Read more!

English | Telugu

విజయ్ కి ఊహించని షాక్.. 'లైగర్'కి బాయ్ కాట్ సెగ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్'. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 25న విడుదల కానుంది. సౌత్, నార్త్ ను కవర్ చేస్తూ మూవీ టీమ్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ చిత్రంతో సంచలనం సృష్టించి, విజయ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోవడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే విడుదలకు కేవలం ఐదు రోజులు ఉందనగా 'లైగర్' టీమ్ కి ఊహించని షాక్ తగిలింది. 'లైగర్'ని బాయ్ కాట్ చేయాలంటూ కొందరు నార్త్ ఆడియన్స్ పిలుపునిచ్చారు.

 

కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలకు బాయ్ కాట్ సెగ గట్టిగా తగులుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నుంచి ఈ బాయ్ కాట్ ట్రెండ్ స్టార్ట్ అయింది. నెపోటిజంతో పాటు హిందూ మత, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు వంటి కారణాలతో కూడా బాయ్ కాట్ కి పిలుపునిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' చిత్రంపై ఈ బాయ్ కాట్ ఎంతటి ప్రభావం చూపిందో తెలిసిందే. కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ బాయ్ కాట్ సెగ 'లైగర్'కి తగిలేలా ఉంది.

 

'లైగర్' నిర్మాణంలో పూరి కనెక్ట్స్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు లైగర్ కొంపముంచేలా ఉంది. స్టార్స్ తో కలిసి కరణ్ జోహార్ బాలీవుడ్ ని తన గుప్పిట్లో పెట్టుకొని సుశాంత్ సింగ్ వంటి బయటి హీరోలని తోక్కేస్తున్నారన్న అభిప్రాయం నార్త్ ఆడియన్స్ లో ఉంది. అందుకే కరణ్ జోహార్ సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న 'లైగర్'ని కూడా బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ట్విట్టర్ లో 'బాయ్ కాట్ లైగర్' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. దీంతో ఈ బాయ్ కాట్ పిలుపు 'లైగర్'పై ఎంతంటి ప్రభావాన్ని చూపుతుందోనని విజయ్ ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది.