English | Telugu

యూత్‌కి న‌య‌న‌తార ఇచ్చిన అడ్వైజ్ విన్నారా?

చూడు... కొంచెం కొంచెం మారుతున్న న‌య‌న‌తార‌ను చూడు. కాస్త కాస్త‌గా జ‌నాల్లోకి వ‌స్తున్న న‌య‌న్‌ని చూడు.. అనాల‌నిపిస్తోంది కొంత‌మందికి. వారికి అలా అనిపించ‌డానికి ఓ రీజ‌న్ ఉంది. మొన్న మొన్న‌టిదాకా న‌య‌న‌తార మీడియాకు, వేదిక‌ల‌కు చాలా దూరంగా ఉండేవారు. కానీ ఈ మ‌ధ్య త‌న సినిమా విడుద‌ల స‌మ‌యంలో యాంకర్ ని పిలిచి కామ‌న్ ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా మారిన త‌ర్వాత ఫ్యామిలీని, ప్రొఫెష‌న్‌ని చ‌క్క‌గా బ్యాల‌న్స్ చేస్తున్నారు.

ఇన్ని ప‌నుల మ‌ధ్య కాసింత తీరిక చేసుకుని ఓ ఇంజ‌నీరింగ్ కాలేజ్‌కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు న‌య‌న‌తార‌. అక్క‌డ విద్యార్థుల‌కు చాలా విలువైన విష‌యాలు చెప్పారు న‌య‌న‌తార‌.
విద్యార్థులు చ‌దువుల‌ను ఎప్పుడూ ప‌క్క‌న‌పెట్ట‌కూడ‌ద‌ని అన్నారు. క్యాంప‌స్‌లో ఎవ‌రితో స్నేహం చేస్తున్నార‌న్న‌ది చాలా కీల‌క‌మ‌న్నారు. చెడ్డ‌వారితో క‌లిస్తే, జీవితం అలాగే మారిపోతుంద‌ని, అందుకే స్నేహం చేసేట‌ప్పుడు ఆలోచించాల‌ని అన్నారు. ప్ర‌తిరోజూ త‌ల్లిదండ్రుల‌తో క‌నీసం ప‌ది నిమిషాలైనా గ‌డ‌పాల‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల‌ని అన్నారు.

ప్ర‌పంచంలో ఎక్క‌డ చూసినా స్ట్రెస్ ఉంటుంద‌ని, పోటీ ప్ర‌పంచంలో ఒత్తిడిని త‌ప్పించుకోవాల‌ని ఎవ‌రూ అనుకోకూడ‌ద‌ని చెప్పారు. స్ట్రెస్ లేకుండా ఉండాలంటే మ‌న‌లో ప్ర‌తిభ ఉండాల్సిందేన‌న్నారు. ఆ దిశ‌గా కృషి చేసిన‌ప్పుడే జీవితంలో అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించ‌గ‌లుగుతామ‌ని అన్నారు.స‌మ‌య పాల‌న ఉండాల‌ని, స‌మ‌యాన్ని వృథా చేయ‌కూడ‌ద‌ని, ఏం ప‌ని చేసినా 100 శాతం దాని మీద ఫోక‌స్ పెట్టాల‌ని చెప్పారు. అన్నిటికీ మించి సాధిస్తామ‌నే న‌మ్మ‌కం ప్ర‌తి ఒక్క‌రిలోనూ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని చెప్పారు.

న‌య‌న‌తార ఇంత గొప్ప‌గా, ఇంత ఆలోచ‌నాత్మ‌కంగా, సృజ‌నాత్మ‌కంగా మాట్లాడుతార‌ని అస‌లు ఊహించ‌లేద‌ని అంటున్నారు స్టూడెంట్స్. చాలా ఇన్‌స్ప‌యిరింగ్ లేడీ అని పోస్టులు పెడుతున్నారు.