English | Telugu
ప్రిన్సిపల్ దగ్గర టీసీలు తీసుకునే మేం.. ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులు
Updated : Oct 22, 2023
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'పుష్ప: ది రైజ్', 'ఉప్పెన' చిత్రాలు 2023 జాతీయ అవార్డుల్లో సత్తా చాటాయి. ముఖ్యంగా పుష్ప చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ అవార్డులు అందుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా మైత్రి సంస్థ ప్రత్యేక పార్టీని నిర్వహించింది. ఇందులో అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ పలు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "బాలీవుడ్ కి వెళ్ళమని ఈ 20 ఏళ్ళలో దేవిశ్రీప్రసాద్ కి ఎన్నోసార్లు చెప్పాను. నేను ఆ మాట చెప్పిన ప్రతిసారీ 'ముందు నువ్వు వెళ్ళు, నీ వెనక నేనూ వస్తా' అనేవాడు. కానీ అది సాధ్యమవుతుందా అని నేను అనుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు మేమిద్దరం ఒకేసారి పుష్పతో హిందీలో కూడా మంచి విజయాన్ని అందుకున్నాం. 20 ఏళ్ళ నుంచి దేవి అంటున్న మాట నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఇద్దరికీ నేషనల్ అవార్డ్స్ రావడం పట్ల మా నాన్న(అల్లు అరవింద్) ఎంతో ఆనందించారు. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డులు వచ్చినట్టు ఉందన్నారు. ప్రిన్సిపల్ దగ్గర టీసీలు తీసుకునే మేం, ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులు తీసుకుంటామని అనుకున్నావా అని నేను ఆయనతో సరదాగా అన్నాను. ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని అంటుంటారు. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా కోరుకుంటే ఏదైనా సరే జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ నాకు జాతీయ అవార్డు రావాలని నాకంటే బలంగా సుకుమార్ కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. ఆయనే అఛీవర్.. నేను అఛీవ్ మెంట్ మాత్రమే" అని అన్నారు.