English | Telugu
ఆ వాసువర్మ నేను కాదు.. క్లారిటీ ఇచ్చిన ‘జోష్’ డైరెక్టర్!
Updated : Sep 26, 2023
సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నారు. డ్రగ్స్ వాడకం సినీ ప్రముఖుల్లోనే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగా తమ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హీరో నవదీప్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో సినిమా పరిశ్రమకు చెందిన దర్శకుడు మంతెన వాసువర్మ, రచయిత మన్నేరి పృథ్వీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 70 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వాసువర్మ ‘జోష్’ డైరెక్టర్ అని వార్త వచ్చిన విషయం తెలిసిందే. దీని గురించి వాసువర్మ క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో అరెస్టయిన వాసువర్మ తాను కాదని, ఆయన కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనని ‘జోష్’ దర్శకుడు వాసువర్మ క్లారిటీ ఇచ్చారు.
ఈ విషయమై వాసువర్మ రిలీజ్ చేసిన వీడియోలో ‘నేను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యానని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నా ఫొటోను, నా పేరును వాడుతూ ఆ వార్త వచ్చింది. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. నాకు ఆ కేసుతో సంబంధం లేదు. అసలు నా పేరు ఎలా వచ్చింది అని ఎంక్వరీ చేస్తే నా పేరుతోనే ఇండస్ట్రీలో మరో డైరెక్టర్ ఉండడం వల్ల నేనే అనుకొని ఆ వార్తను ప్రచారం చేశారు. ఇప్పటికైనా ఆ వాసువర్మ నేను కాదని, అందరూ గుర్తిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ క్లారిటీ ఇచ్చారు ‘జోష్’ డైరెక్టర్ వాసు వర్మ.