English | Telugu

అఖండ2 రిలీజ్‌ని ఆపండి.. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు?

ఇటీవలికాలంలో పెద్ద హీరోల సినిమాల రిలీజ్‌కి ఏదో ఒక అడ్డంకి రావడం మనం చూస్తున్నాం. ఆర్థికపరమైన సమస్య కావచ్చు, సామాజిక పరమైన సమస్య కావచ్చు. ఆయా సినిమాల రిలీజ్‌ ముందు రోజు కొన్ని సంస్థలు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ లేటెస్ట్‌ సినిమా 'అఖండ2'కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందనే వార్తలు వస్తున్నాయి. సాక్షాత్తూ మద్రాస్‌ హైకోర్టు.. 'అఖండ2' రిలీజ్‌ని ఆపాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందని చెబుతున్నారు.


వివరాల్లోకి వెళితే.. 2021లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'అఖండ2' చిత్రాన్ని నిర్మించారు 14 రీల్స్‌ ప్లస్‌ అధినేతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఒకరోజు ముందుగానే 'అఖండ2' ప్రీమియర్స్‌ వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలకు ఒక భారీ షాక్‌ తగిలింది.


'అఖండ2' చిత్రం విడుదలను ఆపాలంటూ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తమకు 28 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు 14 రీల్స్‌ ప్లస్‌ అనే పేరుతో సినిమాలు నిర్మిస్తున్నారని కోర్టుకు తెలిపారు. తమకు చెల్లించాల్సి బకాయిలు మొత్తం ఇచ్చేవరకు అఖండ2 చిత్రం రిలీజ్‌ని నిలిపివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన మద్రాస్‌ హైకోర్టు ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 'అఖండ2' చిత్రం విడుదలను ఆపెయ్యాలంటూ వార్తలు వచ్చినట్టు చెబుతున్నారు. మరి ఈ సమస్య నుంచి 'అఖండ2' నిర్మాతలు ఎలా బయటపడతారు, సినిమాను టైమ్‌కి రిలీజ్‌ చెయ్యగలరా? అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.