English | Telugu
ఏ ఇండియన్ హీరో సాధించని రికార్డు.. ఇప్పుడు సూర్య సొంతం!
Updated : Nov 21, 2023
తమిళ్ హీరోల్లో కమల్‌హాసన్, విక్రమ్‌ల తర్వాత ప్రయోగాలకు మొగ్గు చూపే హీరో సూర్య, సినిమాలోని క్యారెక్టర్ నచ్చితే దానికోసం ఎంత రిస్క్ చెయ్యడానికైనా వెనుకాడని సూర్య తన ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండాలని కోరుకుంటాడు. అతని కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తే రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండే సినిమాలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా సూర్య హీరోగా వస్తున్న ‘కంగువా’ కూడా అలాంటి ఓ విభిన్నమైన సినిమాయే. ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్ రిలీజ్ అయిన తర్వాత చాలా హైప్ వచ్చింది. కోలీవుడ్‌లో, టాలీవుడ్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను దేశంలోని 10 భాషల్లో రిలీజ్ చెయ్యాలని నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్‌రాజా భావించాడు. హిందీతో కలుపుకుంటే 5 భాషల్లో పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. మరి ‘కంగువ’ 10 రిలీజ్ చేస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 38 భాషల్లో రిలీజ్ చెయ్యబోతున్నట్టు నిర్మాత జ్ఞానవేల్‌రాజా ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. 3డి, ఐమాక్స్ ఫార్మాట్లలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా ఇన్ని భాషల్లో రిలీజ్ అవ్వలేదు. జ్ఞానవేల్ చెప్పినట్టు ‘కంగువ’ 38 భాషల్లో రిలీజ్ అయ్యేట్టయితే ఇది ఒక సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలోనటరాజ్, జగపతిబాబు, యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే, కోవై సరళ, ఆనంద్ రాజ్, రవి రాఘవేంద్ర, కె.ఎస్.రవికుమార్ తదితరులు నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2024 సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.