English | Telugu
విశ్వం మూవీ రివ్యూ
Updated : Oct 11, 2024
తారాగణం: గోపీచంద్, కావ్య థాపర్, జిష్షూ సేన్ గుప్తా, నరేష్, థర్టీ ఇయర్స్ పృథ్వీ, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, విటివి గణేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, ముకేశ్ రిషి తదితరులు
సంగీతం: చేతన్ భరద్వాజ్
డీఓపీ: కె.వి గుహన్
ఎడిటర్: కుడుముల అమర్ రెడ్డి
రచన: గోపిమోహన్, భాను-నందు, ప్రవీణ్ వర్మ
దర్శకుడు: శ్రీను వైట్ల
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్, వేణు దోనెపూడి
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్
విడుదల తేదీ: అక్టోబర్ 11, 2024
హీరోగా గోపీచంద్, దర్శకుడిగా శ్రీను వైట్ల పలు ఘన విజయాలను సొంతం చేసుకొని,టాలీవుడ్ లో తమదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొన్నేళ్లుగా ఈ ఇద్దరు విజయాల వేటలో వెనకబడిపోయారు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మొదటసారి 'విశ్వం'.అనే మూవీతో నేడు థియేటర్లలోకి అడుగుపెట్టారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
పాకిస్థాన్ కి చెందిన ఖురేషి అనే టెర్రరిస్ట్ ఇండియాలో ఒక హిందువులాగా చెలామణి అవుతూ యువతని టెర్రరిస్టులుగా మారుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఎనిమిది సంవత్సరాల వయసు గల దర్శన అనే పాపని చంపటడానికి ఖురేషి రంగంలోకి దిగుతాడు.కానీ ఆ పాప ఉన్న అపార్ట్మెంట్ లోకి గోపి(గోపీచంద్) అనే వ్యక్తి తను ప్రేమించిన ప్రియా(కావ్య థాపర్) కోసం వస్తాడు.దర్శన ప్రాణాలని ఎప్పటికప్పుడు కాపాడుతుంటాడు. ఈ ప్రాసెస్ లో ఖురేషి కి గోపి గురించి ఒక నిజం తెలుస్తుంది. అసలు దర్శన ని గోపి ఎందుకు ప్రాణాలకి తెగించి కాపాడుతున్నాడు? ఆ పోరాటంలో గోపి గెలిచాడా? ఖురేషీకి గోపి గురించి తెలిసిన నిజం ఏంటి? గోపి కి ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? దర్శన ని ఖురేషి ఎందుకు చంపాలని అనుకున్నాడు? గోపి అసలు పేరు ఏంటి? ఖురేషి నుంచి ఇండియా ఎలా సేవ్ అయ్యింది అనేదే ఈ కథ
ఎనాలసిస్
ఇలాంటి కథలు తెలుగు తెరపై ఎన్నో వచ్చాయి.కాకపోతే దేశం కోసం ప్రాణాలు ఇచ్చే యాంటీ టెర్రరిజం ఫోర్స్ ఆఫీసర్ విశ్వం కథలోకి పాప కథ వచ్చి ఉండాల్సింది.ఎందుకంటే సినిమా ప్రారంభమే పాపకి ఉన్న ప్రాణభయం గురించి చెప్పి హీరోని ఇంట్రడక్షన్ చేసినప్పుడే హీరో, పాప కోసం వచ్చాడనే విషయం ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే హీరో, హీరోయిన్ ల ఇంట్రడక్షన్, ఆ ఇద్దరి తాలూకు ఫ్లాష్ బ్యాక్ కొత్తగా ఉండటంతో పాటు చాలా బాగుంది.ఆ ఇద్దరి ఎపిసోడ్ తప్ప మిగతా కథ మొత్తాన్ని చూస్తుంటే గత చిత్రాలు చుస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ మిగతా ఆర్టిస్టుల ద్వారా వచ్చిన కామెడి బాగా వర్క్ అవుట్ అయ్యింది.డైలాగ్స్ కూడా చాలా బాగా పేలాయి. మెయిన్ కథ లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారనే ఆలోచన లేకుండా ప్రేక్షకుడు కామెడీ ని బాగానే ఎంజాయ్ చేస్తాడు. పాప తల్లి కి సంబంధించిన ఎపిసోడ్ అయితే ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టిస్తుంది.ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అంతగా పేలలేదు. ఇక సెకండ్ ఆఫ్ చాలా వేగంగా జరిగి గోపి ఫ్లాష్ బ్యాక్ ఎంటర్ అవ్వడంతో ప్రేక్షకుడు కథ విషయంలో సంతృప్తి చెందుతాడు. పైగా అమర్నాధ్ యాత్రికుల మీద జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్ ఒక్కసారిగా అందరికి స్ఫురణకు వస్తుంది.శ్రీను వైట్ల గత చిత్రం వెంకీ మూవీలో లాగా ట్రైన్ కామెడీ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. కాకపోతే హీరో తన ఫ్లాష్ బ్యాక్ ని తనే చెప్పుకోకుండా అతని ఫ్రెండ్ ద్వారా చెప్పించి ఉంటే బాగుండేది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
గోపిచంద్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎప్పటిలాగానే తన ఎనర్జటిక్ పెర్ఫార్మెన్సు తో సినిమాకి నిండుతనాన్ని తీసుకురావడంతో పాటుగా యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ సీన్స్ లో తనకి తిరుగులేదని అనిపించాడు. హీరోయిన్ కావ్య థాపర్ కూడా తన అందంతో ఆకట్టుకోవంతో పాటుగా గోపి చంద్ ని మోసం చేసేసి సినిమా అమ్మాయి పాత్రలో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది. మిగతా పాత్రల్లో చేసిన సునీల్, పృథ్వీ, నరేష్, ప్రగతి, వెన్నెల కిషోర్ లు మరోసారి సూపర్ గా కామెడీ ని పండించారు.ఇక పాప క్యారక్టర్ లో చేసిన అమ్మాయి కూడా చాలా బాగా నటించింది.
ఇక దర్శకుడు శ్రీను వైట్ల విషయానికి వస్తే మరోసారి తన టేకింగ్ తో సినిమా ఆసాంతం వేగంగా పరుగెత్తేలా చెయ్యడమే కాకుండా క్యారక్టర్ ల మధ్య పండే కామెడి విషయంలో తనకి తిరుగులేదని నిరూపించాడు.ఇక కె.వి గుహన్ ఫొటోగ్రఫీ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ గా నిల్చింది.ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో రిచ్ గా ఉండి ప్రేక్షకుల చూపులని పక్కకు తిప్పుకోలేని విధంగా చేసింది. ఇక మ్యూజిక్ ని అందించిన చేతన్ భరద్వాజ్ విషయానికి వస్తే ఆర్ఆర్ తో ప్రతి సీన్ కి అద్భుతమైన ఎలివేషన్ ని ఇచ్చాడు. కానీ సాంగ్స్ మాత్రం బాగోలేదు. ఇక నిర్మాణ విలువలు మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కానీ విధంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ తెరకెక్కించాయి. ఇక డైలాగులు సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చాయి.
ఫైనల్ చెప్పాలంటే...
రొటీన్ కథే అయినా కూడా సినిమా ఆసాంతం ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించింది.శ్రీను వైట్ల మార్క్ ఒక మాదిరిగా వర్క్ అవుట్ అయ్యిందని చెప్పవచ్చు
రేటింగ్ 2 .75 / 5
అరుణాచలం