. అందర్నీ సమానంగా చూడాలి’ అన్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్ గురించి పోసాని చేసిన వ్యాఖ్యలు కావాలని చేసినవా.. లేక ప్రాస కోసం ప్రాకులాడుతూ.. జూనియర్ ఆర్టిస్ట్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా అనే మాటలు అన్నారా? అనేది అర్థం కాలేదు. ఏది ఏమైనా పోసాని చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు సూటిగా తగిలాయి.