Read more!

English | Telugu

బాహుబలి సిగలో మరో కీర్తి కిరీటం

బాహుబలి... తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవినువీధిలో రెపరెపలాడించడమే కాకుండా..తెలుగు వాడు సగర్వంగా తలెత్తుకునేలా చేసిన విజువల్ వండర్. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ లాంటి ఉద్ధండులైన నటులతో దర్శకధీరడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా స‌‌ృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. 600 కోట్ల రూపాయలు కలెక్షన్‌లు వసూలు చేసి అప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే వాదనను తిప్పికొట్టింది. ఇప్పటికే ఫిల్మ్‌ఫేర్ సహా అనేక అవార్డులు బాహుబలికి దాసోహమయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాకి మరో అరుదైన గౌరవం దక్కింది. 63వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపిక చేస్తూ భారత ప్రభుత్వం బాహుబలిని మరో మెట్టుపైన నిలిపింది.

 

తెలుగు సినిమా చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు..ఎందుకంటే ఇప్పటి వరకు అందని ద్రాక్షగా మిగిలిన జాతీయ ఉత్తమ చలన చిత్రం పురస్కారాన్ని తెలుగు సినిమా అందుకోవడం. ఇంతకు ముందు శంకరాభరణం సినిమాకు మాత్రమే స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు లేదు. బాహుబలి ఆ వెలితిని తీర్చింది. జాతీయ అవార్డులలో..ఉత్తమనటుడిగా పీకు చిత్రంలో నటనకు గానూ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. తను వెడ్స్ మను సినిమాకు గానూ ఉత్తమ నటిగా కంగనా రనౌత్, ఉత్తమ దర్శకుడిగా బాజీరావ్ మస్తానీ సినిమాకు గానూ సంజయ్ లీలా భన్సాలీ ఎంపికయ్యారు. సంజయ్ వరుసగా రెండో సారి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకోనున్నారు.