English | Telugu

బెల్లంకొండ వరల్డ్ రికార్డు.. స్టార్స్ కూడా టచ్ చేయలేరు!

కొందరు కుర్ర హీరోలు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు అందుకొని సర్ ప్రైజ్ చేస్తుంటే.. టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం యూట్యూబ్ లో ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా బెల్లంకొండ నటించిన చిత్రం నిలిచింది.

బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జయ జానకి నాయక'(2017). ఈ సినిమాని హిందీలోకి డబ్ చేసి 2019 లో 'పెన్ మూవీస్' యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయగా.. ఇప్పటిదాకా ఏకంగా 800 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో యూట్యూబ్ లో సింగిల్ ఛానల్ లో అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా 'జయ జానకి నాయక' రికార్డు సృష్టించింది.

బెల్లంకొండ నటించిన ఇతర సినిమాలకు సైతం హిందీ డబ్బింగ్ వెర్షన్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 'కవచం' హిందీ వెర్షన్ పలు యూట్యూబ్ ఛానల్స్ లో రిలీజ్ కాగా.. అన్నింట్లో కలిపి ఇప్పటిదాకా ఏకంగా 830 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక 'సీత' మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ కి ఒక్క ఛానల్ లోనే 640 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. పాన్ ఇండియా స్టార్ల సినిమాలకు కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదు. యశ్ నటించిన 'కేజీఎఫ్' 770 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించినప్పటికీ.. అతని ఇతర సినిమాలేవీ ఆ దరిదాపుల్లో కూడా లేవు. బెల్లంకొండ ఒక్కడే ఇలా మూడు సినిమాలతో సంచలనం సృష్టించాడు.