English | Telugu
వినూత్నంగా 'NBK 108' టైటిల్ ప్రకటన!
Updated : Jun 7, 2023
ఈమధ్య సినిమాల టైటిల్స్ ప్రకటనలోనూ వైవిధ్యం చూపిస్తున్నారు. 'NBK 108' టైటిల్ ప్రకటన విషయంలో మూవీ టీం సరికొత్త ఆలోచన చేసింది. తెలుగు రాష్ట్రాలలో 108 హోర్డింగ్స్ తో టైటిల్ ని లాంచ్ చేయనున్నారు. ఇప్పుడు ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ తన 108వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా టైటిల్ ని బాలకృష్ణ పుట్టినరోజు(జూన్ 10) కానుకగా రెండు రోజుల ముందుగానే జూన్ 8న రివీల్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ టైటిల్ ని సరికొత్తగా రివీల్ చేయబోతున్నట్లు తాజాగా వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 108 హోర్డింగ్ లతో మూవీ టైటిల్ ని లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. బాలయ్య 108వ సినిమా టైటిల్ ని 108 హోర్డింగ్ లతో రివీల్ చేయాలనే ఆలోచన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ సినిమాలో బాలకృష్ణ 'భగవంత్ లాల్ కేసరి' అనే పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారని, ఆ పాత్ర పేరునే సినిమాకి టైటిల్ గా నిర్ణయించారని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల్లో నిజమెంతో రేపటితో తేలిపోనుంది. కాగా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.