English | Telugu
హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్
Updated : Apr 7, 2011
యువ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జన్మదినం 1983 ఏప్రెల్ 8 వ తేదీ. అల్లు అర్జున్ తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. అల్లు అర్జున్ అలనాటి మేటి హాస్యనటులు స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్యగారి నట వారసుడు, మనవడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రెండవ కుమారుడు. మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవికి, నాగబాబుకీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీ స్వయానా మేనల్లుడు, అలాగే యువ హీరో రామ్ చరణ్ కి బావ అవుతాడు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచీ మంచి డ్యాన్సర్. అల్లు అర్జున్ లోని ఈ ప్రతిభను గమనించిన చిరంజీవి 2001 లో తను హీరోగా నటించిన "డాడీ" చిత్రంలో ఒక చిన్న డ్యాన్స్ బిట్ చేసే అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2003 లోదర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన "గంగోత్రి" సినిమాతో పూర్తి స్థాయి హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించారు అల్లు అర్జున్. తర్వాత ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య-2, వరుడు చిత్రాల్లో అల్లు అర్జున్ హీరోగా నటించారు. మెగాస్టార్ హీరోగా నటించిన "శంకర్ దాదా జిందాబాద్" చిత్రంలో అతిథి పాత్రలో నటించారు అల్లు అర్జున్.
ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో, తన తండ్రి అల్లు అరవింద్ తమ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నభారీ బడ్జెట్ మూవీ "బద్రీనాథ్" చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. 2011 లో మార్చ్ 6 వ తేదీన తను ప్రేమించిన స్నేహా రెడ్డితో అల్లు అర్జున్ వివాహం జరిగింది. అతని సినిమాలు మళయాళంలోకి అనువదింపబడ్డాయి. అల్లు అర్జున్ కి మన తెలుగులోనే కాకుండా మళయాళంలో కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉంది.
అల్లు అర్జున్ కి ఆర్య చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, పరుగు చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు లభించాయి. ఇలాంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలనీ, మరిన్ని ఘనవిజయాలు సాధించాలనీ, తన తాతయ్య గారి పేరు నిలబెట్టాలని ఆశిస్తూ అతనికి తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.