English | Telugu

సినిమా పేరు:ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య
బ్యానర్:మార్క మీడియ వర్క్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jul 30, 2020

నటీనటులు: సత్యదేవ్, చందనా కొప్పిశెట్టి, రూపా కొదువాయుర్, సీనియర్ నరేష్, సుహాస్ తదితరులు
సినిమాటోగ్రఫీ: అప్పు ప్రభాకర్
సంగీతం: బిజీబల్
దర్శకత్వం: వెంకటేష్ మహా
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి
విడుదల తేదీ: 30 జూలై 2020 (నెట్‌ఫ్లిక్స్)

విమర్శకులతో పాటు పలువురు సినిమా ప్రముఖులను మెప్పించిన సినిమా 'కేరాఫ్ కంచెరపాలెం'. తొలి సినిమాతో దర్శకుడిగా, కథకుడిగా వెంకటేష్ మహా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే, మలి చిత్రానికి మలయాళంలో మంచి విజయం సాధించిన 'మహేషింటే ప్రతీకారం'ను ఎంచుకున్నాడు. సత్యదేవ్ హీరోగా తెరకెక్కించిన 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాను 'బాహుబలి' నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డతో కలిసి 'కేరాఫ్ కంచెరపాలెం' నిర్మాత విజయ ప్రవీణ పరుచూరి నిర్మించారు. పేరున్న వ్యక్తులు కలిసి పని చేసిన ఈ సినిమాను ప్రచార ఆర్భాటాలు లేకుండా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. సినిమా ఎలా ఉందో రివ్యూ చదివి తెలుసుకోండి.  
     
కథ:

అరకులో ఉమా మహేశ్వర రావు అలియాస్ మహేష్ (సత్యదేవ్) మంచోడు. గొడవలకు ఆమడ దూరంలో ఉంటాడు. ఒక రోజు మహేష్ ఓ గొడవను ఆపే ప్రయత్నం చేస్తుండగా, అరకులో ప్రజలు అందరి మధ్య పాడేరుకు చెందిన జోగినాథ్ (రవీంద్రనాథ్ విజయ్) కొడతాడు. మళ్ళీ అతడిని కొట్టేవరకు చెప్పులు వేసుకోనని మహేష్ శపథం చేస్తాడు. అయితే, జోగినాథ్‌ను కొట్టడానికి వెళితే అతడు దుబాయ్ వెళ్లాడని తెలుస్తుంది. అతడు తిరిగి వచ్చాక మహేష్ ప్రతీకారం తీర్చుకున్నాడా? లేదా? మధ్యలో జోగినాథ్ చెల్లెలు జ్యోతి (రూప కొదువాయూర్)తో ఎలా ప్రేమలో పడ్డాడు? అతను ముందు ప్రేమించిన స్వాతి (చందనా కొప్పిశెట్టి), మహేష్‌ను ఎందుకు వదిలేసింది? ప్రేమలో, పగలో మహేష్ ఎలా ఎలా విజయం సాధించాడు? అనేది సినిమా


ఎనాలసిస్ :

"నీ ఫోటోగ్రఫీలో టెక్నిక్ ఉంది. మరి, లేనిది ఏంటి?" అని సినిమాలో ఓ సన్నివేశంలో హీరో మహేష్‌ను తండ్రి ప్రశ్నిస్తాడు. 'ఎమోషన్' అని మహేష్ సమాధానం ఇస్తాడు. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే... ఇందులో చక్కటి కథానేపథ్యం, నటీనటుల ప్రతిభ, ఫోటోగ్రఫీ సంగీతం, దర్శకత్వం, అన్నిటికీ మించి సహజత్వం ఉన్నాయి. 'లేనిది ఏంటి? ఎందుకు ఏదో వెలితిగా ఉంది?' అని ప్రశ్నించుకుంటే 'ఎమోషన్' అని  ఆన్సర్ వినిపిస్తుంది.

'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' చాలా ఆహ్లాదక‌రంగా, అందంగా ఉంది. అయితే, కథలో కీలక అంశమైన ప్రతీకారం దగ్గర హీరో ఎమోష‌న్‌తో ప్రేక్షకుడు కనెక్ట్ కాకపోవడమే మైనస్ పాయింట్. హీరో అవమాన భారాన్ని ప్రేక్షకుడు ఫీలైనప్పుడు తరవాత వచ్చే సన్నివేశాలు ఆసక్తి కలిగిస్తాయి, రక్తి కట్టిస్తాయి. ఆ సన్నివేశాన్ని మరింత ప్రభావవంతంగా దర్శకుడు తెరకెక్కించి ఉంటే బావుండేది. అక్కడ ఎమోషన్ అంతగా కనెక్ట్ కాకపోవడంతో సినిమా మరీ నెమ్మదిగా ముందుకు వెళుతున్న భావన కలుగుతుంది. పైగా, ప్రతీకారం తీర్చుకుంటానని హీరో శపథం చేసిన తరవాత మరో ప్రేమకథ మొదలు అవుతుంది. కథ మెయిన్ ట్రాక్ తప్పినట్టు అనిపించినా... హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సహజత్వం. కథ, పాత్రలు, సన్నివేశాలు, చివరికి లొకేషన్లు సైతం సహజంగా ఉంటాయి. నేపథ్య సంగీతం బావుంది. పాటలు కథలో భాగంగా ఉన్నాయి. నిర్మాణ‌ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. మాటల్లో "నొప్పి రుచి తెలియనివాడు అవతలివాడిపై చేయి చేసుకుంటాడు. తెలిసినవాడు చెయ్యి ఎత్తడానికి కూడా ఆలోచిస్తాడు" అంటూ తండ్రి చేత చెప్పించినవి ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. "మగముండా కొడుకులకు బుర్ర బుద్ధి ఉండదు కదా" వంటి సహజ సంభాషణలు సైతం ఆకట్టుకుంటాయి. కథనంలో వేగం ఉంటే సినిమా మరింత ఆకట్టుకునేది.

ప్లస్‌ పాయింట్స్‌:

పాత్రల్లో, నటనలో సహజత్వం
వినోదం
పాటలు, నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌:

నెమ్మదిగా సాగే కథనం
ప్రేక్షకులకు కనెక్ట్ కాని ఎమోషన్
సింపుల్ క్లైమాక్స్

నటీనటుల పనితీరు:

మహేష్ పాత్రలో సత్యదేవ్ జీవించాడు. అతడి నటనకు వంక పెట్టడానికి లేదు. జ్యోతి పాత్రకు రూప ప్రాణం పోసింది. ఆమెను చూస్తుంటే కథానాయికను చూస్తున్నట్టు కాకుండా పల్లెటూరి అమ్మాయిను చూస్తున్నట్టు ఉంటుంది. చందనా కొప్పిశెట్టి, సీనియర్ నరేష్, నరేష్ కుమార్తెగా నటించిన కుశాలిని సహజ నటనతో ఆకట్టుకున్నారు. సుహాస్ పాత్ర, అందులో అతడి నటన నవ్విస్తుంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఓ అందమైన పల్లెటూరి ప్రేమకథా ప్రతీకార చిత్రమిది. సినిమా నెమ్మదిగా సాగుతున్న భావన కలుగుతుంది. అయితే, ద్వందార్థపు సంభాషణలు లేని హాస్యం, పాత్రల్లో సహజత్వం, సినిమా మేకింగ్ లో నిజాయతీ ఉన్నాయి. అందువల్ల, ఓసారి సరదాగా చూడొచ్చు.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25