English | Telugu
కబాలి హౌస్‌ఫుల్: టిక్కెట్ల కోసం మంత్రిగారి రికమండేషన్లు
Updated : Jul 22, 2016
సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండుగే. దాదాపు నెల రోజుల ముందు నుంచే బుకింగ్స్ ఓపెన్ చేసినా..నిమిషంలో టిక్కెట్లు ఫుల్ అయిపోతాయి. మరి అలాంటిది తమిళనాడులో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజనీ సినిమా టిక్కెట్ల కోసం సామాన్యులతో పాటు కార్పోరేట్ కంపెనీలు సైతం ఫైటింగ్ చేసుకోవడం అక్కడ సర్వ సాధారణం. తాజాగా పా రంజిత్ దర్శకత్వంలో రజనీ నటించిన కబాలి సినిమా ఫీవర్‌లో తమిళనాడు మునిగిపోయింది.
ఎక్కడైనా ఎవైనా పనులు కాకపోతే రాష్ట్ర సచివాలయాన్ని ఆశ్రయించి పనులు చేయించుకుంటారు. అలాంటిది సినిమా టిక్కెట్ల కోసం పైరవీలు మీరెప్పుడైనా చూశారా..? కాని అక్కడ ఉంది రజనీ సినిమా. కబాలి టిక్కెట్ల కోసం తమిళనాడు సెక్రటేరియట్‌లోని మంత్రిగారి పేషీ నుంచి రికమండేషన్లు థియేటర్లకు వెల్లువలా వస్తున్నాయి. ఆ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి గారి పీఏ ప్రేమకుమార్ చెన్నైలోని అభిరామ థియేటర్‌కి రాసిన లెటర్‌లో రిజ్వాన్ అనే వ్యక్తికి 10 టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. అవి కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఇవ్వాలని సూచించారు. సో.. అది రజనీ మేనియా అంటే.