Read more!

English | Telugu

సినిమా పేరు:గార్గి
బ్యానర్:బ్లాకీ, జెనీ & మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్స్
Rating:3.25
విడుదలయిన తేది:Jul 15, 2022

సినిమా పేరు: గార్గి
తారాగ‌ణం: సాయి పల్లవి, ఆర్.ఎస్.శివాజీ, కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, జయప్రకాష్
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్ర‌ఫీ: శ్రాయంతి, ప్రేమకృష్ణ అక్కట్టు
ఎడిటర్: షఫీక్ మహమ్మద్ అలీ
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: గౌతమ్ రామచంద్రన్
ప్రొడ్యూసర్: బ్లాకీ, జెనీ & మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్స్
విడుద‌ల తేదీ: జూలై 15, 2022

 

ఇటీవల 'విరాట పర్వం' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి నెల రోజుల లోపే 'గార్గి' అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రానా సమర్పిస్తుండటం విశేషం. ఈ మూవీపై అంతగా బజ్ లేనప్పటికీ.. సాయి పల్లవి నటించిన సినిమా కావడం, ట్రైలర్ బాగుండటంతో సినీ ప్రియుల్లో కాస్త ఆసక్తి నెలకొంది. మరి ఈ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

 

కథ:-

ఒక సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన గార్గి(సాయి పల్లవి) స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంటుంది. ఆమె తండ్రి బ్రహ్మానందం(ఆర్.ఎస్.శివాజీ) ఓ అపార్ట్‌మెంట్ లో వాచ్‌మెన్ గా పని చేస్తుంటాడు. అయితే ఆ అపార్ట్‌మెంట్ లో ఓ తొమ్మిదేళ్ల బాలికపై ఐదుగురు అత్యాచారం చేశారని, అందులో బ్రహ్మానందం కూడా ఒకడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో గార్గి జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. నా అనుకున్న వాళ్ళు దూరమవుతారు. నిందితుల తరపున వాదించడానికి వీళ్ళేదంటూ యూనియన్ చెప్పడంతో లాయర్లు కూడా ఎవరూ ముందుకు రారు. అలాంటి సమయంలో అప్పటిదాకా ఒక్క కేసు కూడా వాదించని, సరిగా మాట్లాడలేని లాయర్ గిరీశం(కాళీ వెంకట్) ముందుకొస్తాడు. అతనితో కలిసి గార్గి న్యాయ పోరాటం ఎలా చేసింది? తన తండ్రిని ఈ కేసు నుంచి బయటకు తీసుకురాగలిగిందా? అసలు ఆ నలుగురితో పాటు పాపపై అత్యాచారం చేసిన ఐదో వ్యక్తి ఎవరు? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు అనేది బయటనో, సినిమాల్లోనో తరచూ వింటుంటాం, చూస్తుంటాం. ఈ సినిమాలో అదే అంశాన్ని తీసుకున్న దర్శకుడు గౌతమ్ రామచంద్రన్.. దానిని విభిన్న కోణాల్లో ఆవిష్కరించి అక్కడక్కడా కంటతడి పెట్టించడమే కాకుండా, ఆలోచన రేకెత్తించేలా చేశాడు. ఎక్కడా ఓవర్ మెలో డ్రామా లేకుండా రియలిస్టిక్ అప్రోచ్ తో చాలా చక్కగా సినిమాని తెరకెక్కించాడు.

చిన్నప్పుడు తనపై ట్యూషన్ టీచర్ లైంగిక చర్యలకు పాల్పడుతుంటే.. "ఈ నాన్నను గుర్తు చేసుకొని అలాంటి వారిపై ధైర్యంగా పోరాడాలి" అని చెప్పిన తండ్రే.. ఇప్పుడు అత్యాచారం కేసులో జైలుకెళ్తే కూతురు పడే మనోవేదన ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు చూపించాడు దర్శకుడు. అలాగే, అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తొమ్మిదేళ్ల కూతురిపై అత్యాచారం జరిగితే ఆ తండ్రి బాధని మన బాధ అనుకునేలా చేశాడు. ఓ వైపు అన్యాయంగా అరెస్టయిన తండ్రిని కాపాడుకోవడం కోసం కూతురు చేసే న్యాయపోరాటం, మరోవైపు తన కూతురిపై అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకరు తప్పించుకుంటారేమోనని తండ్రి పడే ఆవేదన. ఈ రెండు సంఘర్షణలను బ్యాలెన్స్ చేస్తూ సినిమాని నడిపించిన విధానం ఆకట్టుకుంది.

మాములుగా కోర్టు డ్రామాలంటే పెద్ద కోర్టు సెటప్, భారీ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇందులో అలా కాదు. చాలా సహజంగా చిత్రీకరించారు. పైగా ట్రాన్స్ జెండర్ ని జడ్జ్ గా చూపించాలన్న ఆలోచన బాగుంది. 'నాకు ఆడవాళ్ల బాధ తెలుసు, మగవాళ్ల పొగరు తెలుసు.. కాబట్టి ఈ కేసుకి నేనే కరెక్ట్' అంటూ ఆ పాత్రకి జస్టిఫికేషన్ ఇచ్చిన విధానం బాగుంది. ఇలా పాత్రలను మలిచిన తీరు, కథను నడిపించిన విధానం అన్నీ బాగున్నాయి. అక్కడక్కడా కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినా.. ఓవరాల్ గా సినిమా బాగుంది. సినిమా అంతా ఒకెత్తయితే, క్లైమాక్స్ ఒక ఎత్తు. అసలు ఆ క్లైమాక్స్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. థియేటర్ నుంచి ప్రేక్షకుడు చాలా సంతృప్తిగా బయటకు వస్తాడు.

శ్రాయంతి, ప్రేమకృష్ణ అక్కట్టు సినిమాటోగ్రఫీ అకట్టుకుంది. సన్నివేశాలకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. గోవింద్ వసంత సంగీతం కూడా సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలకు మరింత బలం చేకూర్చాడు. 

సినిమాకి పెద్ద మైనస్ అంటే ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం అని చెప్పొచ్చు. సాయి పల్లవి గత చిత్రం 'విరాట పర్వం'కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ, ప్రేక్షకులు థియేటర్స్ కి పెద్దగా రాక కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చింది. అందులో రానా ఉన్నాడు, ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు.. అయినా ఫలితం లేదు. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఈ సినిమాకి సాయి పల్లవినే సెల్లింగ్ పాయింట్, పైగా బజ్ కూడా లేదు. మరి మౌత్ టాక్ తో థియేటర్స్ కి వచ్చేలా చేస్తుందేమో చూడాలి.

 

నటీనటుల పనితీరు:-

సినిమా సినిమాకి నటిగా సాయి పల్లవి ఎంతో ఎదిగిపోతోంది. ఇందులో ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటిదాకా కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. ఆమె పాత్ర తాలూకు బాధని తన కళ్ళలో ప్రతిబింబించేలా చేసింది. తన తండ్రి గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడని తెలిసినప్పుడు ఆమె పడే బాధ కంటతడి పెట్టిస్తుంది. ఆ పాత్రలో ఆమె లీనమై మనల్ని ఆ పాత్రతో పయనించేలా చేసింది. ఇక సినిమాలో సాయి పల్లవికి అండగా ఉండే లాయర్ గిరీశం పాత్రలో కాళీ వెంకట్ ఆకట్టుకున్నాడు. ఆ పాత్రలోని అమాయకత్వాన్ని చక్కగా పలికించాడు. అక్కడక్కడా నవ్వించాడు కూడా. గార్గి తండ్రి బ్రహ్మానందం పాత్రలో ఆర్.ఎస్.శివాజీ ఒదిగిపోయాడు. ఇద్దరు కూతుళ్ళ తండ్రి అరవై ఏళ్ళ వయస్సులో అత్యాచార కేసులో అరెస్టయితే.. ఆ అవమానం, బాధ ఎలా ఉంటుందో తన హావభావాల్లో చక్కగా చూపించాడు. సీనియర్ లాయర్ గా జయప్రకాశ్, జర్నలిస్ట్ గా ఐశ్వర్య లక్ష్మి మెప్పించారు. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

రెగ్యులర్ మసాలా సినిమాలు ఇష్టపడేవారికి 'గార్గి' సినిమా నచ్చకపోవచ్చు. కానీ సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు, ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. 9 ఏళ్ళ బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయిన తండ్రి కోసం కూతురు సాగించే న్యాయం పోరాటం ఆకట్టుకుంటుంది.

-గంగసాని