English | Telugu

సినిమా పేరు:దర్బార్
బ్యానర్:లైకా ప్రొడక్షన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jan 9, 2020

సినిమా పేరు: దర్బార్
తారాగణం: రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టి, యోగిబాబు, శ్రీమాన్, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా, దలీప్ తాహిల్
మాటలు: శ్రీరామకృష్ణ
పాటలు: భాస్కరభట్ల, కృష్ణకాంత్
మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్
ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
నిర్మాత: సుభాస్కరన్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్. మురుగదాస్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 9 జనవరి, 2020

సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ ఫస్ట్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాగా 'దర్బార్' ఊహించిన విధంగానే మంచి పబ్లిసిటీ పొందింది. దానికి తగ్గట్లే అంచనాలూ వెల్లువెత్తాయి. చాలా కాలం తర్వాత రజనీకాంత్ పోలీస్ క్యారెక్టర్ చేశారనే అంశమూ 'దర్బార్' కోసం ఆయన అభిమానులతో పాటు, సాధారణ సినిమా ప్రియులూ ఎదురుచూసేలా చేసింది. గత సంక్రాంతికి 'పేట'తో మన ముందుకు వచ్చి అలరించిన రజనీకాంత్, ఈ సినిమాలో ఎలా ఉన్నారు, 'దర్బార్' ఆశించిన స్థాయిలోనే ఉందా? చూద్దాం...

కథ 
ముంబై పోలీస్ కమిషనర్ ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్)కు ఒక్కగానొక్క కూతురు వల్లీ (నివేదా థామస్) మినహా వేరే కుటుంబమంటూ ఉండదు. గతంలో ఎన్నో ఏళ్ల క్రితం హరి చోప్రా (సునీల్‌శెట్టి) అనే గ్యాంగ్‌స్టర్ ఒక భవనంలో ఏకంగా 17 మంది పోలీసుల్ని సజీవ దహనం చేసేసి, దేశం వదిలి పారిపోవడంతో, ముంబైలో పోలీసులంటే జనం రెస్పెక్ట్ ఇవ్వరు. కమిషనర్‌గ అరుణాచలం బాధ్యతలు తీసుకున్నాక ఆ పరిస్థితిలో మార్పు తీసుకువస్తాడు. డ్రగ్ డీలర్, టీనేజ్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసి, అఘాయిత్యాలు చేస్తూ వస్తున్న అజయ్ మల్హోత్రా (ప్రతీక్ బబ్బర్)ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని జైలుకు పంపిస్తాడు అరుణాచలం. కొడుకును కాపాడుకోడానికి వినోద్ మల్హోత్రా రంగంలోకి దిగుతాడు. ఆ క్రమంలో అజయ్ చనిపోతాడు. ఈ విషయం తెలియగానే అజ్ఞాతంలో ఉన్న హరి చోప్రా ముంబై వస్తాడు. పోలీసులపై ప్రతీకార దాడులు చేస్తాడు. అతనెందుకు అలా చేశాడు? చనిపోయిన అజయ్‌కూ, అతనికీ ఏమిటి సంబంధం? గ్యాంగ్‌స్టర్స్‌తో యుద్ధంలో ఆదిత్య అరుణాచలం ఏం పోగొట్టుకున్నాడు, ఏం గెలిచాడు? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

ఫస్టాఫ్‌ను వినోదాత్మకంగా, ఆదిత్య అరుణాచలంను పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా తీర్చిదిద్ది బాగుందనిపించిన దర్శకుడు మురుగదాస్, సెకండాఫ్‌ను రొటీన్ రివెంజ్ డ్రామాగా మార్చేసి నిరుత్సాహపరిచాడు. సినిమా మొదట్లోనే ఎన్‌కౌంటర్ల పేరుతో రౌడీలను చంపేసుకుంటూ వస్తాడు అరుణాచలం. వాటిపై విచారణకు వచ్చి, అవి ఫేక్ ఎన్‌కౌంటర్లని తేల్చిన మానవ హక్కుల సంఘం అధికారిణిని సైతం అతను బెదిరించి, తనకు అనుకూలంగా రిపోర్ట్ రాయిస్తాడు. అప్పుడే అతని కూతురు వల్లీ చనిపోయిందనే విషయం రివీల్ చేసి, కథను ఫ్ల్యాష్‌బ్యాక్‌లో నడిపించాడు దర్శకుడు. దాంతో వల్లి ఎప్పుడు చనిపోయిందనే టెన్షన్ మనలో కలుగుతుంది. వల్లి కనిపించినప్పుడల్లా ఆమె ఎలా చనిపోతుందో, ఎవరు చంపుతారో అనే ఆందోళనకు గురవుతాం. అయినప్పటికీ తండ్రీ కూతుళ్ల మధ్య బంధం, వాళ్ల కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు అహ్లాదాని కలిగిస్తాయి. రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయి, ఆమె ఎలా ఉంటుందో కూడా తెలీని వల్లి, ఒక సందర్భంలో పరిచయమైన లిల్లీ అనే యువతిని తండ్రికి దగ్గర చెయ్యాలని యత్నించే సన్నివేశాలు కూడా ఈ సీరియస్ సినిమాలో రిలీఫ్ నిస్తాయి. 

కానీ సెకండాఫ్‌లో డైరెక్టర్ లాజిక్‌ను గాలికొదిలేసి తీసిన సన్నివేశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రోటోకాల్ అనేది లేకుండా, ముంబై పోలీస్ కమిషనర్‌గా తను ఉండాలనుకుంటే ఉంటాననీ, తననెవరూ అక్కడ్నుంచి కదల్చలేరనీ, కదిలించాలని చూస్తే, అక్కడి పోలీసులు తిరగబడతారనీ హోం మినిస్టర్ (దలీప్ తాహిల్)కు అరుణాచలం చెప్పడం ఇండియాలో జరిగే పనేనా! జాగింగ్ చేసే నయనతార వెంట్రుక ఒక్కటి కూడా చెక్కు చెదరకపోవడం చూసినప్పుడే ఆమె పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం ఉందో తెలియజేసింది. అంతే కాదు, ఆమె క్యారెక్టరైజేషన్‌కు ఒక పర్పస్ కూడా కనిపించదు. టెక్నికల్‌గా చూస్తే, సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫీతో పాటు ఆర్ట్ డైరెక్షన్ ఇంప్రెసివ్‌గా కనిపిస్తాయి. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్‌లో మెరుపులేవీ కనిపించలేదు. రీరికార్డింగ్ ఫర్వాలేదు. ప్రి క్లైమాక్స్ సీన్‌లో లాజిక్ మిస్సయితే, క్లైమాక్స్ సీన్ సాధారణ స్థాయిలో ఉండి.. ఇటు సాధారణ ప్రేక్షకుల్నీ, అటు మురుగదాస్ అభిమానుల్నీ నిరుత్సాహపరుస్తుంది.

ప్లస్ పాయింట్స్
రజనీకాంత్, నివేదా థామస్ నటన
ఫస్టాఫ్‌లోని వినోదం, యాక్షన్ సన్నివేశాలు
సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
సెకాండాఫ్‌లోని వీక్ స్క్రీన్‌ప్లే
లాజిక్‌కు అందని సన్నివేశాలు, పాయింట్లు
నయనతార పాత్రను అసంపూర్ణంగా వదిలేయడం
రజనీ, నయన్ మధ్య ఏమాత్రం కెమిస్ట్రీ కానీ, రొమాన్స్ కానీ లేకపోవడం

నటీనటుల అభినయం
ఆదిత్య అరుణాచలం పాత్రలో రజనీకాంత్ తనదైన శైలి నటనతో రాణించాడు. అతని పాత్రలో ఏమైనా కొత్తదనం కనిపించిందంటే, అది పోలీసాఫీసర్‌గా చెయ్యడమే. 70 ఏళ్ల వయసులోనూ చురుకైన కదలికలతో ఆయన మెప్పించారు. కథలో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన సందర్భంలో బనియన్ వేసుకొని, ఎక్సర్‌సైజులు చేస్తూ, తనకున్న చిన్నపాటి కండల్ని ప్రదర్శించడం కూడా ఆయన ఒరిజినల్ ఫిట్నెస్‌ను పట్టించింది. రజనీకాంత్ తర్వాత బాగా ఆకట్టుకునేది ఆయన కూతురిగా చేసిన నివేదా థామస్. తండ్రి అంటే ప్రాణం పెట్టే పాత్రలో ఉన్నత స్థాయి అభినయాన్ని ప్రదర్శించింది నివేదా. ఆమెది ప్రేక్షకుల సానుభూతి పొందే పాత్ర. అరుణాచలం మనసును ఆకట్టుకొనే యువతిగా నయనతారను కేవలం ఆకారం కోసమే పెట్టారనుకోవాలి. నటించడానికి తగ్గ స్కోప్ ఆమెకు దక్కలేదు. ఆమెలోని నటికి ఈ పాత్ర ఎందుకూ కొరగాదు. విలన్ హరి చోప్రాగా సునీల్ శెట్టి క్రూరత్వాన్ని బాగానే ప్రదర్శించాడు. కానీ అతని క్యారెక్టర్‌లోనూ డెప్త్ లేదు. సాధారణంగా కనిపించినప్పుడల్లా నవ్వించే యోగిబాబు ఈ సినిమాలో పెద్దగా నవ్వించలేకపోయాడు. ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా పాత్రల పరిధి మేరకు విలనీ పండించారు. శ్రీమాన్, దలీప్ తాహిల్ అతిథి పాత్రలకు రవ్వంత ఎక్కువ నిడివి ఉండే పాత్రల్లో కనిపించారంతే. అరుణాచలం ఏం చెబితే అది చేసే పోలీసు పాత్రలు చేసినవాళ్లు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

వెరీ ఓల్డ్ స్టొరీలైన్, రొటీన్ యాక్షన్ ఫిలింగా మురుగదాస్ రూపొందించిన ఈ సినిమాని రజనీ అభిమానులు ఒకసారి చూడ్డానికి పనికొస్తుంది. రజనీ సినిమా అని హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లినవాళ్లు మాత్రం నిరుత్సాహానికి గురవుతారు.

- బుద్ధి యజ్ఞమూర్తి

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25