English | Telugu
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి.
Rating:1.75
విడుదలయిన తేది:Dec 10, 2021
సినిమా పేరు: లక్ష్య
తారాగణం: నాగశౌర్య, కేతికా శర్మ, శత్రు, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, భరత్‌రెడ్డి, సత్య, కిరీటి దామరాజు, రాజశ్రీ నాయర్, వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్, సురేశ్, భిక్షు, జబర్దస్త్ రాము
కథ, స్క్రీన్‌ప్లే: ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి
మాటలు: సృజనమణి
సంగీతం: కాలభైరవ
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖి
నిర్మాతలు: నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్
దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి.
విడుదల తేదీ: 10 డిసెంబర్ 2021
ఎయిట్ ప్యాక్ బాడీ, పొడవాటి గడ్డంతో నాగశౌర్య ఫస్ట్ లుక్ రిలీజైనప్పుడు 'లక్ష్య' మూవీ సంచలనం సృష్టించబోతోందని కనీసం అతని ఫ్యాన్స్ ఆశించారు. సాధారణ ప్రేక్షకులు కూడా ఆర్చరీ (విలువిద్య) నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాపై ఆసక్తి కనపర్చారు. 'రొమాంటిక్' ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్‌గా నటించగా, ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి డైరెక్టర్‌గా పరిచయమైన 'లక్ష్య' గురి కరెక్టుగానే కుదిరిందా?
కథ:- పార్థు (నాగశౌర్య) చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పేతో తాతయ్య (సచిన్ ఖేడేకర్) పెంచి పెద్దచేస్తాడు. మనవడిని వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌గా చూడాలని కలలు కంటాడు. పార్థుకు మంచి ట్రైనింగ్ ఇప్పించాలని ఉన్న ఊరిని వదిలి, హైదరాబాద్‌కు మకాం మారుస్తాడు. అతడి ఫీజుల కోసం ఆస్తుల్నీ, ఇంటినీ.. అమ్మేస్తాడు. తన గుండె జబ్బును మనవడి దగ్గర దాచి, అతను స్టేట్ ఛాంపియన్ అవడం చూసి, కన్నుమూస్తాడు. తాతయ్యే తన ధైర్యమని నమ్మిన పార్థు దారి తప్పడమే కాకుండా, మత్తుకు బానిసవుతాడు. ఈ క్రమంలో ప్రేయసి రితికి (కేతికా శర్మ)కు దూరమవుతాడు. ఆ తర్వాత పార్థు జీవితం ఏమైంది? అతడు ప్రపంచ ఛాంపియన్ కావాలనే తాతయ్య కల కలగానే మిగిలిపోయిందా? లక్ష్యాన్ని చేరుకోగలిగాడా? అనే విషయాలు మిగతా కథలో చూస్తాం.
ఎనాలసిస్ :
స్పోర్ట్స్ డ్రామా తియ్యడం కత్తిమీద సాము వ్యవహారం. ఒకవైపు ఆటనూ, మరోవైపు లైఫ్‌లోని ఎమోషన్స్‌నూ ఆసక్తి తగ్గకుండా, విసుగు పుట్టించకుండా, ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా తియ్యగలగాలి. ఆశయ సాధన కోసం ఆటగాడు అనుభవించే పెయిన్‌తో ఆడియెన్స్ కనెక్టవ్వాలి. కథలో, కథనంలో అలాంటివి ఉన్నాయనే నమ్మకం కుదిరినప్పుడే స్పోర్ట్స్ డ్రామా తియ్యడానికి నడుం బిగించాలి. ఈ కసరత్తు చేయకుండా, మెయిన్ క్యారెక్టర్‌తో ఆడియెన్స్ కనెక్టయ్యేలా సీన్స్‌ను కానీ, స్క్రీన్‌ప్లేను కానీ రాసుకోకుండా, పైపైన కథ చెప్పుకుంటూ పోతే ఎలా ఉంటుందో చెప్పడానికి నిఖార్సయిన నిదర్శనం.. 'లక్ష్య'. ఒక కథగా 'లక్ష్య' ఫర్వాలేదనిపిస్తుంది కానీ, పకడ్బందీ స్క్రీన్‌ప్లే లేకుండా, కథానాయకుడు పార్థు పాత్ర ఔచిత్యాన్ని పదే పదే నీరుగారుస్తూ, ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే సన్నివేశాలతో నింపేయడం వల్ల 'లక్ష్య' పూర్తిగా గురితప్పిన బాణంలా మారిపోయింది. ఒక సీన్‌లో తన ఆర్చరీ బోర్డ్ బదులు పక్కనోడి ఆర్చరీ బోర్డ్‌కు బాణాన్ని కొట్టి, కిందపడిపోతాడు పార్థు. ఈ సినిమా పరిస్థితి కూడా అంతే. అంతగా గురితప్పిన సినిమా ఇది.
Also read: 'స్కైలాబ్' మూవీ రివ్యూ
మనవడి మీద ఆశలు పెట్టుకున్న తాతయ్య చనిపోతే, హీరో పడే పెయిన్ ఎంతగా ప్రేక్షకుడ్ని కదిలించాలి? కానీ ఆ సన్నివేశం మనల్ని కదలించకపోయింది. డైలాగ్స్ కూడా రెండు మూడు చోట్ల మినహాయిస్తే అతి సాధారణంగా ఉన్నాయి. అనేక సందర్భాల్లో క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ చిరాకు తెప్పించాయి కూడా. తాతయ్య తప్ప మరో లోకం లేదన్నట్లు బతికిన పార్థు, ఆయన చనిపోయాక దారితప్పే సీన్లు ఏమాత్రం ఇంప్రెసివ్‌గా లేవు. అతడు పడే వేదనతో మనం కనెక్ట్ కాలేం. పైగా అతడి చేష్టలు ఓవర్‌గా అనిపిస్తుంటాయి. ఒక సీన్‌లో తన చేష్టల్ని ప్రశ్నించి, మందలించిన హీరోయిన్ తండ్రిని ఆమె ముందే చెంపమీద కొట్టే సీన్ మరీ అసందర్భంగా ఉంది. పార్థు కొట్టిన దెబ్బకు ఆయన కిందపడిపోతాడు. దాంతో పాటే పార్థు క్యారెక్టరైజేషన్ కూడా పాతాళానికి పడిపోయింది.
Also read: 'అఖండ' మూవీ రివ్యూ
అలా పాతాళానికి పడిపోయిన పార్థును లేపడానికి సారథి (జగపతిబాబు) అనే క్యారెక్టర్‌తో పైకి లేపడానికి ట్రై చేశాడు దర్శకుడు సంతోష్. కానీ అప్పటికే సమయం దాటిపోయింది. పార్థును గెలిపించడానికి సారథి చేసే పనులు కూడా మనల్ని అంతగా ఆకట్టుకోవు. కాకపోతే.. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఒకింత మెరుగంతే! నాగశౌర్య ఎయిట్ ప్యాక్ బాడీకి ట్రాన్స్‌ఫర్మేషన్ సీన్ బాగుందనుకునేంతలోనే.. కథనాన్ని మళ్లీ డల్ చేసేని, ఆసక్తిని నీరుకార్చేశారు. సెన్సార్ సర్టిఫికెట్‌లో సినిమా నిడివి 152 నిమిషాలని ఉంది. కానీ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 9 గంటల ఆటకు చూసింది.. 135 నిమిషాల లోపు సినిమానే. అయినా కూడా పలుమార్లు పార్థు అనే ఆర్చర్‌కు సంబంధించిన సీన్లు టార్చర్ పెట్టాయంటే.. మొత్తం సినిమా చూపిస్తే.. ఇంకెలా అనిపించేదో!
టెక్నికల్‌గా మెరుగ్గా అనిపించినవి కాలభైరవ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ. సన్నివేశాలు బలహీనంగా ఉన్నప్పుడు ఎంత బీజీయంతో లేపాలని చూసినా ప్రయోజనం ఏముంటుంది! కాలభైరవ వర్క్ వేస్ట్ అయ్యింది. పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకోలేదు. జునైద్ సిద్దిఖికి కూడా సీన్ల ఎడిటింగ్ విషయంలో ఏం చేయాలో పాలుపోయి ఉండదనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.
Also read: 'అనుభవించు రాజా' మూవీ రివ్యూ
నటీనటుల పనితీరు
విడివిడిగా చూసినప్పుడు ఆర్టిస్టులందరూ తమవంతు బాధ్యతల్ని చక్కగానే నిర్వర్తించానిపిస్తుంది. ప్రేక్షకులతో సహానుభూతి చెందించలేని పార్థు పాత్రకు న్యాయం చెయ్యడానికి నాగశౌర్య శతవిధాల ప్రయత్నించాడు. సినిమాలో మూడు రకాల గెటప్పులతో అతను కనిపించాడు. పొడవుగా పెంచిన గడ్డం లుక్‌తో ఆకట్టుకున్నాడు. చివరన ఆ గడ్డం తీసేసి, పొడవాటి మీసంతో కనిపించాడు. తాతయ్య చనిపోయినప్పుడు పడే వేదనని బాగా పండించాడు. హీరోయిన్ కేతికా శర్మకు నటించడానికి పెద్దగా అవకాశం కలగలేదు. అలాగని ఆమె గ్లామర్‌ను కూడా డైరెక్టర్ ఉపయోగించుకోలేదు.
Also read: 'దృశ్యం 2' మూవీ రివ్యూ
పార్థు తాతయ్యగా సచిన్ ఖేడేకర్, పార్థు తండ్రి స్నేహితుడైన సారథిగా జగపతిబాబు మెప్పించారు. పార్థును ఎలాగైనా ఓడించాలనే తోటి ఆర్చర్ రాహుల్‌గా నెగటివ్ రోల్‌లో శత్రు బాగానే ఉన్నాడు. కురుక్షేత్ర అకాడమీని నడిపే వ్యక్తిగా భరత్‌రెడ్డి, ఆర్చర్ రాజేశ్ పాత్రలో కిరీటి దామరాజు, హీరోయిన్ తల్లితండ్రులుగా రాజశ్రీ నాయర్, వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్ పాత్రల పరిధి మేరకు నటించారు. సత్య స్కిల్స్‌కు తగ్గ పాత్ర పడలేదు. ఆర్చరీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా సురేశ్, ప్రకృతి వైద్యునిగా భిక్షు కనిపించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
పూర్తిగా గురితప్పి, లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచిన సినిమా 'లక్ష్య'. ఈ సినిమా వైఫల్యానికి ప్రధాన బాధ్యుడు దర్శకుడు ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి అనేది నిస్సందేహం. స్క్రీన్‌ప్లే, సన్నివేశాల కల్పన విషయంలో అతని అపరిపక్వత, వాటిని ఆసక్తికరంగా మలచడంలో అతని వైఫల్యం 'లక్ష్య'కు శాపం.
- బుద్ధి యజ్ఞమూర్తి