English | Telugu

మొదటిరోజు కలెక్షన్స్‌లో ‘దేవర’ దూకుడు.. ఆ రికార్డు మళ్లీ ఎన్టీఆర్‌కే సాధ్యమైందా?

బాహుబలి వంటి భారీ బడ్జెట్‌ చిత్రాల తర్వాత తెలుగు సినిమా రేంజ్‌ బాగా పెరిగింది. అదే స్థాయిలో భారీ బడ్జెట్‌తో మరిన్ని సినిమాలు వస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రం వాళ్ళు అనుకున్న మార్క్‌ని చేరుకోగలుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈమధ్యకాలంలో అలాంటి భారీ అంచనాలు ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన ‘దేవర’ చిత్రంపై ఏర్పడ్డాయి. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ శుక్రవారం విడుదలై కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కోస్టల్‌ ఏరియా బ్యాగ్‌డ్రాప్‌తో విడుదలైన ఈ చిత్రం భారీ హైప్‌ మధ్య విడుదల కావడంతో కలెక్షన్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 

ఎన్టీఆర్‌లోని నట విశ్వరూపం విశ్వరూపం చూపించిన సినిమా ‘దేవర’. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. దేవరకు సంబంధించి ఏ రేంజ్‌ బిజినెస్‌ జరిగిందంటే.. నైజాంలో రూ. 44 కోట్లు, సీడెడ్‌లో రూ. 22 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 46.55 కోట్లతో కలిపి తెలుగులో రూ. 112.55 కోట్లు బిజినెస్‌ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 16 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, రెస్టాఫ్‌ ఇండియా ప్లస్‌ హిందీలో రూ. 20 కోట్లు, కేరళలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 27 కోట్లతో కలుపుకుని రూ. 182.55 కోట్లు వ్యాపారం జరిగింది. ఈ సినిమా విడుదలైన మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు కలెక్ట్‌ చేసి ఎన్టీఆర్‌ స్టామినా ఏమిటో చూపిస్తోంది. ఇక ఈ సినిమాకి రిలీజ్‌ అన్ని చోట్ల నుంచి మంచి టాక్‌ వస్తోంది. దీన్ని పక్కనపెడితే మొదటి రోజు ఈ సినిమాకు రెస్పాన్స్‌ అద్భుతంగా వచ్చింది. దీంతో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించబోతుంది. తొలి రోజు రికార్డు స్థాయిలో డిఫరెంట్‌ యాక్షన్‌తో వచ్చిన ‘దేవర’ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్‌ డే టాక్‌తో సంబంధం లేకుండా స్పందన భారీ స్థాయిలో లభించింది. 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ ఏరియాల వైజ్‌ ఎంత కలెక్ట్‌ చేసిందో తెలుసుకుందాం. నైజాం రూ.19.32 కోట్లు, వైజాగ్‌ రూ.5.47 కోట్లు, గుంటూరు రూ.6.27 కోట్లు, నెల్లూరు రూ.2.11 కోట్లు, కృష్ణా రూ.3.02 కోట్లు, ఈస్ట్‌ గోదావరి రూ.4.02 కోట్లు, వెస్ట్‌ గోదావరి రూ.3.60 కోట్లు, సీడెడ్‌ రూ.10.40 కోట్లు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ‘దేవర’ మొదటి రోజు కలెక్షన్లు సాధించింది. టోటల్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మొదటి రోజు రూ.54.21 కోట్లు(జిఎస్‌టి మినహాయించి) షేర్‌ సాధించింది ‘దేవర’. మొదటిరోజు షేర్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డును సమం చేసింది ‘దేవర’. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ‘దేవర’ కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది.