English | Telugu

దేవర ఓటీటీ అప్డేట్.. వర్కౌట్ అవుతుందా..?

కొంతకాలంగా చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మెజారిటీ సినిమాలు.. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో అడుగుపెడుతున్నాయి. అయితే దీని వల్ల జనరల్ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని, దీంతో వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతుందని బయ్యర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని కోరుతున్నారు. అయినప్పటికీ భారీ సినిమాలు కూడా.. కేవలం నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు 'దేవర' చిత్రం.. దీనికి ముగింపు పలికి, ఎనిమిది వారాల ట్రెండ్ కి శ్రీకారం చుట్టడానికి సిద్ధమైంది.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'దేవర' (Devara).. భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలవుతోంది. తెలుగు స్టేట్స్ నుంచి ఓవర్సీస్ వరకు అన్ని చోట్లా బుకింగ్స్ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లాంగ్ రన్ లో కూడా ఈ సినిమా సంచలన వసూళ్లు సాధించేలా మేకర్స్ అడుగులు వేస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీ విడుదల చేసేలా మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారట. ఓ రకంగా ఇది మంచి నిర్ణయమని చెప్పవచ్చు. దీంతో సినిమా చూసేవారి సంఖ్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఓటీటీలో విడుదలైన తర్వాత చూడొచ్చులే అనుకునే వారు కూడా.. థియేటర్లలో సినిమా చూడటానికి ఆసక్తి చూపే అవకాశముంది.

కాగా, దేవర మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఏకంగా రూ.155 కోట్ల రికార్డు ధరకు రైట్స్ ని సొంతం చేసుకుందని సమాచారం.