English | Telugu

'చోరుడు' మూవీ రివ్యూ

నటీనటులు: జి.వి ప్రకాష్ కుమార్, ఇవానా, భారతీరాజా తదితరులు
ఎడిటింగ్: శాన్ లోకేష్
మ్యూజిక్: జి. వి. ప్రకాష్ కుమార్
బిజిఎమ్: రేవా
సినిమాటోగ్రఫీ: పి.వి. శంకర్
నిర్మాతలు: జి. డిల్లీ బాబు
రచన, దర్శకత్వం: పి.వి. శంకర్
ఓటీటీ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్

కథ:
ఓ అడవిలో రాత్రివేళ హత్యలు జరుగుతుంటాయి. అదే సమయంలో కెంబన్(జి.వి ప్రకాష్ కుమార్) ఆ అడవికి సమీపంలో అనాధలా జీవిస్తుంటాడు. అతనికి స్నేహితుడిగా సూరి( దేనా) ఉంటాడు. కెంబన్, సూరి కలిసి రాత్రి సమయంలో దొంగతనాలు చేసి ఆ డబ్బులతో జీవనం సాగిస్తుంటారు. భారతీరాజాని దత్తత తీసుకుంటాడు కెంబన్. ఇక కెంబన్ వ్యక్తిత్వం చూసి బాలామణి(ఇవానా) ప్రేమలో పడుతుంది. అయితే అనుకోకుండా బాలామణికి కెంబన్ గురించి ఓ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత కెంబన్ లైఫ్ ఎలా మారింది? బాలామణి ప్రేమ గెలిచిందా? భారతీరాజా గతమేంటనేది మిగతా కథ.

విశ్లేషణ:
అడవిలో అర్థరాత్రి దారుణమైన హత్య.. మరోవైపు భారతీరాజాని తాతాయ్య అంటూ కెంబన్ దత్తత తీసుకోవడం లాంటి ఆసక్తికరమైన అంశాలతో కథ మొదలైంది. కెంబన్ దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడనే పాయింట్ ని తెలియజేయడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు.

సినిమా మొత్తం మాస్ లుక్ లో కనిపించే జి.వి ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీని ఒక్క నిమిషంలో చూపించడం కాస్త నిరాశని కలుగజేస్తుంది. క్లైమాక్స్ లో భారతీరాజా గతాన్ని చూపించడం బాగున్నప్పటికి.. అది ఈ సినిమాకి అవసరం లేదనిపిస్తుంది. 

బాలామణి, కెంబన్ ల ప్రేమకథని ఎక్కువగా చూపించడంతో చాలావరకు అసలు కథని చూడాలని చూసే ప్రేక్షకుడికి కాస్త అసహనం కలుగుతుంది. అయితే సినిమా మొత్తం వీరి ప్రేమే చూపించడం.. చివర్లో ఏనుగుతో ఫైట్ సీక్వెన్స్ యాడ్ చేయడం.. అదంతా గజిబిజిగా సాగుతుంది. అసలేం జరిగింది అని అనుకునేలోపే హ్యాపీ ఎండింగ్ లాగా .. వారందరు సెటిల్ అయ్యినట్టు చూపిస్తారు‌. అసలేం చేశారని వారలా సెటిల్ అయ్యారనేది  ప్రేక్షకుడికి అర్థం కాక బుర్రపాడవుతుంది. సినిమా మొత్తం చూసాక.. ఇది చోరుడు కాదు.. బాదుడు.. అని పెట్టాల్సింది. కథని అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. క్యారెక్టర్ల నటన పరంగా సినిమా ఓకే.. కానీ కథనం చాలా స్లోగా సాగడం.. ఆసక్తికరమైన అంశాన్ని వదిలేసి బలవంతంగా ప్రేమకథని జొప్పించడం పెద్ద మైనస్ గా మారింది. పి.వి శంకర్ సినిమాటోగ్రఫీ బాగుంది. శాన్ లోకేష్ ఎడిటింగ్ లో కాస్త శ్రద్ద చూపాల్సింది. రేవా బిజిఎమ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:
కెంబన్ గా జి. వి ప్రకాష్ , సూరిగా దేనా, ఇవానా, భారతీరాజా తమ పాత్రాలకి న్యాయం చేశారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా.. 
అసలు కథని వదిలేసి, బలవంతంగా ప్రేమకథని జొప్పించడంతో.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నాడు ఈ చోరుడు.

రేటింగ్ : 2/5

✍️. దాసరి మల్లేశ్