English | Telugu

'గేమ్ ఛేంజర్' స్టోరీ ఇదే.. శంకర్ పెద్ద ప్లానే వేశాడు!

మంచి మెసేజ్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించడం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ శైలి. అలా ఆయన రూపొందించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం కూడా శంకర్ అదే శైలిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ ని శంకర్ ఎలా చూపిస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

'గేమ్ ఛేంజర్'లో చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడట. తండ్రీకొడుకులుగా కనిపించనున్నాడని సమాచారం. కొడుకు పాత్రలో ఐఏఎస్ అధికారిగా కనిపిస్తాడని వినికిడి. ప్రస్తుతం రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఎక్కువ డబ్బున్న వాళ్లదే రాజ్యం అన్నట్టుగా పరిస్థితి ఉంది. డబ్బుతో ఓటర్లను కొనేసి ప్రజాప్రతినిధులుగా చలామణీ అవుతున్నారు. అలాంటి వ్యవస్థపై ఒక నిజాయితీగల ఐఏఎస్ అధికారి చేసే పోరాడమే ఈ సినిమా కథట. ప్రజలను చైతన్య పరిచి, నాయకులకు బుద్ధి చెప్పి, ఎన్నికలను న్యాయంగా జరిపించి.. మంచి పాలనను తీసుకురావడానికి ఓ ఐఏఎస్ ఏం చేశాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఇక ఈ సినిమాలో తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని.. ఆ పాత్రలో చరణ్ స్థానిక నాయకుడిగా కనిపించనున్నాడని టాక్.

స్టోరీ లైన్ ఇదే అయ్యి, దానికి శంకర్ మార్క్ కమర్షియల్ టచ్ తోడైతే.. 'గేమ్ ఛేంజర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.