English | Telugu
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
Rating:2.50
విడుదలయిన తేది:Dec 25, 2020
సినిమా పేరు: సోలో బ్రతుకే సో బెటర్
తారాగణం: సాయితేజ్, నభా నటేశ్, రావు రమేశ్, రాజేంద్రప్రసాద్, నరేశ్, వెన్నెల కిశోర్, సత్యా, సుదర్శన్, ఝాన్సీ, అజయ్
మ్యూజిక్: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి. దిలీప్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్
రచన-దర్శకత్వం: సుబ్బు
బ్యానర్స్: జీ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల తేదీ: 25 డిసెంబర్ 2020
లాక్‌డౌన్ అనంతరం వస్తున్న తొలి సినిమాగా ప్రచారానికి నోచుకోవడంతో 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీపై ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఫోకస్ పెట్టింది. ప్రేక్షకులు థియేటర్లకు రప్పించడానికి అనేకమంది పేరుపొందిన సెలబ్రిటీలు ఈ సినిమాకు విషెస్ చెప్పడంతో మంచి ప్రచారమూ లభించింది. సాయితేజ్ హీరోగా నూతన దర్శకుడు సుబ్బు రూపొందించిన ఈ సినిమా ఇండస్ట్రీ ఆశల్ని నిలబెట్టేదిగా, ప్రేక్షకులను అలరించే రీతిలో ఉందా?
కథ
వైజాగ్ కుర్రాడు విరాట్ (సాయితేజ్) ఫిలాసఫీ ఒక్కటే.. 'సోలో బ్రతుకే సో బెటర్' అని. ఈ విషయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి, మదర్ థెరిసా, అబ్దుల్ కలాం, ఆర్. నారాయణమూర్తి, లతా మంగేష్కర్ లాంటివాళ్లు అతడికి ఆరాధ్యదైవాలు. తన చదువుకొనే కాలేజీలో ఇదే విషయంపై లెక్చర్స్ ఇచ్చి, సోలోగా బతకడంలోనే ఎంజాయ్‌మెంట్ ఉందనీ, ప్రేమ, పెళ్లి అనే బంధాల్లోకి చిక్కుకుంటే బతుకు బస్టాండే అనీ నూరిపోస్తుంటాడు. అతడికి మేనమామ (రావు రమేశ్) ప్రోత్సాహాన్నిస్తుంటాడు. చదువు అయిపోయాక ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కు తన ముగ్గురు స్నేహితులతో కలిసి వస్తాడు. అయితే అప్పటిదాకా అతడి ఫిలాసఫీ తమ ఫిలాసఫీ అంటూ వచ్చిన ఆ ముగ్గురు మిత్రులు పెళ్లి సంబంధాలు రావడంతో ఒక్కొక్కరుగా వెళ్లిపోతారు. అనూహ్యంగా అతడి జీవితంలోకి అమృత ప్రవేశిస్తుంది. విరాట్ తన ఫిలాసఫీని పక్కనపెట్టి ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. కానీ ఆమెదీ సోలో బ్రతుకే బెటర్ ఫిలాసఫీయే. చివరకు ఆ ఇద్దరూ ఒక్కటవుతారా, లేదా? అనేది ముగింపు.
ఎనాలసిస్ :
"సోలో బ్రతుకు అంటే సోల్‌లెస్ బ్రతుకు" అని చెప్పాలనుకున్నాడు దర్శకుడు. అంటే హీరో ఏ ఫిలాసఫీనైతే కాలేజీ కుర్రాడిగా ఉన్నప్పుడు నమ్మాడో, అది తప్పనీ, మనిషికి ఓ తోడు తప్పనిసరిగా అవసరం అనీ చెప్పాలనుకున్నాడన్న మాట. దాని కోసం అతడు కల్పించిన కొన్ని సన్నివేశాలు మరీ డ్రమటిక్‌గా ఉండటం సినిమాకు మైనస్‌గా మారాయి. సోలో బ్రతుకు సోల్‌లెస్ బ్రతుకు అని చెప్పడం అంటే మదర్ థెరిసా, వాజ్‌పేయి, అబ్దుల్ కలాం లాంటి మహనీయుల బ్రతుకులూ అంతేనని చెప్పడం కాదా? ఈ విషయాన్ని ఎంతమంది అంగీకరిస్తారు? తాము ఒంటరి జీవితాన్ని గడిపినందుకు వాళ్లెప్పుడూ రిగ్రెట్ అయిన సందర్భం లేదు. మరైతే అది యూనివర్సల్ పాయింట్ ఎలా అవుతుంది?
"ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి.. పెళ్లి చేసుకోవాలి" అని ఆర్. నారాయణమూర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఆయన స్వీయానుభవం. దాన్ని హీరో రియలైజేషన్ పాయింట్‌లలో ఒకటిగా దర్శకుడు చూపించడం బాగానే ఉంది కానీ, హీరో తను ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాడో పూర్తిగా రియలైజ్ అవడానికి ఇద్దరు మనుషులు చనిపోవాల్సి వచ్చింది. వారిలో ఒకరు మేనమామ భార్య. ఏ మేనమామైతే తనను సోలో లైఫ్ బెటర్ అని ఉద్బోధించాడో.. ఆ మేనమామ తన భార్య చనిపోయాక ఎలా దిగులుపడిపోయాడు.. తోడు కోల్పోయాక ఎలా అయిపోయాడో చూసి, అగమ్యగోచర స్థితిలో పడిపోయాడు హీరో.
చనిపోయిన రెండో మనిషి ఎవరనేది ఇక్కడ ప్రస్తావిస్తే కథంతా రివీల్ చేసినట్లవుతుంది. ఆఖరుకు హీరోయిన్‌లో మార్పు తీసుకురావడానికి కూడా ఆమె తల్లిని హాస్పిటల్ పాలు చేయాల్సి వచ్చింది. ఇలాంటి షాకింగ్ ఇన్సిడెంట్స్, బాధాకరమైన, విషాదకరమైన సందర్భాలు లేకపోతే.. మనుషులు రియలైజ్ కారా? హీరోకు అత్యంత సన్నిహితంగా ఉంటూ, అతడి ఫిలాసఫీయే తమ ఫిలాసఫీ అని నమ్మి, అతడితో పాటు వచ్చిన ముగ్గురు స్నేహితులు తమకు పెద్దలు పెళ్లి సంబంధాలు చూసేసరికి ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఒప్పేసుకొని, హీరోను వదిలేసి వెళ్లడం కన్విన్సింగ్‌గా లేదు.
సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ కంటే బాగా వచ్చింది వెన్నెల కిశోర్ చేసిన గోవింద్ క్యారెక్టరైజేషన్. విరాట్ ఇంటి యజమాని కొడుకుగా, కన్నడం వాడిగా కిశోర్ పాత్రను దర్శకుడు బాగా మలిచాడు. సినిమాలో అతను కనిపించాడంటే వినోదం గ్యారంటీ అనేలా గోవింద్ క్యారెక్టర్ ఉంది.
హీరోయిన్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చేది ఫస్టాఫ్ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనంగా. ఆమె ఎంట్రీ ఇంటర్వెల్ బ్యాంగ్‌కు బాగానే పనికొచ్చింది. సెకండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తించేలా ఆ బ్యాంగ్ పెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ సెకండాఫ్‌ను ఉత్కంఠభరితంగా నడిపించడంలోనే అతను ఫెయిలయ్యాడు. దాదాపు అన్ని సన్నివేశాలు మన ఊహలకు అనుగుణంగానే వచ్చేస్తుంటాయి. హీరో తన భావాలు తప్పని తెలుసుకుంటూ, ఆ పెయిన్‌ను అనుభవించే సన్నివేశాలను మరింత ఎఫెక్టివ్‌గా చూపించవచ్చు. అజయ్ క్యారెక్టర్‌ను రెండు ఫైట్ల కోసం పెట్టారు. ఆ రెండు ఫైట్లూ హీరో హీరోయిన్ల మధ్య బాండింగ్‌ను క్రియేట్ చేయడానికి జొప్పించినట్లు ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి.
తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు ఓ ప్లస్ పాయింట్. రెండు మూడు పాటలు అలరించాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కు వంక పెట్టాల్సిందేమీ లేదు. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. దర్శకుడిచ్చిన సన్నివేశాల్ని ఎడిట్ చేయడానికి నవీన్ నూలి ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తే బాగుండేది. వెన్నెల కిశోర్‌కు రాసిన సంభాషణలు పేలాయి. హీరో తండ్రి (నరేశ్) పాత్రకు డైలాగులు నాలుగు లైన్లు కూడా లేకపోవడం ఆశ్చర్యకరం.
ప్లస్ పాయింట్స్
సాయిధరమ్ తేజ్, వెన్నెల కిశోర్, రావు రమేశ్ నటన
ఇంటర్వెల్ బ్యాంగ్
తమన్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
హీరో ఫిలాసఫీ
ఊహలకు అనుగుణంగా నడిచే సెకండాఫ్
కీలక సన్నివేశాల్లో డ్రామా ఎక్కువవడం
ప్రధాన పాత్రలను సరిగా ఉపయోగించుకోకపోవడం
నటీనటుల పనితీరు
విరాట్ పాత్రకు న్యాయం చేయడానికి బాగా కృషి చేశాడు సాయితేజ్. అతడి పర్ఫార్మెన్స్‌లో, డైలాగ్ డిక్షన్‌లో చిరంజీవి ప్రభావం అడుగడుక్కీ కనిపించింది. ఈ సీన్‌ను చిరంజీవి ఎలా చేస్తారో ఊహించుకొని సాయితేజ్ అలా చేసినట్లు తోస్తుంది. ఒక ఫిలాసఫీ నుంచి మరో ఫిలాసఫీకి చేంజ్ అయ్యే క్రమంలో విరాట్ క్యారెక్టరైజేషన్ కన్విన్సింగ్‌గా ఉన్నట్లయితే ఆ పాత్ర ఇంకా రాణించేది. హీరోయిన్ అమృతగా పాత్రోచితంగా నటించింది నభా నటేశ్. ఆమెను కెమెరా అందంగా చూపించింది.
విరాట్ మేనమామగా రావు రమేశ్ ఎప్పట్లా తనశైలి నటనను ఉన్నత స్థాయిలో ప్రదర్శించారు. ఆయనకు ఫుల్ మార్క్స్ వేసేయొచ్చు. హీరోయిన్ తండ్రి పాత్రకు రాజేంద్రప్రసాద్ ఎప్పట్లా సరిపోయారు. ముందే చెప్పుకున్నట్లు సినిమాలో మంచి వినోదాన్ని పంచాడు వెన్నెల కిశోర్. కన్నడం మిక్స్ చేసిన తెలుగు డిక్షన్‌తో అతను చెప్పే డైలాగ్స్ అలరించాయి. హీరో ఫ్రెండ్స్‌గా సత్యా, సుదర్శన్, మరో నటుడికి పరిమితమైన సన్నివేశాలే లభించాయి. హీరో తండ్రిగా చేసిన నరేశ్‌కు నటించడానికి కానీ, మాట్లాడ్డానికి కానీ అవకాశం లభించలేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
లాక్‌డౌన్ సడలించాక థియేటర్లకు వచ్చిన తొలి సినిమాగా గట్టి ప్రచారానికి నోచుకున్న 'సోలో బ్రతుకే సో బెటర్' పలుచగానే వినోదాన్నిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చేవాళ్లు ఫర్వాలేదనుకుంటూ బయటకు రావచ్చు. అయితే ఈ పాండమిక్ రోజుల్లో పొలోమంటూ థియేటర్లకు ప్రేక్షకులను వచ్చేలా చేయడంలో ఈ మూవీ సక్సెస్ అవుతుందా? అనేది పెద్ద ప్రశ్న.