Read more!

English | Telugu

సినిమా పేరు:మాచర్ల నియోజకవర్గం
బ్యానర్:శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌
Rating:2.00
విడుదలయిన తేది:Aug 12, 2022

సినిమా పేరు: మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం
తారాగ‌ణం: నితిన్‌, కృతి శెట్టి, కేథ‌రిన్ ట్రెసా, స‌ముద్ర‌క‌ని (డ్యూయ‌ల్ రోల్‌), వెన్నెల కిశోర్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, శ్యామ‌ల‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, జ‌య‌ప్ర‌కాశ్‌
డైలాగ్స్: మామిడాల తిరుప‌తి
మ్యూజిక్: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మురెళ్ల‌
ఎడిటింగ్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
ఆర్ట్: సాహి సురేశ్‌
నిర్మాత‌లు:  సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి
బ్యాన‌ర్: శ్రేష్ఠ్ మూవీస్‌
విడుద‌ల తేదీ: 12 ఆగ‌స్ట్ 2022

నితిన్ హీరోగా ఆయ‌న సొంత బ్యాన‌ర్ శ్రేష్ఠ్ మూవీస్ 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' మూవీని అనౌన్స్ చేసిన‌ప్పుడు, ఆ టైటిల్ చాలామంది దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌తిభావంతుడైన ఎడిట‌ర్ అనిపించుకున్న ఎస్‌.ఆర్‌. శేఖ‌ర్ (పూర్తి పేరు ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి) ఈ మూవీతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడ‌ని తెలిసి, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా ఈ మూవీపై దృష్టి సారించాయి.స్వ‌ల్ప కాలంలోనే యువ‌త‌రం క‌ల‌ల‌రాణిగా మారిన కృతి శెట్టి నాయిక‌గా న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' ఎలా ఉన్న‌ద‌య్యా అంటే...

క‌థ‌

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం మొత్తం రాజ‌ప్ప (స‌ముద్ర‌క‌ని) అంటే హ‌డ‌లిపోతుంటుంది. అక్క‌డ 30 సంవ‌త్స‌రాలుగా అత‌ను ఏక‌గ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నిక‌వుతుంటాడు. అత‌నికి వ్య‌తిరేకంగా బ‌రిలో నిలిచేవాళ్లు కానీ, ఓటు వేసే వాళ్లు కానీ ఒక్క‌డు కూడా ఉండ‌రు. వైజాగ్‌లో ఐఏఎస్ పూర్తిచేసిన సిద్ధార్ధ్ రెడ్డి అలియాస్ సిద్ధు (నితిన్‌) ఒక‌సారి బీచ్‌లో స్వాతి (కృతి శెట్టి)ని చూసీ చూడ్డంతోటే ప్రేమ‌లో ప‌డిపోతాడు. ఇద్ద‌రి మ‌ధ్యా ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఒక‌సారి చెప్పా పెట్ట‌కుండా ఆమె స్వ‌స్థ‌లం మాచ‌ర్లకు వెళ్లిపోయింద‌ని తెలిసి, ఆమెకు త‌న ప్రేమ విష‌యం చెప్పాల‌ని మాచ‌ర్ల‌లో అడుగుపెడ‌తాడు. అక్క‌డ స్వాతిని ద‌హ‌నం చేయ‌బోతున్న రాజ‌ప్ప కొడుకు వీర‌ప్ప (స‌ముద్ర‌క‌ని)నీ, అత‌ని అనుచ‌రుల్నీ చావ‌గొడ‌తాడు. దాంతో రాజ‌ప్ప రంగంలోకి దిగుతాడు. మాచ‌ర్ల నుంచి వెళ్లిపోక‌పోతే చంపేస్తాన‌ని బెదిరిస్తాడు. అప్పుడే గుంటూరు జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా పోస్టింగ్ వ‌చ్చింద‌నే క‌బురు అందుతుంది సిద్ధుకు. మాచ‌ర్ల‌లో ఎన్నిక‌లు జ‌రిపిస్తాన‌ని రాజ‌ప్ప‌తో ఛాలెంజ్ చేస్తాడు. అత‌ను త‌న మాట ఎలా నిలుపుకున్నాడు? త‌న‌కు ఎదురుతిరిగిన ప్ర‌తి ఒక్క‌రినీ న‌రికి చంపేసే రాజ‌ప్ప చూస్తూ ఊరుకున్నాడా? అస‌లు సిద్ధు, స్వాతి కుటుంబాల మ‌ధ్య ఉన్న క‌నెక్ష‌న్ ఏమిటి? ఈ విష‌యాల‌ను మిగ‌తా సినిమాలో మ‌నం చూస్తాం.


ఎనాలసిస్ :

సొంత బ్యాన‌ర్‌పై నితిన్‌ సినిమా చేస్తున్నాడంటే క‌చ్చితంగా ఆ సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ‌తాయి. ఆ అంచ‌నాల‌తో వెళ్లిన వాళ్ల‌ను నితిన్‌, డైరెక్ట‌ర్ య‌స్‌.ఆర్‌. శేఖ‌ర్ తీవ్రంగా నిరాశ‌ప‌రిచారు. క‌థ‌లో కానీ, క‌థ‌నంలో కానీ ఏమాత్రం కొత్త‌ద‌నం లేని సినిమాగా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం మ‌న ముందు ఆవిష్కృత‌మైంది. ఒక సీన్ చూస్తున్న మ‌నం, ఆ త‌ర్వాత సీన్‌ను సునాయాసంగా ఊహించేస్తూ ఉంటాం. నిజంగానే అవే సీన్లు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటాయ్‌. దాంతో మ‌న‌లో ఎగ్జ‌యిట్‌మెంట్ త‌గ్గిపోతుంటుంది. అస‌లు క‌థ‌లోనే ఎన్నో త‌ప్పుల త‌డ‌క‌లున్నాయ్‌. సినిమా అంటే లాజిక్‌లెస్ అని మ‌న‌కు తెలుసు. కానీ ఇది ఎన్నిక‌ల‌తో ముడిప‌డిన క‌థ కాబ‌ట్టి, క‌చ్చితంగా ఆ ఎన్నిక‌ల‌కు సంబంధించిన లాజిక‌ల్ అంశాల గురించి మాట్లాడ‌కుండా ఎవ‌రూ ఉండ‌రు. 

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో 30 ఏళ్లుగా రాజ‌ప్ప అనే ఒకే వ్య‌క్తి ఎన్నిక‌ల‌నేవి లేకుండా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌వుతున్నాడంటే ప్ర‌భుత్వం చోద్యం చూస్తూ ఊరుకుండిపోయిందా? అత‌ను ఏకంగా క‌లెక్ట‌ర్‌నే న‌రికి చంపేస్తే క‌నీసం స్పందించ‌కుండా ఉండిపోయిందా? ఇద్ద‌రు వ్య‌క్తులు ఎన్నిక‌ల్లో నిల్చుంటే, జ‌నం ఎవ‌రూ ఓటేయ‌కుండా ఉంటే.. తానే మ‌ళ్లీ ఎమ్మెల్యే అవుతాన‌ని రాజ‌ప్ప ఎలా అనుకుంటాడు? గుంటూరు జిల్లా మొత్తానికీ క‌లెక్ట‌ర్ అయిన సిద్ధార్థ్ రెడ్డి జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ల‌లో జిల్లా మొత్తం ప‌ర్య‌వేక్షించ‌కుండా మాచ‌ర్ల‌లోనే తిష్ఠ‌వేసి, అక్క‌డ ఎన్నిక‌లు జ‌రిపించ‌డానికే త‌న టైమ్‌నంతా కేటాయిస్తాడా? రాజ‌ప్ప ఎంత‌టి క్రూరుడో తెలిసి కూడా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోడానికి ఎక్క‌డెక్క‌డి నుంచో త‌న‌ని న‌మ్మి వ‌చ్చిన కుర్రాళ్ల‌కు క‌నీస సెక్యూరిటీ ఏర్పాటు చేయాల‌ని సిద్ధూకు ఆలోచ‌న క‌ల‌గ‌లేదా? ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌లకు మ‌న‌కు స‌మాధానం ల‌భించ‌దు. దీన్ని బ‌ట్టి ఈ సినిమాని డైరెక్ట‌ర్ ఎలా తీసి వుంటాడో ఊహించుకోవాల్సిందే. సినిమాలో రిలీఫ్ కోసం ఉద్దేశించిన గుంత‌ల‌కిడి గురునాథంగా వెన్నెల కిశోర్ ఓవ‌ర్ యాక్టింగ్‌తో కొన్నిచోట్ల వినోదాన్నీ, ఇంకొన్ని చోట్ల ఇరిటేష‌న్‌నూ క‌లిగించాడు. 

మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ మ్యూజిక్ పాట‌ల వ‌ర‌కు బాగానే ఉంది. జాత‌ర‌లో "రారా రెడ్డీ" స్పెష‌ల్ సాంగ్ ఆక‌ట్టుకుంటుంది కానీ ఒక క‌లెక్ట‌ర్ ఐట‌మ్ గాళ్‌తో కుప్పిగంతులు వేయ‌డం ఏమైనా హుందాగా ఉంటుందా? ఆ పాట త‌ర్వాత వ‌చ్చే ఫైట్ కూడా మ‌నం ఏదో సినిమాలో చూసిన అభిప్రాయం క‌లుగుతుంది. గ‌తంలో జాత‌ర‌లో హీరోను చంప‌డానికి పులి వేషాల‌తో రౌడీలు వ‌చ్చిన సినిమాలు ఉన్నాయి క‌దా! స‌న్నివేశాల‌కు మ‌హ‌తి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్నిచోట్ల సంద‌ర్భానుసారంగా ఉంటే, కొన్నిచోట్ల సౌండ్ పొల్యూష‌న్ అనిపించింది. ప్ర‌సాద్ మురెళ్ల సినిమాటోగ్ర‌ఫీ చాలా క్వాలిటీగా ఉంది. హీరో ఎలివేష‌న్ సీన్ల‌లో, ఫైట్లు, సాంగ్స్‌లో కెమెరా మ‌రింత చురుగ్గా ప‌నిచేసింది. సీనియ‌ర్ మోస్ట్ ఎడిట‌ర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఈ ముత‌క క‌థాచిత్రాన్ని త‌న అనుభ‌వాన్నంతా ఉప‌యోగించినా ర‌క్షించ‌లేని స్థితిలో ప‌డ్డారు. సాహి సురేశ్ ఆర్ట్ వ‌ర్క్ ఓకే.

న‌టీన‌టుల ప‌నితీరు

క‌లెక్ట‌ర్ సిద్ధార్థ్ రెడ్డి అలియాస్ సిద్ధుగా నితిన్ త‌న‌దైన స్ట‌యిల్‌, బాడీ లాంగ్వేజ్‌తో న‌టించాడు. అత‌ని న‌ట‌న‌కు వంక పెట్టాల్సింది ఏమీ లేదు. విల‌న్‌తో త‌ల‌ప‌డే స‌న్నివేశాల్లో ఎంత ఫెరోషియ‌స్‌గా యాక్ట్ చేశాడో, హీరోయిన్‌తో ప్రేమను వ్య‌క్తం చేసే సీన్ల‌లో అంత రొమాంటిక్‌గా క‌నిపించాడు. వెన్నెల కిశోర్‌ను ఆడుకొనే సీన్ల‌లో వినోదాన్ని అందించాడు. స్వాతి పాత్ర‌లో కృతి సునాయాసంగా ఇమిడిపోయింది. అందం, అభిన‌య సామ‌ర్థ్యం క‌ల‌గ‌ల‌సిన ఆమెకు న‌టించే అవ‌కాశం త‌క్కువ‌గానే ల‌భించింది. సిద్ధును పెళ్లి చేసుకోవాల‌ని త‌పించే నిధి పాత్ర‌లో కేథ‌రికు పెద్ద పని లేక‌పోయింది. తండ్రీకొడుకులు రాజ‌ప్ప‌, వీర‌ప్ప పాత్ర‌ల్లో స‌ముద్ర‌క‌ని గొప్ప‌గా రాణించాడు. క్రూర‌త్వాన్ని పీక్ లెవ‌ల్లో ప్ర‌ద‌ర్శించాడు. గుంత‌ల‌కిడి గురునాథం పాత్ర‌లో అవ‌స‌రానికి మించి వెన్నెల కిశోర్ చెల‌రేగిపోయి చేశాడు. ఈగో వేరే లెవ‌ల్లో ఉండే వ్య‌క్తిగా అత‌ను అడ్డూ అదుపూ లేకుండా న‌టించాడు. కంట్రోల్డ్‌గా ప‌ర్ఫామ్ చేయమ‌ని అత‌నికి ఎవ‌రైనా గ‌ట్టిగా చెప్పాలి. హీరో తండ్రి న‌రేంద‌ర్‌గా ముర‌ళీశ‌ర్మ‌కు కానీ, హీరోయిన్ తండ్రి సురేంద‌ర్‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు కానీ త‌మ న‌ట విన్యాసాల‌ను పెద్ద‌గా ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం రాలేదు. సిద్ధు త‌ల్లిగా ఇంద్ర‌జ‌, వెన్నెల కిశోర్ భార్య‌గా శ్యామ‌ల‌, ఎమ్మార్వోగా బ్ర‌హ్మాజీ, స్వాతి తాత రాఘ‌వ‌య్య‌గా శుభ‌లేఖ సుధాక‌ర్‌, ముఖ్య‌మంత్రిగా జ‌య‌ప్ర‌కాశ్ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మూస‌, రొడ్డ‌కొట్టుడు త‌ర‌హాలోనే క‌థ‌, క‌థ‌నం ఉండ‌టం, నాలుగు పాట‌లు, ఐదు ఫైట్లు త‌ర‌హాలోనే సినిమా న‌డ‌వ‌డం ఈ మూవీకి పెద్ద ప్ర‌తిబంధ‌కంగా మారింది. ఒక మంచి క‌మ‌ర్షియ‌ల్ మూవీని చూద్దామ‌ని ఆశ‌ప‌డి వెళ్లిన వాళ్ల‌ను తీవ్రంగా అసంతృప్తికి గురిచేసే సినిమా 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం'.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి