English | Telugu

సినిమా పేరు:సాక్ష్యం
బ్యానర్:అభిషేక్ పిక్చర్స్
Rating:2.25
విడుదలయిన తేది:Jul 27, 2018

నేరాన్ని నిరూపించ‌డానికి సాక్ష్యం కావాలి. మ‌రి ఎలాంటి సాక్ష్యం లేని ప‌క్ష్యంలో న్యాయం జ‌రిగేదెలా?  హిందు ధ‌ర్మం ప్ర‌కారం క‌ర్మ‌సాక్షే దోషుల్ని దేవుడి న్యాయస్థానంలో శిక్షిస్తుంది. నాలుగు దిక్కుల్లో ఎవ‌రూ చూడ‌టం లేదు క‌దా అని దుర్మార్గానికి తెగ‌ప‌డితే ఐదో దిక్కైన ఆ ప‌ర‌మాత్మ సాక్ష్యంగా నిలుస్తాడు. పంచ‌భూతాల తోడుగా పాప‌ప‌రిహారం కావిస్తాడు..క్లుప్తంగా ఇదే తాత్విక‌, ధార్మిక భూమిక మీద సాక్ష్యం చిత్ర  క‌థ న‌డుస్తుంది. బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సాక్ష్యం నిర్మాణం నుంచే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. పంచ‌భూతాల కథ ఇద‌ని ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వెల్ల‌డించ‌డం సినిమాపై మ‌రింత ఉత్సుక‌త‌ను పెంచింది. శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా  నిర్మించిన ఈ చిత్ర భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల‌ముందుకొచ్చింది. మ‌రి చిత్ర క‌థా విశేషాలేమిట‌లో చూద్దాం..

క‌థ‌:

స్వ‌స్తిక్‌పురంలో ఉండే రాజుగారు (శ‌ర‌త్‌కుమార్‌) ఆప‌న్నుల‌కు అండ‌గా వుంటూ ఊరి పెద్ద‌గా మంచిపేరు సంపాదించుకుంటాడు. ఉమ్మ‌డి కుటుంబ య‌జ‌మానిగా ప్రేమాభిమాల‌తో జీవితాన్ని సాగిస్తుంటాడు. అదే ఊరిలో మైనింగ్‌తో పాటు అక్ర‌మ వ్యాపారాలు నిర్వ‌హించే మునుస్వామి (జ‌గ‌ప‌తిబాబు)కి రాజుగారు అంటే ప‌డ‌దు. త‌న అక్ర‌మాల‌కు అడ్డొస్తున్నాడ‌ని రాజుగారిపై ప‌గ పెంచుకుంటాడు. మునుస్వామి త‌మ్ముడు ఓ త‌ప్పు చేస్తే అత‌డిని గృహ నిర్భందం చేస్తాడు రాజుగారు. దీంతో ఆగ్ర‌హావేశాల‌కులోనైన మునుస్వామి రాజుగారు కుటుంబాన్ని క్రూరంగా అంత‌మొందిస్తాడు. ఆ స‌మ‌యంలో త‌ల్లిపొత్తిళ్ల‌లో ఉన్న రాజుగారి కుమారుడిని కూడా చంపేయాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ శిశువు అక్క‌డి నుంచి త‌ప్పించ‌బ‌డ‌తాడు. ఓ స‌న్యాసికి ఆ పిల్ల‌వాడిని కాశీలో వ‌దిలిపెడ‌తాడు. అక్క‌డ ఓ పిల్ల‌లులేని ఎన్‌.ఆర్‌.ఐ దంప‌తులు ఆ శిశువును త‌మ కుమారుడిగా స్వీక‌రించి అమెరికా తీసుకెళ్తారు. అత‌నికి విశ్వ (బెల్లంకొండ శ్రీ‌నివాస్) అని నామ‌క‌ర‌ణం చేస్తారు. అమెరికాలో పుట్టిపెరిగిన విశ్వ కంప్యూట‌ర్ గేమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. అక్క‌డే అత‌నికి సౌంద‌ర్య‌ల‌హ‌రి (పూజా హెగ్డే) ప‌రిచ‌య‌మ‌వుతుంది. త‌న తండ్రి ఠాగూర్ (రావు ర‌మేష్‌) ఆరోగ్యం బాగాలేక‌పోవ‌డంతో సౌంద‌ర్య‌ల‌హ‌రి ఇండియాకు వ‌స్తుంది. ఆమెను వెతుక్కంటూ విశ్వ కూడా ఇండియాకు వ‌స్తాడు. ఈ క్ర‌మంలో ఏం జ‌రిగింది? త‌న కుటుంబానికి అంత‌మొందించిన వారిపై  త‌న‌కు తెలియ‌కుండానే విశ్వ ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు?  పంచ‌భూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అత‌నికి ఎలా తోడుగా నిలిచాయి? అన్న‌దే మిగ‌తా చిత్ర క‌థ‌.


ఎనాలసిస్ :

సింపుల్‌గా చెప్పుకుంటే  త‌ల్లిదండ్రుల‌ను చంపిన వారిపై ప్ర‌తీకారం తీర్చుకునే ఓ త‌న‌యుడి క‌థ ఇది. అయితే ఈ రీవేంజ్ డ్రామాను పంచ‌భూతాల నేప‌థ‌ప్యంలో న‌డించ‌డమే క‌థ‌లో న‌వ్య‌మైన పాయింట్‌గా చెప్పుకోవ‌చ్చు.  ఐదుగురు ప్ర‌తినాయ‌కులు గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశం అంత‌మొందించ‌డం, ఈ క్ర‌మంలో సాగే క‌థాగ‌మ‌నం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది.   స్ర్కీన్‌ప్లేను న‌డిపించిన విధానం ఆక‌ట్ట‌కుంది. తాము ఎందుకు చ‌నిపోతున్నామో చ‌నిపోయేవారికి తెలియ‌దు, ఎందుకు చంపుతున్నాడ‌నే విష‌యం చంపేవాడికి తెలియ‌దు..ఈ లాజిక‌ల్‌గా పాయింట్‌కు తగిన‌ట్లుగా చిత్ర క‌థ‌ను అల్లుకోవ‌డం ఆస‌క్తిగా అనిపిస్తుంది. వాల్మికి (అనంత్‌శ్రీ‌రామ్‌) రూపొందిస్తున్న వీడియో గేమ్‌లోని ఘ‌ట‌న‌లు విశ్వ నిజజీవితంలో జ‌రగ‌డం, వాల్మికి ఇంద‌రి చావుని ముందే ఎలా ఊహించ‌గ‌లిగాడు? అనే ప్ర‌శ్న‌ల‌కు క‌థాప‌రంగా స‌రైన జ‌డ్జిమెంట్‌ను చూపించ‌డం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ప‌తాక ఘ‌ట్టాల్ని రొమాంచితంగా తీర్చిదిద్దారు. అయితే న్యూయార్క్‌లో నాయ‌నానాయిక‌ల ప‌రిచ‌యం, వారి మ‌ధ్య ప్రేమ‌కు దారితీసిన ప‌రిస్థితుల్ని ఎమోష‌న‌ల్‌గా ఆవిష్క‌రించ‌లేక‌పోయారు. కొన్ని పాట‌లు అసంద‌ర్భంగా అనిపిస్తాయి. గాలిమ‌ర నేప‌థ్యంలో తెర‌కెక్కించిన పోరాట దృశ్యాలు, క్లైమాక్స్‌లో డ్యామ్ బ‌ద్ద‌లై నీరు మునుస్వామిని ముంచెత్తే ఎపిపోడ్స్‌ను బాగా డిజైన్ చేశారు. గ్రాఫిక్స్ స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా సాగాయి. లేగ‌దూడ‌పై చిత్రీక‌రించిన ఆరంభ సన్నివేశాలు భావోద్వేగ‌భ‌రితంగా హృద్యంగా సాగాయి. లేగ‌దూడ‌ను గ్రాఫిక్స్‌లో డిజైన్ చేశారంటే న‌మ్మ‌శ‌క్యంగా అనిపించ‌దు. నిజ‌మైన లేగ‌దూడ అని భ్ర‌మించేలా గ్రాఫిక్స్ వర్క్స్ స‌హ‌జంగా అనిపించాయి. ఈ సినిమాకు దాదాపు 40కోట్ల‌వ‌ర‌కు ఖ‌ర్చుచేశారు. అందుకు త‌గిన‌ట్లే నిర్మాణ ప్ర‌తి ఫ్రేములో క‌నిపించాయి.

న‌టీన‌టుల ప‌నితీరు....

విశ్వ పాత్ర‌లో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ మంచి న‌ట‌న‌న క‌న‌బ‌రిచాడు. గ‌త చిత్రాల‌తో పోల్చుకుంటే అత‌ని యాక్టింగ్‌లో ప‌రిణితి క‌నిపించింది. పోరాటఘ‌ట్టాల్లో ఈజ్ ప్ర‌ద‌ర్శించాడు. క‌థానాయిక పూజాహేగ్డేకు న‌ట‌నాప‌రంగా పెద్ద‌గా అవ‌కాశం ద‌క్క‌లేదు. పాట‌ల్లో త‌న‌దైన గ్లామ‌ర్‌తో త‌ళుక్కున మెరిసింది. ప్ర‌తినాయ‌కుడు మునుస్వామిగా జ‌గ‌ప‌తిబాబు ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించాడు. విల‌నీని పండించ‌డంలో జ‌గ‌ప‌తిబాబు మ‌రింత‌గా రాటుదేలిపోతున్నాడ‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. మునుస్వామి అన్యాయాల్ని ప్ర‌శ్నించే ఠాగూర్ పాత్ర‌లో రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌లో  ఆక‌ట్ట‌కున్నాడు. క‌థానాయ‌కుడు విశ్వ త‌ల్లిదండ్రులుగా జేపీ, ప‌విత్ర‌లోకేష్ మంచి అభిన‌యాన్ని క‌న‌బ‌రిచాడు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ పాట‌లు ఫ‌ర్వాలేద‌నించాయి. పాట‌ల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్ని నేప‌థ్య సంగీతం మ‌రింత‌గా ఎలివేట్ చేసింది. ఆర్థుర్ విల్స‌న్ ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. సినిమా ఆసాంతం రెడ్‌టింట్ క‌ల‌ర్‌ను మెయిన్‌టెయిన్ చేయ‌డం క‌థ‌కు మ‌రింత ఎమోష‌న్‌ను అద్దిన‌ట్టుగా అనిపించింది. పీట‌ర్‌హెయిన్స్ పోరాట ఘ‌ట్టాలు హైలైట్‌గా అనిపించాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

రొమాంచిత‌మైన యాక్ష‌న్ ఘ‌ట్టాలు, భావోద్వేగాల‌తో తీర్చిదిద్దిన ప‌క్కా వాణిజ్య చిత్ర‌మిది. క‌థ‌లోని పంచ‌భూతాలు, వాటిమీద అల్లుకున్న స‌న్నివేశాలు బ‌లంగా అనిపిస్తాయి. కావాల్సినంత మ‌లుపులు, ఉత్కంఠభ‌రితంగా సాగే స్ర్కీన్‌ప్లే కొత్త అనుభూతినిస్తుంది.  ప్ర‌థ‌మార్థం కొంత మంద‌గ‌మ‌నంలో సాగిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు అంత‌గా బోర్ ఫీల‌వరు.  మొత్తంగా సాక్ష్యం ప్రేక్ష‌కుల్ని మెప్పించేదే..

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25