English | Telugu
మేనల్లుడుతో వింటేజ్ పవర్ స్టార్.. స్టిల్ అదిరింది 'బ్రో'!
Updated : Jun 27, 2023
మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పవన్, సాయి తేజ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. త్వరలో టీజర్ విడుదల కానుంది.
'బ్రో' విడుదలకు ఇంకా నెల రోజులే సమయముంది, ఇంతవరకు టీజర్ కూడా విడుదల చేయకపోవడం ఏంటంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ని అడుగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. త్వరలోనే టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ను వదిలారు. ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' సినిమా రోజులను గుర్తు చేస్తున్నారు. ఆ సినిమాలోని 'వయ్యారి భామ' సాంగ్ లో రైల్వే కూలీలా పవన్ ఎర్ర చొక్కా, ఎక్క కండువా, లుంగీ ధరించడం అప్పట్లో ట్రెండ్ అయింది. ఇప్పుడు దానిని రీక్రియేట్ చేస్తూ పవన్ ఇచ్చిన స్టిల్ అదిరిపోయింది. మామ బాటలోనే అల్లుడు అన్నట్లుగా సాయి తేజ్ కూడా లుంగీ, ఎర్ర కండువాతో ఆకట్టుకుంటున్నాడు. మొత్తానికి మామ-అల్లుడు కలిసున్న ఈ మాస్ పోస్టర్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది.