Read more!

English | Telugu

సినిమా పేరు:వీరసింహారెడ్డి
బ్యానర్:మైత్రీ మూవీ మేకర్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jan 12, 2023

సినిమా పేరు: వీరసింహారెడ్డి
తారాగణం: బాలకృష్ణ, వరలక్ష్మీ శరత్‌కుమార్, దునియా విజయ్, హనీ రోజ్, శ్రుతి హాసన్, లాల్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, సచిన్ ఖడేకర్, రవిశంకర్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, రాజీవ్ కనకాల, సప్తగిరి, సాత్విక్ 
కథ, స్క్రీన్‌ప్లే: గోపీచంద్ మలినేని
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
పాటలు: రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్: తమన్
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబి
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనింగ్: ఏఎస్ ప్రకాశ్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంకట్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
విడుదల తేదీ: 12 జనవరి 2023

'అఖండ' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత బాలకృష్ణ, 'క్రాక్' లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని చేసిన సినిమా కావడంతో 'వీరసింహారెడ్డి'పై వెల్లువెత్తిన అంచనాలు అంబరాన్ని చుంబించాయి. ట్రైలర్ ఆ హైప్‌ను ఇంకా ఉధృతం చేసింది. ఈమధ్య కాలంలో ఎన్నడూ లేని రీతిలో అత్యధిక షోలతో సినిమా ఓపెన్ కావడంతో తొలిరోజు వసూళ్లు బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంతో మన ముందుకు వచ్చిన 'వీరసింహారెడ్డి' ఎలా వున్నాడయ్యా అంటే...

కథ:-

తండ్రి ఉంచుకున్న ఆమెకు పుట్టినప్పటికీ, పురిటిలోనే తల్లిని పోగొట్టుకున్న భానుమతి (వరలక్ష్మీ శరత్‌కుమార్)ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తూ పెంచుతాడు వీరసింహారెడ్డి (బాలకృష్ణ). ఆమె తన అనుచరుడు సిద్ధప్ప (లాల్) కొడుకు శేఖర్ (నవీన్ చంద్ర)ను ప్రేమించిందని తెలిసి, అతనికిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడతాడు. కానీ అనూహ్యమైన పరిణామాలతో శేఖర్ చనిపోవడంతో, దానికి అన్నే కారణమని వీరసింహారెడ్డిపై పగపట్టిన భానుమతి, ఆ ఇంటినుంచి వెళ్లిపోయి అన్నను చంపడానికి కాపుకాచుకొని ఉండే ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్)ని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? భార్యాభర్తలైన భానుమతి, ప్రతాప్ రెడ్డి తమ పగను తీర్చుకున్నారా? ఎక్కడో ఇస్తాంబుల్‌లో హోటల్ నడుపుకుంటూ జీవితం సాగిస్తూ వస్తోన్న మీనాక్షి (హనీ రోజ్), ఆమె కొడుకు జయసింహారెడ్డి (బాలకృష్ణ)కీ, వీరసింహారెడ్డికీ మధ్య ఉన్న అనుబంధం ఏమిటి?.. అనే విషయాలు కథలో భాగం.


ఎనాలసిస్ :

కథ పులిచర్లలో కాకుండా టర్కీలోని ఇస్తాంబుల్‌లో ప్రారంభమవుతుంది. అక్కడ రాగిముద్ద, నాటుకోడి పులుసు లాంటి ఆహారపదార్థాలని సర్వ్ చేసే హోటల్ నడుపుకొనే మీనాక్షి, ఆమె కొడుకు జయ్ అలియాస్ జయసింహారెడ్డి మొదటగా మనకు దర్శనమిస్తారు. అక్కడ ఈష (శ్రుతిహాసన్) అనే యువతితో జయ్ ప్రేమలో పడ్డాక, ఆమె తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడ్డానికి తల్లిని తీసుకొని వెళ్లాలనుకున్నప్పుడు తనకు తండ్రి ఉన్నాడనీ, ఆయన పేరు వీరసింహారెడ్డి అనీ తల్లి ద్వారా జయ్‌కు అప్పుడే తెలుస్తుంది. అంతే కాదు, ఆ ఇద్దరికీ పెళ్లవలేదనే విషయం కూడా. అప్పుడు వీరసింహారెడ్డి ఎంట్రీ ఇస్తాడు. ఇక రాయలసీమ ఫ్యాక్షన్‌లోకి కథ వెళ్తుంది. 'వీరసింహారెడ్డి'లో మనం చూసిన కథ కానీ, సన్నివేశాలు కానీ ఎన్ని సినిమాల్లో ఎన్నిసార్లు మనం చూసి ఉంటామో లెక్క లేదు. కథ పాతదే అయినా, కథనం కొత్తగా అయినా ఉండాలి, ఎమోషనల్‌గా ఒక ఫీల్‌తో అయినా ఉండాలి. అది లోపించడమే ఈ సినిమాకు మైనస్ అయ్యింది. తండ్రి ఉంచుకున్న ఆమెకు పుట్టినప్పటికీ ఆ అమ్మాయిని ప్రాణంలా ప్రేమించి, ఆమె కోసం నవ్వుతూ ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడేవానిలా వీరసింహారెడ్డి దర్శనమివ్వడం, తను ప్రేమించిన యువకుడి మరణానికి అన్నను బాధ్యుడ్ని చేసి, అతడ్ని తప్పుగా అర్థంచేసుకొని, అతడి ప్రాణాలు తియ్యాలని పగతో రగిలిపోయే స్త్రీగా భానుమతి కనిపించడం సినిమాకు ప్లస్ కావడానికి బదులు మైనస్ అయ్యిందనిపిస్తుంది. 

సినిమాలో పాత్రలు ఎక్కువైపోవడం, కొన్ని ప్రధాన పాత్రలకు అర్థవంతమైన ముగింపు ఇవ్వకపోవడం స్క్రీన్‌ప్లేలో దొర్లిన ఒక లోపం. ఇస్తాంబుల్‌కి వచ్చిన వీరసింహారెడ్డిపై ప్రతాప్‌రెడ్డి గ్యాంగ్ దాడిచేయడం వెనుక ఉన్నది తన తండ్రి జయరాం (మురళీ శర్మ) అనే విషయం ఈషాకు చివరలో కూడా తెలియకుండా ఉంచేయడం ఆ లోపాల్లో ఒకటి. ఆ జయరాంను జయసింహారెడ్డి పట్టించుకోకుండా వదిలేయడం ఇంకో లోపం. ప్రతాప్ రెడ్డి మేనమామ పెద్దిరెడ్డి (అజయ్ ఘోష్) క్యారెక్టర్‌ను కూడా చివరలో దర్శకుడు మర్చిపోయాడు. శ్రుతి హాసన్ క్యారెక్టర్ కేవలం రెండు పాటలకు, మొదట్లో రెండు మూడు హాస్యాస్పదమైన సన్నివేశాలకు మాత్రమే పనికొచ్చింది. ఆమె కంటే హనీ రోజ్ చేసిన మీనాక్షి రోల్‌కు ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి. 

మూవీలో హింసాత్మక సన్నివేశాలకు కొదవ లేదు. యాక్షన్ బ్లాక్‌లన్నీ అలాంటివే. రెండు యాక్షన్ ఎపిసోడ్స్‌లో రెండు తలకాయలను కథానాయకుడు లేపేస్తాడు. రాయలసీమ అంటే నరుకుళ్లే అన్నట్లు చూపిస్తారెందుకు అని అక్కడివాళ్లు ఎన్నిసార్లు నెత్తినోరూ బాదుకున్నారో.. ఇప్పుడు అదే కోవలో 'వీరసింహారెడ్డి'ని తీసి తనూ అదే కోవలో వాడినేనని డైరెక్టర్ గోపీచంద్ తెలియజేశాడు. సాయిమాధవ్ రాసిన డైలాగ్స్ కూడా చాలా సందర్భాల్లో అదే తరహాలో ఉన్నాయి. ఇది రాజకీయ సినిమా కాదు. కానీ విలన్‌తో తలపడిన ప్రతిసారీ రాజకీయంగా, సామాజికంగా నేటి ఆంధ్రప్రదేశ్ స్థితిని తెలియజేసే పదునైన మాటల్ని తూటాలా విసిరాడు బాలయ్య. ఇవి ఓ వర్గాన్ని శాటిస్‌ఫై చేస్తాయి. బాలయ్య అభిమానుల చేత విజిల్స్ వేయిస్తాయి. బాలయ్య చేసిన ఫైట్లు కూడా మాస్ ఆడియెన్స్‌ను, ఆయన ఫ్యాన్స్‌ను కచ్చితంగా అలరిస్తాయి. వాటిని ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, వెంకట్ చాలా బాగా డిజైన్ చేశారు. ఎన్నడో పది, ఇరవై ఏళ్ల క్రితం పదుల సంఖ్యలో సుమోలు బారులు బారులుగా రోడ్ల మీద పోవడం, బాంబుల దెబ్బకు గాల్లోకి లేవడం చూసిన మనం.. ఇప్పుడు ఈ సినిమాలోనూ ఆ సన్నివేశాలు చూసి గోపీచంద్ ఏ కాలంలో ఉన్నాడోనని ఆశ్చరపోతాం. 

టెక్నికల్‌గా సినిమా టాప్ క్లాస్‌లో ఉంది. తమన్ బీజీఎం సూపర్బ్. చాలా సీన్లకు బీజీఎంతో ప్రాణం పోశాడు తమన్. పాటలకు కూడా వినసొంపైన బాణీలు అందించాడు. ఎటొచ్చీ జై బాలయ్యా సాంగ్‌లో బాలయ్య అనే పదాన్ని ఎందుకు వాడారో అర్థం కాలేదు. వీరసింహారెడ్డి క్యారెక్టర్‌ను ఉద్దేశించి వచ్చే ఆ పాటకూ, బాలయ్యకూ సంబంధమేంటి? అది సినిమాలోని క్యారెక్టర్‌కు కాకుండా నిజ జీవితంలో బాలయ్యను ఉద్దేశించి తీసిన పాటలా అనిపించింది. రిషి పంజాబి సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్, వెంకట్ డిజైన్ చేసిన ఫైట్లు, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉండాల్సింది.

నటీనటుల పనితీరు:-

'వీరసింహారెడ్డి' అనేది బాలకృష్ణ నటన మీద ఆధారపడిన సినిమా. టైటిల్ రోల్‌లో, జయసింహారెడ్డి పాత్రలో ఆయన చెలరేగిపోయి చేశాడు. ముఖ్యంగా వీరసింహారెడ్డిగా ఆయన ఆహార్యం ఎంత బాగుందో, ఆయన అభినయం అంత ఉన్నత స్థాయిలో ఉంది. ఒక మూసకథను ఆయన తన భుజాల మీద మోసుకుపోయాడు. చెల్లెలి మీద అమితమైన ప్రేమను ప్రదర్శించే సన్నివేశాల్లో ఆయన హావభావాలు చూడాల్సిందే. భానుమతి రోల్‌కు వరలక్ష్మి అతికినట్లు సరిపోయింది. కథకు అత్యంత కీలమైన పాత్రను ఆమె పోషించిన తీరు ప్రశంసనీయం. విలన్ ప్రతాప్‌రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ యాక్టర్ దునియా విజయ్ దున్నేశాడు. ఇంతదాకా తెలుగువాళ్లకు పరిచయం లేని వాడు కావడంతో కొత్తగా ఉన్నాడు. గ్లామర్ డాల్‌గా శ్రుతిహాసన్ అందంగా ఉన్నదంతే. ఆమె కంటే హనీ రోజ్‌కు నటనకు అవకాశమున్న పాత్ర లభించింది. అజయ్ ఘోష్, మురళీశర్మ, సచిన్ ఖడేకర్‌ల ప్రతిభకు తగ్గ పాత్రలు పడలేదు. సప్తగిరి ఫస్టాఫ్‌లో కొద్దిసేపు నవ్వించడానికి పనికొచ్చాడు. భానుమతిని ప్రేమించిన శేఖర్ పాత్రను నవీన్ చంద్ర ఎందుకు చేశాడో అర్థం కాలేదు. ఇక నుంచీ తనను ఈ తరహా పాత్రలకు కూడా వాడుకోవచ్చనే హింట్ ఇచ్చాడనుకోవాలేమో. రాజీవ్ కనకాల లాంటి చక్కని నటుడు కూడా ఇలా కనిపించి అలా మాయమయ్యే క్యారెక్టర్ చేశాడు. దునియా విజయ్ తండ్రిగా 'కేజీఎఫ్' ఫేం బి.ఎస్. అవినాశ్ కనిపించాడు. 'క్రాక్‌'లో రవితేజ, శ్రుతి హాసన్ కొడుకు పాత్రలో గోపీచంద్ కొడుకు సాత్విక్‌ను చూశాం. ఈ సినిమాలో ఎమోషనల్ డైలాగ్స్ చెప్పే ఒక పిల్లాడి క్యారెక్టర్‌లో ఆ కుర్రాడిని చూస్తాం.  


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'వీరసింహారెడ్డి' అనేది బాలయ్య అభిమానుల్ని అలరించడానికి తీసిన సినిమాగా కనిపిస్తుంది. బాలయ్య నటన, ఆయన ఉద్వేగభరితమైన డైలాగ్స్, ఆయన ఎనర్జిటిక్ ఫైట్స్ చూడాలనుకొనే వారికి ఈ సినిమా ఓ ఫీస్ట్. మిగతా ప్రేక్షకులకు పాత కథ, రొడ్డకొట్టుడు సన్నివేశాలు, మితిమీరిన హింస లాంటివి కొరుకుడుపడటం కష్టం.

- బుద్ధి యజ్ఞమూర్తి