English | Telugu

సినీ హీరోలపై పవన్ కళ్యాణ్ ఫైర్...

సనాతన ధర్మ రక్షణ విషయంలో సినీ హీరోలు, అభిమానుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. "నేను సినీ హీరోనే. నా లాంటి సినీ హీరోలకు ఎందరో అభిమానులుంటారు. ఆ అభిమానుల్లో ఎక్కువ శాతం హిందువులే ఉంటారు. సినిమా టికెట్ల కోసం పోటీపడే మీరు.. సనాతన ధర్మ రక్షణ గురించి ఒక్కసారి కూడా ఎందుకు గళం విప్పరు." అని పవన్ ప్రశ్నించారు. (Pawan Kalyan)

పవిత్రమైన తిరుపతి లడ్డుని అపవిత్రం చేసి గత పాలకులు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. హిందూ మతంపై దాడి జరుగుతుంటే హిందువులు మౌనంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానులు తమ హీరోలను ఎత్తడం కాదని, హిందూ మతంపై నోరెత్తేవారిపై గళం విప్పాలని అన్నారు. 

"అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా నేను తెలియజేస్తున్నా. దీనిమీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదా మౌనంగా కూర్చోండి. అపహాస్యం చేసే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. లడ్డు మీద మీరు జోకులేస్తున్నారు. నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో చూశాను. లడ్డు అనేది సెన్సిటివ్ టాపిక్ అని మాట్లాడారు. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నటులుగా మీరంటే నాకు గౌరవం ఉంది. కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడేముందు ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడండి" పవన్ కళ్యాణ్ అన్నారు

కాగా, తాజాగా 'సత్యం సుందరం' మూవీ ఈవెంట్ లో యాంకర్ "లడ్డు కావాలా నాయనా..?" అనగా.. హీరో కార్తీ దానిని తిరుపతి లడ్డుకి ముడిపెడుతూ.. "ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్ అది. మనకొద్దు అది." అన్నాడు.