English | Telugu

జానీ మాస్టర్ అరెస్ట్.. నాగబాబు షాకింగ్ కామెంట్స్!

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక ఫిమేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

జానీ మాస్టర్ వ్యవహారం కొద్దిరోజులుగా తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు జానీ మాస్టర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతుండగా.. కొందరు మాత్రం ఆయనను వెనకేస్తున్నారు. ఎప్పుడో లైంగిక వేధింపులు జరిగితే ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని, దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్లు సంచలనంగా మారాయి.

"న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు.. ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేము." అని నాగబాబు ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో "మీరు విన్న ప్రతి విషయాన్ని నమ్మకండి. ప్రతి కథకి మూడు కోణాలు ఉంటాయి. ఒకటి మన కోణం, రెండోది ఇతరుల కోణం, మూడోది నిజం." అంటూ నాగబాబు రాసుకొచ్చారు.

పేరు ప్రస్తావించనప్పటికీ ఆ ట్వీట్లు జానీ మాస్టర్ కేసుని ఉద్దేశించే నాగబాబు అర్థమవుతోంది. జానీ మాస్టర్ నేరం చేసినట్లు రుజువు కాలేదని, నిజానిజాలు తేలాల్సి ఉందని అర్థమొచ్చేలా నాగబాబు ట్వీట్లు ఉన్నాయి.

కాగా, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో జానీ మాస్టర్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అధినాయకత్వం ఆదేశించింది. అయితే జానీ మాస్టర్ ను పార్టీకి దూరంగా ఉండమని ఆదేశించినప్పటికీ.. ఆయన నేరం చేయలేదని తాము నమ్ముతున్నామని అర్థమొచ్చేలా నాగబాబు ట్వీట్లు ఉండటం విశేషం.