English | Telugu
బాలయ్య, రావిపూడి.. ట్రెండ్ సెట్ చేశారు!
Updated : Oct 19, 2023
నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్ మెచ్చే అంశాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్ లు ఆశిస్తారు ప్రేక్షకులు. దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలేమో కామెడీకి కేరాఫ్ అడ్రెస్ అన్నట్టుగా ఉంటాయి. అలాంటిది ఈ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారని ప్రకటన వచ్చినప్పుడు.. బాలయ్య రూట్ లోకి రావిపూడి వెళ్తాడా? లేక రావిపూడి రూట్ లోకే బాలయ్య వెళ్తాడా? అని చర్చలు జరిగాయి. కానీ ఇద్దరు రూట్ లు మార్చి ఓ కొత్త రూట్ లోకి వెళ్ళారు. అలా తీసిన సినిమానే 'భగవంత్ కేసరి'.
బాలయ్య, రావిపూడి కలయికలో రూపొందిన మొదటి సినిమా 'భగవంత్ కేసరి' నేడు(అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అటు బాలయ్య తరహా పూర్తి యాక్షన్ సినిమా కాకుండా, ఇటు రావిపూడి తరహా కామెడీ సినిమా కాకుండా.. ఇద్దరూ కలిసి ఓ వైవిధ్యమైన సినిమాని అందించారు. ఇది బలమైన భావోద్వేగాలతో రూపొందిన సినిమా. మాస్ ప్రేక్షకులు మెచ్చే యాక్షన్ సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. అంతకుమించి కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే బాలయ్య పాత్రని దర్శకుడు రావిపూడి మలిచిన తీరు ఆకట్టుకుంది. వయసుకి తగ్గ పాత్రలో బాలయ్య హుందాగా కనిపించారు. తన అద్భుతమైన నటనతో కట్టిపడేసారు. బాలయ్యతో ఈ తరహా సినిమా చేయాలని ఆలోచించిన అనిల్ రావిపూడిని, తన ఇమేజ్ కి భిన్నంగా ఈ తరహా సినిమా చేయడానికి ముందుకు వచ్చిన బాలయ్యని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. సీనియర్ హీరోలు, వారితో సినిమాలు చేస్తున్న దర్శకులు ఈ తరహాలో ఆలోచిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.