English | Telugu
మళ్ళీ చేతులు కలిపిన అల్లు అర్జున్, త్రివిక్రమ్!
Updated : Jun 12, 2023
టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో ఒకటి. ఇప్పటిదాకా వీరి కలయికలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలు రాగా మూడూ విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని అందుకుంది. ఇక వీరు నాలుగో సినిమా కోసం కూడా చేతులు కలపబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి తరుణంలో ఈ ఇద్దరు మళ్లీ కలిశారు అంటూ ఓటీటీ వేదిక ఆహా ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది.
త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా 'గుంటూరు కారం' చేస్తుండగా.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'పుష్ప-2' చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ లు పూర్తయ్యాక తమ కలయికలో నాలుగో సినిమా కోసం బన్నీ-త్రివిక్రమ్ చేతులు కలిపే అవకాశముందని భావిస్తున్నారంతా. అయితే తాజాగా ఈ ఇద్దరు కలిసున్న ఫోటోని ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఆహా.. "కలిశారు మళ్ళీ 'ఇద్దరు'.. ఇక రికార్డులు వేట మొదలు" అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు "అతి పెద్ద 'మూవీ' పండుగ చేసుకుందామా?.. త్వరలోనే ఎంటర్టైన్మెంట్ 'సునామీ' కోసం సిద్ధంగా ఉండండి" అని తెలిపింది. ఆహా చేసిన ఈ ప్రకటన ఏంటో అర్థంగాక అందరూ తెగ ఆలోచిస్తున్నారు. గీతా ఆర్ట్స్ నుంచి ఇలాంటి ప్రకటన వస్తే.. ఇది ఖచ్చితంగా మూవీ అని అందరూ ఫిక్స్ అయిపోయేవారు. కానీ ఆహా నుంచి ప్రకటన రావడంతో ఇది మూవీ కాదని అర్థమవుతోంది. మరి బన్నీ-త్రివిక్రమ్ చేతులు కలిపింది ఆహాలో ప్రసారమయ్యే ఏదైనా షో కోసమా? సిరీస్ కోసమా? లేక జస్ట్ యాడ్ కోసమా? అనేది తెలియాల్సి ఉంది.