Read more!

English | Telugu

సినిమా పేరు:ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు
బ్యానర్:అమ్ము క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 3, 2023

సినిమా పేరు: ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు
తారాగణం: రాజేంద్ర ప్రసాద్, మీనా, సయ్యద్ సొహేల్, మృణాళిని రవి, సునీల్, అజయ్ ఘోష్, సూర్య, హేమ, ప్రవీణ్, హర్ష చెముడు, బాబూ మోహన్, రాజా రవీంద్ర, రాకెట్ రాఘవ, వెంకట్, వరుణ్ సందేశ్, రష్మీ గౌతం, సప్తగిరి, కృష్ణ భగవాన్, సన, అలీ, పృథ్వీ, సురేఖావాణి, జబర్దస్త్ అప్పారావు, పండు
పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
యాక్షన్: వెంకట్, రియల్ సతీశ్
ఆర్ట్: శివ శ్రీరాముల
కొరియోగ్రఫీ: సుచిత్ర, ప్రేం రక్షిత్, గణేశ్, ఆనీ
సమర్పణ: కె. అచ్చిరెడ్డి 
నిర్మాత: కోనేరు కల్పన
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి

ఎస్వీ కృష్ణారెడ్డి చివరిసారిగా డైరెక్ట్ చేసిన 'యమలీల 2' వచ్చింది 2014 నవంబరులో. ఇన్నేళ్ల విరామతో ఇప్పుడాయన 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు' అనే ఒక టైటిల్‌తో ఒక సినిమా చేస్తున్నారనే విషయం బయటకు వచ్చినప్పుడు ఆయన సినిమాలంటే ఇష్టపడేవాళ్లే కాక, మిగతావాళ్లూ ఆసక్తి చూపించారు. ఎందుకంటే, అందులో హీరో.. బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన సయ్యద్ సొహేల్ హీరో కావడం. అంతే కాదు, 'నవయుగం' (1990) అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన మీనా మళ్లీ ఇన్నాళ్ల తర్వార్త ఆ సినిమాలో కలిసి నటించిన రాజేంద్రప్రసాద్ జోడీగా ఈ సినిమాలో నటించడం మరో విశేషం.

కథ
విజయ్ (సొహేల్) రెండు ఫ్లాప్ సినిమాలు డైరెక్ట్ చేసి, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటాడు. అతని తల్లితండ్రులు (సూర్య, హేమ) కొండపల్లి బొమ్మలు తయారుచేసి, వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆ కొండపల్లి బొమ్మలతో ఒక స్టార్ హోటల్లో స్టాల్ పెట్టి అమ్ముకుంటున్న విజయ్‌ని చూసి, ముచ్చటపడి మాట కలుపుతుంది హాసిని (మృణాళిని రవి). ఆమె తండ్రి వెంకటరమణ వంద ఎకరాల ఆసామీ. ఆర్గానిక్ పంటలు పండిస్తూ పేరు గడిస్తాడు. అతనికి అన్నివిధాలా అనుకూలవతి ఆయన భార్య శకుంతల (మీనా). విజయ్, హాసిని స్నేహం ప్రణయంగా మారుతుంది. ఆ విషయం వెంకటరమణ చెవిన పడుతుంది. తన అంతస్తుకి ఏమాత్రం తూగని కుటుంబంతో వియ్యానికి ససేమిరా అంటాడు వెంకటరమణ. దాంతో విజయ్ ఏం చేశాడు? మునికొండ (సునీల్) అనే కొత్త నిర్మాత నుంచి వచ్చిన సినిమా డైరెక్షన్ చాన్సును ఏం చేశాడు? అనే విషయాలు మిగతా కథలో తెలుస్తాయి.


ఎనాలసిస్ :

ఎస్వీ కృష్ణారెడ్డిది ఓల్డ్ స్కూల్. ఆయన సినిమాలు ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా తనను తాను మార్చుకొనే ప్రయత్నం ఆయన చేయలేదనడానికి 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు' మూవీ మరో ఉదాహరణ. అలాగని ఈ సినిమాని చులాగ్గా తీసిపారేయలేం. ప్రేమ ముందు డబ్బు, ఆస్తులు అంతస్తులు దిగదుడుపే అని ఎన్నో సినిమాల్లో చెప్పినట్లే.. ఈ సినిమాలోనూ ఆయన చెప్పినా.. ఆ చెప్పిన పద్ధతి ఓల్డ్ స్కూల్‌ను ఇష్టపడే వాళ్లకు నచ్చుతుంది. ఈ కథలో విజయ్, హాసిని ప్రేమకు విలన్.. హాసిని తండ్రి వెంకటరమణ. అలా అని ఆయన క్రూరుడు కాడు. కూతురిపై అపారమైన ప్రేమ ఉన్నవాడు. ఆమెను అల్లారుముద్దుగా పెంచుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినవాడు. మరి అలాంటివాడు.. తన స్థాయికి తగ్గ అల్లుడ్ని తెచ్చుకోవాలని అనుకుంటాడు కానీ, ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్‌ని, అందునా బొమ్మలు చేసి అమ్ముకొనే కుటుంబానికి చెందినవాడ్ని అల్లుడిగా ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? 

వెంకటరమణకు ఓ అలవాటు ఉంటుంది. కోపం వస్తే తన హోం థియేటర్‌లోకి వెళ్లి ఒంటరిగా కూర్చోవడం. కూతురి కారణంగా అలా పదే పదే అక్కడకు వెళ్లి కూర్చునే సందర్భాలు తటస్థిస్తాయి. నేటి తరం ప్రేక్షకులకు ఈ సీన్లు కనెక్టవుతాయా అనేది సందేహం. బయట మోడరన్ డ్రస్సులు వేసుకొనే తిరిగే హాసిని.. ఇంట్లో తండ్రి చాటు కూతురిగా కనిపించడం, తండ్రి తనను విజయ్‌కు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఒప్పుకోకపోయేసరికి ఆయనను ఎదిరిస్తూ ఒక్క మాటా అనకుండా, కన్నీళ్లు పెట్టుకోవడం ఈ కాలపు అమ్మాయిలకు సరిపడని విషయం. ఇక ఆ ఇంట్లో ఉండే మూడో మనిషి శకుంతల (మీనా) పాత్ర లక్ష్యమేమంటే.. కూతురి విషయంలో భర్త అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేయడం. విజయ్ తల్లితండ్రులు కూడా ఎంత మంచి వాళ్లంటే.. సంబంధం మాట్లాడ్డానికి వెంకటరమణ ఇంటికి వచ్చినవాళ్లు ఎవరో చెప్పినట్లు అక్కడి సోఫాల్లో కూర్చోకుండా, ఒక సోఫా ముందు ఫ్లోరింగ్ మీద కూర్చుంటారు. వెంకటరమణ అక్కడకు రాగానే భయభక్తులతో లేచి నిల్చొని, ఆయన కూర్చోమనగానే మళ్లీ కింద కూర్చుంటారు. ఆయన చెప్పాకే సోఫాలో బిడియంగా కూర్చుంటారు. ఆయన వాళ్ల అంతస్తుని ఎత్తిచూపి, వాళ్ల కొడుకు సమర్ధతని ప్రశ్నిస్తే, మారు మాట్లాడకుండా వెళ్లిపోతారు. అంత పద్ధతిగా వాళ్ల పాత్రల్ని మలిచాడు దర్శకుడు. డైరెక్టర్‌గా తాను 1990ల నాటి కాలానికి చెందినవాడిననే విషయాన్ని ఇలా తన టేకింగ్ ద్వారా మరోసారి మన కళ్లకు కట్టించాడు ఎస్వీ కృష్ణారెడ్డి. బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన టీవీ నటుడు సొహేల్ ఇమేజ్‌కి భిన్నమైన సెంటిమెంట్ సీన్లు అతని పాత్రకు పెట్టే సాహసం కూడా ఆయన చేశాడు.

హాస్యప్రియుడైన దర్శకుడు అనేకమంది హాస్యనటుల్ని చిన్న చిన్న పాత్రల్లో చూపించి, వాళ్లతో వినోదాన్ని పండించే ప్రయత్నం చేసి, సఫలీకృతుడయ్యాడు. మీడియా ఎంతసేపూ నెగటివ్ అంశాలకు ప్రాధాన్యం ఇస్తుందని అలీ చేసిన చానల్ రిపోర్టర్ క్యారెక్టర్ ద్వారా చూపించాడు. నిర్మాతలకు డైరెక్టర్లు కథలు చెప్పరని సునీల్ చేసిన మునికొండ అనే నిర్మాత పాత్రతో తెలియజేశాడు. సినిమాలో అసలైన విలన్ క్యారెక్టర్ అజయ్ ఘోష్ చేసిన గాజుల గంగారాం. అయితే ఆ విలన్ పాత్ర నేరుగా హీరో హీరోయిన్ల కథకు సంబంధం లేనిది. ఆ పాత్ర కూడా మనకు వినోదాన్ని అందిస్తుంది. సినిమాలో విజయ్ డైరెక్షన్‌లో మునికొండ దుందుభి అనే సినిమాని ప్రారంభిస్తాడు. ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టిందెవరో తెలుసా?.. వి.వి. వినాయక్. ఆ దుందుభి సినిమాలో హీరో హీరోయిన్లు.. వరుణ్ సందేశ్, రష్మీ గౌతం. వాళ్ల మీద ఒక డ్యూయెట్ కూడా తీస్తాడు విజయ్.

సినిమాలో రెండు ఫైట్లున్నాయి. అవి కథలో భాగంలా కాకుండా బలవంతంగా పెట్టినట్లు ఉన్నాయి. హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశం తర్వాత, హీరోయిన్‌ను ఓ పదిమంది ఆకతాయి గుంపు అల్లరి పెడుతుంటే, మన హీరో వచ్చి ఆ పదిమందినీ తన్ని తరిమేస్తాడు. రెండోసారి హీరో హీరోయిన్లు ఒక రెస్టారెంట్లో తింటుంటే.. మళ్లీ ఆ పదిమందే వచ్చి రెండోసారి చితక్కొట్టించుకుంటారు. మొదటి ఫైట్‌కు కాస్తయినా సందర్భం ఉందనుకుంటే, ఈ రెండో ఫైట్‌కు అర్థం కనపడదు. సినిమాలో బాగా నచ్చిన డైలాగ్ ఒకటుంది. యుద్ధం జరక్కూడదు కానీ విజయం దక్కాలి అనేది ఆ డైలాగ్. కాబోయే మామతో యుద్ధం జరక్కుండా తమ పెళ్లి జరగాలి అనే ఉద్దేశంతో హీరో చెప్పే డైలాగ్ అది.

సీనియర్ సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. సినిమా రిచ్‌నెస్‌తో కనిపించడానికి ఆయన కెమెరా ఎంతగానో దోహదం చేసింది. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లేతో పాటు తొలిసారి డైలాగ్స్ రాశారు. చాలాచోట్ల పడికట్టు పదాలతో పాత్రలు మాట్లాడాయి. అప్పుడప్పుడు మంచి మంచి మాటలు కూడా చెప్పాయి. ఎప్పట్లా మెలోడీ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నారు కృష్ణారెడ్డి. ఆయన ఇచ్చిన సీన్లను తనకు సాధ్యమైనంతలో ఆసక్తికరంగా అతికించడానికి ఎడిటర్ ప్రవీణ్ కృషి చేశాడు. శివ శ్రీరాముల ఆర్ట్ వర్క్ ఇంప్రెసివ్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు

సినిమాలో పాత్రధారులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆర్గానిక్ వెంకటరమణ, శకుంతల దంపతులుగా రాజేంద్రప్రసాద్, మీనా బాగా రాణించారని ప్రత్యేకంగా చెప్పాలా? చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి.. అందులోనూ కథకు అతి కీలకమైన పాత్రలో రాజేంద్రప్రసాద్ చెలరేగిపోయి నటించారు. విజయ్, హాసిని పాత్రల్లో సొహేల్, మృణాళిని జంట ముచ్చటగా ఉంది. హుషారైన సీన్లలో సొహేల్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఏడుపు సీన్లలో మృణాళిని చూడ్డం కష్టమనిపించింది. హీరో తల్లితండ్రులు సీత, వెంకట్రావు పాత్రల్లో హేమ, సూర్య ఒదిగిపోయారు. సూర్య హావభావాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. గాజుల గంగారాం పాత్రలో అజయ్ ఘోష్ సినిమాకి ప్లస్సయ్యాడు. ఆయన డైలాగ్ డిక్షన్, ఎక్స్‌ప్రెషన్స్ సూపర్బ్. నిర్మాత మునికొండగా సునీల్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. అలీ, కృష్ణ భగవాన్, బాబూ మోహన్, సప్తగిరి, పృథ్వీ లాంటి పేరుపొందిన కమెడియన్లు అతిథి పాత్రల్లో కనిపించారు. హీరో ఫ్రెండ్ రాముగా వైవా హర్ష, గంగారాం బావమరిదిగా ప్రవీణ్ మెప్పించారు. వరుణ్ సందేశ్, రష్మీ గౌతం, వెంకట్ స్పెషల్ అప్పీరెన్సుల్లో మెరిశారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

రెండు ఫైట్లు మినహా ఎలాంటి రక్తపాతాలు, హింసాత్మక సన్నివేశాలు లేకుండా ఆహ్లాదకరమైన వినోదానికి పెద్దపీట వేసి ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు' మూవీ నేటి యంగ్ జనరేషన్ కంటే, పాత తరం వారికే నచ్చే అవకాశాలు ఎక్కువ. హాస్యప్రియులు మాత్రం ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఒక దృక్పథానికి కట్టుబడి, ఆ తరహాలోనే సినిమాలు చేస్తానని మరోసారి చాటిచెప్పిన ఎస్వీ కృష్ణారెడ్డి నిబద్ధతని మాత్రం మెచ్చుకోవాల్సిందే.

 

- బుద్ధి యజ్ఞమూర్తి