English | Telugu

వ్యక్తిగతంగా ఓడిపోయినా.. సినీ జీవితంలో వారియర్‌లా పోరాడి గెలిచిన మంజు వారియర్‌!

సినిమా రంగంలో కొంతమంది జీవితాలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. వ్యక్తిగత జీవితమైనా, సినిమా జీవితమైనా.. ఇలా జరుగుతుందా అని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. అలాంటి ఎన్నో మలుపులతో, ఎన్నో సంఘర్షణలతో కూడిన జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఇప్పుడు వరస విజయాలతో ముందుకు దూసుకుపోతున్నారు ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్‌. జీవితంలో ఎన్నో అఖండ విజయాలను, ఎన్నో పురస్కారాలను పొందిన ఆమె.. తన వ్యక్తి గత జీవితంలో మాత్రం ఓడిపోయింది. తనకెంతో ఇష్టమైన, ఎన్నో కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన సినిమా పరిశ్రమను త్యాగం చేసి సంసార జీవితంలో స్థిరపడిన మంజు 17 ఏళ్ళ సుదీర్ఘమైన అనుబంధాన్ని 2015లో విడాకులతో దూరం చేసుకున్నారు. మంజు వారియర్‌ సినీ జీవితం ఎలా మొదలైంది.. ప్రస్తుతం ఆమె సినీ జీవితం, వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. 

1995లో ‘సాక్ష్యం’ అనే మలయాళ చిత్రం ద్వారా 16 ఏళ్ళకే నటిగా పరిచయమయ్యారు మంజు. తన నటనతో అందర్నీ ఆకట్టుకొని బిజీ హీరోయిన్‌ అయిపోయారు. నాలుగేళ్ళలో 20 సినిమాల్లో నటించారు. 1998లో మలయాళ స్టార్‌ హీరో దిలీప్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటివరకు కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేసారు. 1999లో ఆమె నటించిన చివరి చిత్రం ‘కన్నేయితి పొట్టుం తొట్టు’ విడుదలైంది. ఈ సినిమాలోని ఉత్తమ నటనకు జాతీయ స్థాయిలో స్పెషల్‌ జ్యూరీ అవార్డు లభించింది. అలా మంజు ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. హీరోయిన్‌గా పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే సినిమాలకు దూరంగా వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యపరచింది. 

1999 తర్వాత మరో సినిమాలో కనిపించని మంజు.. వైవాహిక జీవితంలో స్థిరపడిపోయింది. దిలీప్‌, మంజులకు ఒక అమ్మాయి కలిగింది. 90వ దశకంలో మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన మంజు వారియర్‌ గురించి అందరూ మర్చిపోయారు. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. చూస్తుండగానే పెళ్లి జరిగి 13 సంవత్సరాలు గడిచిపోయాయి. 2012లో ఆమె జీవితంలో మొదటి కుదుపు వచ్చింది. తన భర్త మొబైల్‌లో ఓ అమ్మాయి పంపిన మెసేజ్‌లు చూసి షాక్‌కి గురైంది. దాని గురించి దిలీప్‌ని అడిగితే అలాంటిదేం లేదు అంటూ సింపుల్‌గా చెప్పాడు. దాదాపు రెండేళ్ళపాటు ఆ అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. చివరికి ఆ అమ్మాయితో దిలీప్‌ కలిసి ఉండడాన్ని ప్రత్యక్షంగా చూసి తట్టుకోలేకపోయింది. అతని నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. వెంటనే విడాకులకు అప్లయ్‌ చేశారు మంజు. 2015లో దిలీప్‌ నుంచి విడాకులు తీసుకొని వైవాహిక జీవితానికి గుడ్‌ బై చెప్పారు. 

తన కూతురు కూడా తండ్రితోనే కలిసి ఉంటానని కోర్టులో చెప్పడంతో మంజుకి మరో షాక్‌ తగిలిగింది. ఒక్కసారిగా భర్త, కూతురు ఆమె నుంచి దూరంగా వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయారు. ఆమెతో విడాకులు తీసుకున్న ఏడాదికే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు దిలీప్‌. ఆ అమ్మాయి ఎవరో కాదు, కావ్య మాధవన్‌. ఈమె కూడా మలయాళ ఇండస్ట్రీలో పాపులర్‌ హీరోయిన్‌. 2016లో దిలీప్‌ని పెళ్ళి చేసుకున్న ఈమె ఆ సంవత్సరమే సినిమాలకు దూరమైంది. 

వైవాహిక జీవితం విఫలమైనా నిరాశ చెందకుండా సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేసేందుకు నిర్ణయించుకున్నారు మంజు. భర్త నిజస్వరూపం తెలిసిన నాటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టి 2014లో ‘హౌ ఓల్డ్‌ ఆర్‌ యు’ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేశారు. 15 సంవత్సరాలు దూరంగా ఉన్నప్పటికీ సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ ఆమెకు ఆదరణ తగ్గలేదు. టాలెంట్‌ ఉంటే ఎప్పటికైనా విజయాలు సాధించవచ్చు అని మంజు నిరూపించారు. అప్పటి నుంచి వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వేట్టయాన్‌’ చిత్రంలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కి జంటగా నటించారు మంజు. ప్రస్తుతం ఆమె నటించిన అరడజను సినిమాలు రిలీజ్‌ కావాల్సి ఉన్నాయి. మంజు నటి మాత్రమే కాదు, మంచి సింగర్‌ కూడా. 1995 నుంచి ఇప్పటివరకు నటిగా, సింగర్‌గా ఆమెకు లభించిన అవార్డుల గురించి తెలుసుకుంటే అందరూ ఆశ్చర్యపోతారు. నేషనల్‌ అవార్డుతోపాటు కేరళ స్టేట్‌ అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, ఫిలిం క్రిటిక్స్‌ అవార్డులు, ఏషియానెట్‌ అవార్డులు.. ఇలా ఓ 50 అవార్డులు ఆమెను వరించాయంటే నటిగా ఆమె టాలెంట్‌ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.