English | Telugu
భారతీయుడు ఈజ్ బ్యాక్.. సేనాపతి రీఎంట్రీ.. బ్రహ్మి సర్ప్రైజ్ ఎంట్రీ!
Updated : Nov 3, 2023
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రెడ్ జెయింట్ బ్యానర్ తో కలిసి లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'భారతీయుడు 2'. వీరిద్దరి కాంబినేషన్‌లో 1996లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భారతీయుడు’గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘ భారతీయుడు 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే . శుక్రవారం ఈ సినిమా ఇంట్రో గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో ఈ గ్లింప్స్‌ను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రిలీజ్ చేశారు.
‘భారతీయుడు 2’ ఇంట్రో గ్లింప్స్‌ను గమనిస్తే.. ‘భారతీయుడు’లో లంచానికి వ్యతిరేకంగా పోరాడిన వీరశేఖరన్ సేనాపతి ఇండియాలో మళ్లీ తప్పు జరిగితే తాను తిరిగి వస్తానని చెప్పటంతో కథ ముగిసింది. అయితే ఇప్పుడు మళ్లీ దేశంలో లంచగొండితనం పెరిగిపోతోంది. లంచం లేనిదే అధికారులు ఎవరూ ఏ పనులు చేయటం లేదు. దీంతో సామాన్యుడు బతకటమే కష్టంగా మారింది. అప్పుడు భారతీయులందరూ కమ్ బ్యాక్ ఇండియన్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మళ్లీ దేశంలోకి భారతీయుడు అడుగు పెట్టాలని రిక్వెస్టులు పంపుతారు. చివరకు వీరశేఖరన్ సేనాపతి ఇండియాలోకి అడుగు పెడతారు. వచ్చిన తర్వాత సేనాపతి ఏం చేశారు.. భారతీయుడుకి భయపడి లంచాలు మానేసిన అధికారలు మళ్లీ లంచాలు తీసుకోవటానికి కారణం ఎవరు? పేట్రేగిన లంచం వల్ల దేశంలో ఎలాంటి అల్లకల్లోలాలు జరిగాయి. అనే విషయాలను ఈ గ్లింప్స్‌లో చాలా గ్రాండియర్‌గా చూపించారు డైరెక్టర్ శంకర్. గ్లింప్స్‌లోనే ఈ రేంజ్ గ్రాండియర్‌నెస్ ఉంటే ఇక సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇదే గ్లింప్స్‌లో కమల్ హాసన్‌తో పాటు హీరో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా తదితరులను మనం చూడొచ్చు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా తళుక్కున మెరిశారు. ఈ ఇంట్రో గ్లింప్స్‌ను తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్, హిందీలో మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, మలయాళంలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, కన్నడలో కిచ్చా సుదీప్ విడుదల చేశారు.
రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎడిటర్ గా ఎ.శ్రీకర ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ గా వర్క్ చేస్తున్నారు.