English | Telugu
జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ని తక్కువ అంచనా వేశారా..?
Updated : Sep 23, 2024
ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ మాస్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే ఉండే సందడే వేరు. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటి ఎన్టీఆర్ ఫాలోయింగ్ ని 'దేవర' (Devara) టీం తక్కువ అంచనా వేసిందా..? (Devara Pre Release Event)
ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇండోర్ లో చేయడం అనేది రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ వర్ష సూచన, పోలీస్ పర్మిషన్ వంటి కారణాలతో ఐదు వేల మందికి అటుఇటుగా సరిపోయే నోవోటెల్ లో ప్లాన్ చేశారు. ఫ్యాన్స్ కి పాసులు పదివేలు దాకా పంచినట్లు తెలుస్తుండగా, ఏకంగా 30 వేల మంది దాకా అభిమానులు వచ్చారని అంచనా. దీంతో పోలీసులకు, సెక్యూరిటీ సిబ్బందికి అభిమానులను కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో చివరికి ఈవెంట్ నే పూర్తిగా రద్దు చేశారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ కలిగించింది.
ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా అని, ఆయన స్పీచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని, అలాంటిది ఇలా లాస్ట్ మినిట్ లో ఈవెంట్ క్యాన్సిల్ చేయడం ఏంటని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఏమైనా చిన్న హీరో అనుకుంటున్నారా? అసలు ఆయన సినిమా ఈవెంట్ ఇండోర్ ప్లాన్ చేయడం ఏంటి? అని కొందరు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంకా కొందరైతే మూవీ మేకర్స్ పైనా, ఈవెంట్ ఆర్గనైజర్స్ పైనా సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ రంగంలోకి దిగి.. కొంతవరకు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశాడు.
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం తనకు బాధ కలిగించిందని తెలుపుతూ.. అభిమానుల కోసం ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు. మిమ్మల్ని కలవడం కోసం, 'దేవర' గురించి మీకు చెప్పడం కోసం ఎంతగానో ఎదురుచూసానని.. కానీ సెక్యూరిటీ కారణాల వల్ల ఇలా జరిగిందని చెప్పాడు. సెప్టెంబర్ 27న విడుదలయ్యే దేవర సినిమా మీకు నచ్చుతుందని, మీరు కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని తెలిపాడు. ఎన్టీఆర్ వీడియోతో ఫ్యాన్స్ దాదాపు కూల్ అయ్యారు. భవిష్యత్ లో ఇలా ఇండోర్ లో ఈవెంట్ లు ప్లాన్ చేయొద్దని, అలాగే తమ ఆనందం కోసం 'దేవర' సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.