English | Telugu

అల్లు అర్జున్ పిటిషన్‌ పై హైకోర్టు కీలక ఆదేశాలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) కి హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారంటూ, నంద్యాల పర్యటన సందర్భంగా తనపై నమోదైన కేసుని క్వాష్‌ చేయాలని కోరుతూ బన్నీ వేసిన పిటిషన్‌ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. నవంబర్ 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 6న తగిన ఉత్తర్వులిస్తామని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో తన మిత్రుడు, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు సెక్షన్‌ 144, పోలీసు 30 యాక్టు అమల్లో ఉన్నప్పటికీ  ఎలాంటి అనుమతి తీసుకోకుండా బన్నీ పర్యటించాడు. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా గుమికూడారు. ఇది ఎన్నికల ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమేనని ఫిర్యాదు అందడంతో.. అల్లు అర్జున్‌ తో పాటు శిల్పా రవిపై అప్పుడు నంద్యాల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును క్వాష్‌ చేయాలని కోరుతూ తాజాగా బన్నీ, రవిచంద్ర కిషోర్ పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నవంబర్ 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది.