Read more!

English | Telugu

తెలుగు సినీ పాఠశాల "దాసరి"

తెలుగు సినీ రంగానికి ఆయనో మార్గదర్శి. సినిమాలకు వేగాన్ని, విలువను అందించిన సినీ పరిశోధకుడు, ఎందరో నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని తెరకు అందించిన మాస్టర్. దర్శకులకు స్టార్ స్టేటస్ తెచ్చిన డిక్టేటర్. 150 సినిమాలను డైరెక్ట్ చేసిన ఒక్కమగాడు. ఆయనే దర్శకరత్న దాసరి నారాయణరావు. బాల్యంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోని , తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టి సత్తాను చాటుకున్నారు. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, పత్రికాధినేతగా, రాజకీయనేతగా ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారు దాసరి.  సాంఘిక దురాచారాలు, అప్పటి సమస్యలు అన్నిటిని కథావస్తువులుగా చేరుస్తూ సినిమాలను తీయడం దాసరి గారికే చెల్లింది. 72వ ఏట అడుగుపెడుతున్న దాసరి బర్త్ డే కానుకగా ఆయన ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో కొన్ని మీ కోసం.

1 తాతా మనవడు:

దాసరి తొలిసినిమా..కమెడీయన్‌గా స్టార్ స్టేటస్‌లో ఉన్న రాజబాబుని హీరోగా పెట్టి కేవలం కథను నమ్మి దాసరి తీసిన ఈ మూవీ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని, మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తామో, మన పట్లా మన పిల్లలు అలాగే ఆచరిస్తారని చెప్పే సందేశాత్మక చిత్రం.

2 స్వర్గం- నరకం:

వరుసగా తొమ్మిది చిత్రాల సూపర్ హిట్స్ తరువాత దాసరి డైరెక్ట్ చేసిన సినిమా స్వర్గం-నరకం .ఈ సినిమాలో దాసరి ఫస్ట్ టైం తెర వెనుక నుంచి తెర ముందుకు వచ్చారు. అంతా కొత్తవారితో తీసిన ఈ మూవీ నవంబర్ 22, 1975 విడుదలై సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో మోహన్ బాబు లాంటి విలక్షణ నటుడ్ని తెలుగు తెరకు అందించారు దాసరి.

3 ప్రేమాభిషేకం:

దాసరి కెరిర్‌లోనే గాక తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆల్‌టైమ్ క్లాసిక్ ప్రేమాభిషేకం. ప్రేమ కథా చిత్రాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమా ప్రేమాభిషేకం. ప్రేమ, త్యాగం మధ్య సాగిన సంఘర్షణ ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. అక్కినేని తన ఫాం కోల్పోతున్న టైంలో ప్రేమాభిషేకం ఆయనలో వేడి తగ్గలేదని నిరూపించింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి తెలుగునాట మారుమోగుతూనే ఉన్నాయి.

4 మేఘసందేశం:

అక్కినేనికి దాసరి అందించిన మరో హిట్ మేఘసందేశం. చక్కని నాటకీయత, వినసొంపైనా పాటలతో, కుటుంబం పరువు ప్రతిష్టలు గురించి ఆలోచించే వ్యక్తులు వీటన్నింటి చుట్టూ అల్లుకున్న కథ మేఘసందేశం. కమర్షియల్ మూవీ స్సెషలిస్ట్‌గా సూపర్ ఫాంలో ఉన్న దాసరి అందించిన క్లాస్ టచ్ ఈ సినిమా. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకత్వం, ఉత్తమ నేపథ్య గాయని, ఉత్తమ నేపథ్య గాయకుడు ఇలా జాతీయస్థాయిలో దాసరి గారి పేరు మారుమోగిపోయింది.

5 బొబ్బిలిపులి:

అన్న ఎన్టీఆర్‌ రాజకీయ జీవితానికి పునాది వేసిన చిత్రం బొబ్బిలిపులి. ఇందులోని డైలాగ్స్, ఎన్టీఆర్ యాక్టింగ్ ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపాయి. ఆవేశంగా సాగే సన్నివేశాల్ని దాసరి బాగా డీల్ చేశారు. ముఖ్యంగా కోర్టు సీన్ ఈ సినిమాకే హైలెట్. విడుదలైన రెండు వారాలకే కోటి రూపాయలు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.

6 సర్దార్ పాపారాయుడు:

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఒక దేశభక్తుడికి...తీరా స్వతంత్ర భారతం నల్లదొరల పీడనలో పడిపోయిందని గ్రహిస్తే? మరో స్వాతంత్ర్య పోరాటం చేయడానికి సిద్ధపడితే అదే సర్దార్ పాపారాయుడు. ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని మరోసారి ఆవిష్కరించారు దాసరి. తండ్రీ, కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు.

7 మజ్ను:

విషాధ ప్రేమకథల స్పెషలిస్ట్‌గా దాసరికున్న పేరును ఎవరెస్ట్‌కు తీసుకువెళ్లిన సినిమా మజ్ను. హీరోగా పడుతూ..లేస్తూ ఉన్న నాగార్జునలో దాగి ఉన్న నటుడ్ని బయటకు తీసిన చిత్రం ఇది. 1987లో వచ్చిన ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసింది. 

8 ఒసేయ్ రాములమ్మ:

హీరోయిన్‌గా విజయశాంతిని, దర్శకుడిగా దాసరిని మళ్లీ నిలబెట్టిన సినిమా ఒసేయ్ రాములమ్మ. అగ్రవర్ణాల చేతిలో అవమానాలకు గురైన ఒక మహిళ ఎలా తిరగబడిందో చెప్పడమే ఈ సినిమా కాన్సెప్ట్. 1997లో విడుదలైన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టింది.

9 అమ్మ రాజీనామా:

అమ్మను ఇతివృత్తంగా తీసుకుని తెలుగులో చాలా సినిమాలు వచ్చినప్పటికి, వాటిల్లో గొప్ప చిత్రంగా నిలిచిపోయింది అమ్మరాజీనామా చిత్రం. అందరికీ ఎప్పుడో ఒకప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. కానీ అమ్మకు మాత్రం విశ్రాంతి దొరకదు. అంటూ దాసరి ఆవిష్కరించిన అద్భుత చిత్రం అమ్మరాజీనామా. ఈ సినిమాలోని ఎవరు రాయగలరూ అమ్మా అను పాట ఇప్పటికి తెలుగు ప్లే లిస్ట్‌లో టాప్‌లో ఉంటుంది.