English | Telugu

సినిమా పేరు:వారసుడు
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jan 14, 2023

తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్‌కుమార్, ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, సంగీత, శ్యామ్, ప్రభు, యోగిబాబు, గణేశ్ వెంకట్రామన్, ఎస్.జె. సూర్య (గెస్ట్), సుమన్ (గెస్ట్) భరత్ రెడ్డి, సంయుక్త షణ్ముఖనాథన్, నందినీ రాయ్, శ్రీమాన్, వి.టి. గణేశన్, 
స్క్రీన్‌ప్లే: వంశీ పైడిపల్లి 
డైలాగ్స్: శ్రీనివాస్ చక్రవర్తి 
పాటలు: రామజోగయ్య శాస్త్రి 
మ్యూజిక్: తమన్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్.
ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్
నిర్మాతలు: రాజు-శిరీష్
దర్శకత్వం: వంశీ పైడిపల్లి

 

నిజానికి 'వారసుడు' ఒరిజినల్ తమిళ వెర్షన్ 'వారిసు' జనవరి 11నే విడుదలైంది. అయితే తెలుగునాట ఆ మూవీకి నిర్మాత దిల్ రాజు ఎక్కువ థియేటర్లు కేటాయించుకుని, ఒరిజినల్ తెలుగు సినిమాలకు తక్కువ థియేటర్లు ఇస్తున్నట్లు ప్రచారం బాగా జరగడం, అది వివాదాస్పదం కావడంతో ఆయన 'వారసుడు' మూవీని జనవరి 14కు రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తమిళనాట అగ్ర కథానాయకుల్లో ఒకరైన విజయ్, సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో ఒకరైన రష్మికా మందన్న జంటగా నటించిన ఈ సినిమాకు తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. మరి 'వారిసు'కు తెలుగు డబ్బింగ్ వెర్షన్ అయిన 'వారసుడు' ఎలా ఉన్నాడంటే...

 

కథ:
ఇది శ్రీమంతుల ఇంటి కథ. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఒక కార్పోరేట్ కంపెనీకి అధిపతి అయిన రాజేంద్ర (శరత్‌కుమార్) కుటుంబానికి చెందిన కథ. ఆయనకు ముగ్గురు కొడుకులు.. జయ్ (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్). జయ్, అజయ్.. ఇద్దరూ తండ్రి బాటలో బిజినెస్‌లో ఉండగా, హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న చిన్నకొడుకు విజయ్ మాత్రం తండ్రి బిజినెస్‌లో భాగం కావడం ఇష్టం లేక, సొంత అస్తిత్వం కావాలనుకుంటాడు. దాంతో తన ఇంట్లో అతడికి స్థానం లేదంటాడు తండ్రి. సరేనని ఇల్లు విడిచి బయట ప్రపంచంలోకి వెళ్లి, ఒక స్టార్టప్ కంపెనీ పెడతాడు. ఏడేళ్లు గడుస్తాయి. రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెక్‌పెట్టి మైనింగ్ కాంట్రాక్టును దక్కించుకోవాలని జేపీ (ప్రకాశ్ రాజ్) కాచుకొని ఉంటాడు. మరోవైపు రాజేంద్ర ట్రీట్‌మెంట్ అనేదిలేని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు గురవుతాడు. ఎనిమిది నుంచి పది నెల్ల వరకే బతుకుతావని అతని డాక్టర్ ఫ్రెండ్ ఆనంద్ (ప్రభు) చెబుతాడు. భార్య (జయసుధ) కోరిక మేరకు 65వ ఏట షష్టి పూర్తి చేసుకోవడానికి సరేనంటాడు రాజేంద్ర. అమ్మ పిలుపుతో ఏడేళ్ల తర్వాత ఆ ఇంటికి వస్తాడు విజయ్. వేడుక జరుగుతున్న సమయంలోనే జయ్ సంసారంలో మరో స్త్రీ చిచ్చు రేపిందనే విషయంతో పాటు, తండ్రికి తెలీకుండా అజయ్ రూ. 400 కోట్లతో వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడనీ, అది వడ్డీతో కలిపి రూ. 550 కోట్ల అప్పుకు చేరిందనే నిజం తెలుస్తుంది. తాను వచ్చిన పని అయ్యిందనే ఉద్దేశంతో తిరిగి వెళ్లిపోయిన విజయ్.. అమ్మానాన్నలు ఊహించని విధంగా తిరిగొచ్చేస్తాడు. అంతదాకా మొదటి ఇద్దరు కొడుకుల్లో ఎవరో ఒకరు రాజేంద్ర గ్రూప్ ఒఫ్ కంపెనీస్‌కు వారసుడు అవుతాడని అందరూ అనుకుంటూ ఉండగా, తన వారసుడిగా కంపెనీకి విజయ్‌ను చైర్మన్ చేస్తాడు రాజేంద్ర. ఆ తర్వాత ప్రత్యర్థి జేపీ నుంచి తన కంపెనీని కాపాడుకోవడంతో పాటు, దారి తప్పిన అన్నలను విజయ్ ఎలా దారిలోకి తెచ్చాడనేనిది మిగతా కథ.


ఎనాలసిస్ :

దర్శకులకు కొత్త ఐడియాలు తట్టడం లేదా, లేక తమకు వచ్చిన ఐడియాలే కొత్తవి అనుకుంటున్నారా? అనే విషయం బోధపడకుండా ఉంది. ఈ సంక్రాంతికి ఇంతదాకా వచ్చిన సినిమాల కథలన్నీ ఇప్పటికి వందల సార్లు చూసేసిన కథలు, సన్నివేశాలతో వచ్చినవే. 'వారసుడు' కూడా అదే బాపతు. అవి మాస్ అయితే, ఇది క్లాస్. వేల కోట్ల రూపాయల విలువచేసే సామ్రాజ్యానికి చెందిన కథ క్లాస్ ఆడియెన్స్‌కు ఏమైనా కనెక్ట్ అవుతుందేమో కానీ, జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉండే మాస్ ఆడియెన్స్‌కు ఎలా కనెక్ట్ అవుతుందనేది ప్రశ్న. 'శ్రీమంతుడు', 'మహర్షి' సినిమాల కథలు ఒక శ్రీమంతుల కథలే అయినప్పటికీ, ఆ శ్రీమంతులు సామాన్య జనం దగ్గరకు వచ్చి వాళ్లలో కలిసిపోయారు కాబట్టి.. ఆ రెండు సినిమాలూ మాస్‌కు కూడా దగ్గరయ్యాయి. కానీ 'వారసుడు' కథలో విజయ్ అనే శ్రీమంతుడు తన తండ్రి సామ్రాజ్యాన్ని రక్షించాలనీ, ఆయన కోరిక మేరకు ఆయనకు ప్రశాంతమైన చావును కలిగించాలనీ అక్కడే ఉండిపోయి, ఆ శ్రీమంతుల ఇళ్ల గొడవకు పరిమితమైపోయాడు. దానివల్ల మాస్‌కు అతను దూరమైపోయాడు. అయినా అతడిని మాస్‌గా చూపించాలని తమన్ మాస్ బీట్స్‌తో దంచిన బీజీయం కొన్నిచోట్ల కర్ణకఠోరంగా అనిపించింది.

తండ్రి సామ్రాజ్యంలో భాగం కావడం ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విజయ్.. ఆ తండ్రి చావుకు దగ్గరలో ఉన్నాడని తెలిశాక, సొంత అస్తిత్వం అంటూ చెప్పిన గొప్పల్ని పక్కనపెట్టేసి, తండ్రి సామ్రాజ్యానికి వారసుడై, అన్నల్నీ, కంపెనీనీ దారికి తేవడం, ప్రత్యర్థి జేపీని ఝలక్ ఇవ్వడం.. ఈ క్రమంలో వచ్చే సీన్లన్నీ మనం ముందే ఊహించే విధంగా వచ్చేస్తుంటాయి. ఈ తరహా కథల్ని ఎన్ని చూసేసి ఉన్నాం మనం! అయినా మన ఊహలకు తగ్గట్లే ఏమాత్రం భిన్నత్వం లేని సీన్లతో, స్క్రీన్‌ప్లేతో కథని నడిపి నిరుత్సాహపరిచాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. చాలా కాలంగా టీవీ సీరియల్స్ చూస్తూ వస్తున్నవాళ్లయితే ఇది ఫలానా సీరియల్‌లో వచ్చిన సీన్ అని కూడా చెప్పేస్తున్నారు. 'వారసుడు' కథ గురించీ, అందులోని సీన్ల గురించీ ఇంతకంటే గొప్పగా ఏం చెబుతాం! జయ్ కూతురు కిడ్నాప్ వ్యవహారం, ఆమెను దుండగుల చెర నుంచి విజయ్ కాపాడే సీన్లు సహజంగా కాకుండా మాస్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని బలవంతంగా కథలో ఇరికించినట్లు ఉన్నాయి. 

ఒక్క మాటలో చెప్పాలంటే, "నాకు ప్రశాంతమైన చావునిస్తావా?" అని అడిగిన తండ్రికి, ఆ కోరిక తీర్చిన కొడుకు కథగా 'వారసుడు'ను చెప్పవచ్చు. అక్కడక్కడా కొన్ని మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి జయసుధ చెప్పే "పిల్లల ద్వేషాన్ని భరించే శక్తి ఏ అమ్మానాన్నలకూ ఉండదు". అలాగే చివరలో "కుటుంబంలో ఎన్ని గొడవలైనా ఉండొచ్చు కానీ మనమంతా ఒక కుటుంబం" అని అర్థం వచ్చేలా విజయ్ చెప్పిన డైలాగ్ బాగుంది. ఇలాంటి హితవు చెప్పే డైలాగ్స్ ఈ సినిమాలో కొన్ని వున్నాయి.

దిల్ రాజు నిర్మాత కాబట్టి ఖర్చుకు వెనకాడకుండా సినిమా తీశారని అడుగడుగునా కనిపించే భారీతనం తెలియజేస్తుంది. హీరో కుటుంబం నివసించే ఇంటి దగ్గర్నుంచీ, వాళ్ల ఫ్యాక్టరీలు, అక్కడ ఖరీదైన కారుని కూడా కంటైనర్ పడేసి నుగ్గునుగ్గు చేసేయడం దాకా.. ఈ మూవీ నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయో చెప్తాయి. తమన్ మ్యూజిక్ ఇచ్చిన పాటలు వినసొంపుగా ఉన్నాయి కానీ, బ్యాగ్రౌండ్ స్కోర్.. చాలా చోట్ల సింకవకుండా సౌండ్ పొల్యూషన్ అనిపించింది. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. విజువల్‌గా సినిమా బాగా వచ్చిందంటే అది అతని పనితనమే. 170 నిమిషాల సేపు ఇలాంటి రొటీన్ స్టోరీని లాగడం కరెక్ట్ కాదని ఎడిటర్ ప్రవీణ్ డైరెక్టర్‌ను కన్విన్స్ చెయ్యలేకపోయాడో లేక తనే కన్విన్స్ కాలేదో! దివంగత సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైన్ సూపర్బ్. ఇటీవలి కాలంలో బీభత్సమైన ఫైట్లు చూస్తూ వస్తున్న మనకు వారసుడు చేసే ఫైట్లు కిక్ ఇవ్వలేదు.

 

నటీనటుల పనితీరు:
టైటిల్ రోల్‌లో విజయ్ తనకు అలవాటైన రీతిలో చెలరేగిపోయి చేశాడు. క్లాస్ సినిమాలో మాస్ ఫైట్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. సినిమా ఎలా ఉన్నా విజయ్ క్యారెక్టర్ ఆకట్టుకొనేలా ఉందంటే, దాన్ని డిజైన్ చేసిన విధానమే. దివ్య పాత్రలో రష్మికకు ఎక్కువ నటించే ఛాన్స్ దక్కలేదు. రెండు డ్యూయెట్లలో గ్లామర్‌ను కురిపించడానికి మాత్రం ఛాన్స్ వచ్చింది. విజయ్ తర్వాత ఆకట్టుకున్నది శరత్‌కుమార్. రాజేంద్ర పాత్రను సూపర్బ్‌గా పోషించాడు. ఆయన భార్య పాత్రలో జయసుధ బాగా రాణించారు. ప్రకాశ్ రాజ్‌కు జేపీ అనే రొటీన్ విలన్ రోల్ దొరికింది. ఆ రోల్‌లో ఆయనను చూస్తుంటే మొహం మొత్తింది. శ్రీకాంత్, శ్యామ్, ప్రభు, సంగీత తమ పాత్రల పరిధి మేరకు చేశారు. రాజేంద్ర ఇంటి నౌకరుగా యోగిబాబు మరీ నవ్వించకపోయినా అతని ప్రెజెన్స్ కాస్త రిలీఫ్‌నిచ్చింది. ఎస్.జె. సూర్య, సుమన్ గెస్ట్ రోల్స్‌లో కనిపించారు. జయ్ కాపురంలో చిచ్చు పెట్టే యువతిగా నందినీ రాయ్ సరిపోయింది. వి.టి. గణేశన్, శ్రీమాన్ కనిపించేది నాలుగైదు నిమిషాల సేపైనా, కీలక సన్నివేశానికి పనికొచ్చారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'వారసుడు'.. మాస్ ఆడియెన్స్‌కు దగ్గరయ్యే అవకాశం లేని ఒక పెద్దింటోళ్ల స్టోరీతో వచ్చిన సినిమా. ఇప్పటికే ఈ తరహా కథలను సినిమాల్లోనే కాకుండా ఎన్నో సీరియల్స్‌లోనూ చూసిన మనకు 'వారసుడు' సోసోగా అనిపిస్తాడే తప్ప కిక్కివ్వడు. విజయ్ కోసం అతని ఫ్యాన్స్ చూడొచ్చు.

- బుద్ధి యజ్ఞమూర్తి