English | Telugu
బ్యానర్:సితార ఎంటర్ టైన్ మెంట్స్
Rating:3.25
విడుదలయిన తేది:Oct 7, 2016
మలయాళంలో ప్రేమమ్ ఓ క్లాసిక్. నవతరాల హృదయాల్ని పట్టేసిన సినిమా. ఓ గొప్ప సినిమా చూసి థ్రిల్ అయినంత ఈజీగా ఆ సినిమాని రీమేక్ చేసేయలేం. ఆ ఫీల్ క్యారీ అవ్వదేమో అన్న భయం ఉంటుంది. మాతృకతో పోల్చి చూసుకొంటే బోల్డన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ప్రేమమ్ రీమేక్ అనగానే.. అందరూ కంగారు పడ్డారు. ప్రేమమ్ ఫీలింగ్‌ని తర్జుమా చేయగలరా, లేదా? అనే సందేహాలకైతే కొదవలేదు. మరి ఈ ప్రేమమ్ ఎలా వచ్చింది? ఆ ప్రేమమ్‌తో పోటీ పడిందా? లేదంటే ఆ స్థాయిని అందుకోవడంలో విఫలం అయ్యిందా? తెలుసుకొందాం రండి.
* కథ
ప్రేమమ్ కథ ఇదీ అని చెప్పలేం. అదే అసలు సమస్య. ఓ వ్యక్తి... మూడు దశల ప్రేమకథ. చిన్నప్పుడు, యుక్తవయసులో, మెచ్యూరిటీ వచ్చినప్పుడు విక్రమ్ (నాగచైతన్య) సుమ ని ప్రేమిస్తాడు. ఆ తరువాత సితారకి మనసిస్తాడు. ఆ తరవాత తన జీవితంలోకి సింధు అనే మరో అమ్మాయి వస్తోంది. వాళ్లతో పరిచయం, తన ప్రణయం ఏ ప్రేమకథ ఎలా ముగిసింది? చివరి మజిలీ ఏమిటి? అనేదే ఈ సినిమా కథ.
ఎనాలసిస్ :
ప్రేమ తప్ప మరేదీ ఈ సినిమాలో కనిపించదు. అదే ప్రేమమ్ గొప్పదనం. ప్రేమ చుట్టూనే ప్రతీ సన్నివేశం తిరుగుతుంటుంది. మనల్ని ప్రేమ మైకంలో పడేస్తుంది. మలయాళ ప్రేమమ్‌లో `ఫీల్` ఈ సినిమాలో తగ్గింది. అయితే... ఇక్కడే దర్శకుడు తెలివిగా ఆలోచించాడు. ప్రతీ సన్నివేశాన్నీ హాస్యోక్తంగా తీర్చిదిద్దుకొన్నాడు. ప్రతీ సన్నివేశం నవ్విస్తుంటుంది. నిజానికి మన ఆడియన్స్ టేస్ట్ అదే. మనకు ఫీల్ గుడ్ సినిమాలు పెద్దగా ఎక్కువు. ఎక్కితే మళ్లీ మళ్లీ ఇది రానీ రోజులాంటి సినిమాలు సూపర్ హిట్టయిపోదును. ఈ నిజాన్ని తెలుసుకొన్న చందూ మొండేటి ప్రేమమ్‌లోని ఫీల్ జోలికి వెళ్లలేదు. ఆ కథని, జోనర్‌ని తెలివిగా ఎడాప్ట్ చేసుకొన్నాడు. మూడు దశల ప్రేమకథ ఇది. ప్రతీ దశలోనూ కొత్త క్యారెక్టర్లను రంగంలోకి దించి.. కామెడీ పండించాడు. దాంతో ప్రేమకథతో పాటు.. వినోదం కూడా పేరలల్‌గా సాగుతుంది. ప్రేమమ్‌లో ఫీల్ తగ్గింది అనుకొనే లోగా.. ఓ కామెడీ సీన్ వచ్చి వెళ్లిపోతుంది. దాంతో.. ఆడియన్ రిలాక్స్ అయిపోతాడు. నా ఆటోగ్రాఫ్ పోలికలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. బహుశా ఆ కథ స్ఫూర్తితో తీసిన సినిమా ఇదేమో?? చందూ రాసుకొన్న స్క్రీన్ ప్లే, కథని నడిపిన విధానం తప్పకుండా ఆకట్టుకొంటాయి. చైతూ - శ్రుతిహాసన్‌ల ఎపిసోడ్ కాస్త... ఇబ్బంది కలిగిస్తుంది. నిజానికి నిడివి పరంగా ఎక్కువ ఉన్న ప్రేమకథ అదే. ఆ జంట చూడ్డానికి మిస్ మ్యాచ్‌లా అనిపించి, ఆ ఎపిసోడ్‌ని పూర్తిగా ఆస్వాదించలేం. మలయాళ ప్రేమమ్ చూసినవాళ్లకు తెలుగు ప్రేమమ్ అంతగా రుచించకపోవొచ్చు. ఎందుకంటే అందులో ఉండే ఫీల్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. అయితే ఆ ప్రేమమ్‌నిపూర్తిగా పక్కన పెట్టి, ఇదో కొత్త సినిమా అనుకొనేవాళ్లకు మాత్రం. ... ప్రేమమ్ ప్రేమలో పడిపోవడం ఖాయం. రీమేక్ ఎలా చేయాలి? మాతృకని ఎలా ఎడాప్ట్ చేసుకోవాలి అనే విషయాలు తెలియడానికి ప్రేమమ్‌ని ఓ ఉదాహరణగా చూపించొచ్చు.
* నటీనటులు
నాగచైతన్య కెరీర్‌లో ఇదే బెస్ట్ పెర్‌ఫార్మ్సెన్స్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. మూడు రకాల పాత్రల్ని అద్భుతంగా పండించాడు. పిల్లాడిగా అయితే ఇంకా బాగా నచ్చేస్తాడు. గడ్డం పాత్రలో కూడా అతని నటన సూటబుల్‌గా ఉంది. అక్కినేని అభిమానుల్ని సంతృప్తి పరిచేలా కొన్ని డైలాగుల్ని రాసుకొన్నాడు చందూ. అవి కచ్చితంగా నాగ్ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరుస్తాయి. శ్రుతి మిస్ మ్యాచ్‌లా కనిపిస్తుంది. చైతూ పక్కన శ్రుతిని చూడలేం గానీ.. సోలోగా అయితే ఆకట్టుకొంటుంది. మడోనా, అనుపమ పాత్రలకు అంత ప్రాధాన్యం కనిపించదు. అయినా ఓవరాల్‌గా ఓకే. శ్రీనివాసరెడ్డి, సత్య, ప్రవీణ్ పాత్రలు నవ్విస్తాయి. ఈ సినిమాకి వాళ్లే కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్. చివర్లో వచ్చిన నాగ్, వెంకీలు.. బోనస్ అనుకోవాలి.
* సాంకేతికంగా
ఎవరే పాట ఆడియోలో సూపర్ హిట్టయ్యింది. విజువల్‌గానూ బాగుంది. పాటలు బాగా కుదిరాయి. ఈ సినిమాని ఓ విజువల్ ఫీస్ట్‌లా చూపించడానికి కెమెరా తోడ్పడింది. సెకండాఫ్ ట్రిమ్ చేసుకొనే అవకాశాలున్నా దర్శకుడు ఎందుకు పట్టించుకోలేదో? మాటలు ఆకట్టుకొంటాయి. అయితే ఎమోషన్ పడించే సమయంలో, ఆ సందర్భం కుదిరినప్పుడు కూడా అవకాశాన్ని జారవిడుచుకొన్నాడు. మలయాళం ప్రేమమ్‌లో లా గుండెని తడిమేసే సన్నివేశాలు లేకపోవడం ఒక్కటే ఈ సినిమా లోటు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ప్రేమమ్ పాడైపోతుందేమో అనుకొని భయపడుతున్న వాళ్లకు ఆ ప్రమాదమ్ ఏమీ లేదని నిరూపించి, రిలీఫ్ ఇచ్చిన సినిమా ఇది. ఈమధ్య ప్రేమకథలు బాగా తక్కువైపోతున్నాయి. యువతరాన్ని గుంపులుగా థియేటర్లకు రప్పించే సినిమాలు రావడం లేదు.. ప్రేమమ్ ఆ లోటు తీరుస్తుంది.