English | Telugu
ఇవి సినిమాలు కావా..? రగిలిపోతున్న మెగా ఫ్యాన్స్
Updated : Nov 15, 2017
ఏపీ ప్రభుత్వం నిన్న సాయంత్రం ప్రకటించిన నంది అవార్డులు సినీ ప్రముఖులతో పాటు వారి అభిమానుల్లోనూ చర్చకు దారి తీశాయి. అవార్డులు వచ్చిన వారి అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా.. దక్కనివారు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ అవార్డుల ఎంపికలో మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ రగిలిపోతున్నారు మెగా అభిమానులు. ఇప్పుడు వీరికి మద్ధతుగా జాయిన్ అయ్యారు నిర్మాత, చిరు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు. నటన అంటే ఏంటో ఏపీ ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలి అంటూ సెటైర్ వేశారు.
ఆయనను సపోర్ట్ చేస్తూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో వాదనకు దిగుతున్నారు. ఈ అవార్డు ప్రకటించిన మూడేళ్ల కాలంలో మెగా హీరోలు నటించిన పదిహేను సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో రామ్‌చరణ్ ఎవడు, గోవిందుడు అందరివాడేలే, ధృవ.. బన్నీ నటించిన రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఈ సినిమాలకు పనిచేసిన 24 విభాగాల్లోని వారేవరు అవార్డులకు అర్హులు కారా.? అంటే మీ దృష్టిలో అవి సినిమాలు కాదా..? అంటూ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఆ సంగతి పక్కనబెడితే ప్రభుత్వాన్ని తప్పుబడుతూ తాను చేసిన పోస్టును బన్నీ వాసు కొద్దిసేపటికే డిలీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.