English | Telugu
'ఉగ్రం' టీజర్.. అల్లరి నరేష్ ఉగ్రరూపం
Updated : Feb 22, 2023
ఒకప్పుడు కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్ కొంతకాలంగా తన రూట్ మార్చాడు. కామెడీ సినిమాలను పక్కన పెట్టి సీరియస్ సబ్జెక్టులతో అలరిస్తున్నాడు. 'నాంది' చిత్రంతో దీనికి నాంది పడింది. అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన 'నాంది' మూవీ 2021 ఫిబ్రవరిలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రెండో సినిమా రాబోతోంది. అదే 'ఉగ్రం'. ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఈ చిత్రం పట్ల ఆసక్తి ఏర్పడింది. తాజాగా విడుదలైన టీజర్.. సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది.
'ఉగ్రం' మూవీ టీజర్ తాజాగా అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా విడుదలైంది. నిమిషం 20 సెకన్ల నిడివి గల ఈ టీజర్ టైటిల్ కి తగ్గట్లే పవర్ ఫుల్ గా ఉంది. పోలీస్ ఆఫీసర్ గా మీసకట్టుతో నరేష్ ఉగ్రరూపం చూపించాడు. అదిరిపోయే యాక్షన్ సీన్స్, డైలాగ్స్ తో టీజర్ లో నరేష్ ని చూపించిన తీరు ఆకట్టుకుంది. నరేష్ గెటప్, డైలాగ్ డెలివరీ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంది. చూస్తుంటే ఈ చిత్రంలో విజయ్ కొత్త నరేష్ ని చూపించబోతున్నాడు అనిపిస్తోంది. అలాగే టీజర్ కి శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. మొత్తానికి టీజర్ చూస్తుంటే నాంది కాంబోలో మరో హిట్ ఖాయమనిపిస్తోంది.