English | Telugu

సినిమా పేరు:భ‌ర‌త్ అనే నేను
బ్యానర్:డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
Rating:3.25
విడుదలయిన తేది:Apr 20, 2018

తెలుగులో పొలిటిక‌ల్ డ్రామాలు తీయ‌డం చాలా అరుదు. ఓ పెద్ద హీరో న‌టించ‌డం ఇంకా... త‌క్కువ‌. అలాంటిది... మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్‌తో  అలాంటి సినిమా తీయాల‌నుకోవ‌డం వెనుక ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తాప‌త్ర‌యం, ప్ర‌య‌త్నం మెచ్చుకోద‌గిన‌వి. ఏకంగా ముఖ్య‌మంత్రి పోస్టే క‌ట్టుబెడుతూ - టైటిల్ కూడా `భ‌ర‌త్ అనే నేను` అంటూ పెట్టుకోవ‌డం... ఆక‌ట్టుకున్నాయి. పైగా మ‌హేష్ - కొర‌టాల అనగానే `శ్రీ‌మంతుడు` లాంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ గుర్తొస్తుంది. అప్పుడు గ్రామాల ద‌త్త‌త అనే కాన్సెప్ట్‌పై ప్ర‌యాణం సాగిస్తే - ఈసారి `ఇచ్చిన మాట‌`పై నిల‌బ‌డే క‌థానాయ‌కుడిగా మ‌హేష్ క‌నిపించాడు. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఎలా సాగింది?  భ‌ర‌త్ త‌న ప్రామిస్‌ని నిల‌బెట్టుకున్నాడా?

* క‌థ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రాఘ‌వ (శ‌ర‌త్ కుమార్‌) త‌న‌యుడు భ‌ర‌త్ (మ‌హేష్ బాబు). లండ‌న్‌లో చ‌దువుకుంటుంటాడు. తండ్రి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఇంటికి తిరిగొస్తాడు.  తిరిగి వెళ్లిపోతుంటే... రాఘ‌వ స్నేహితుడు వ‌ర‌ద‌రాజు (ప్ర‌కాష్ రాజ్‌) అడ్డుకుంటాడు. ముఖ్య‌మంత్రి స్థానంలో భ‌ర‌త్ ని బ‌ల‌వంతంగా కూర్చోబెడ‌తాడు. భ‌ర‌త్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌... ప‌రిపాల‌న‌లో కొన్ని మార్పులు తీసుకొస్తాడు. విద్యా విధానాన్ని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేస్తాడు. గ్రామాలకు స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌ల్పిస్తాడు. ఈ మార్పుల‌న్నీ పార్టీ పెద్ద‌ల‌కు న‌చ్చ‌వు. అందుకే భ‌ర‌త్‌ని సీఎమ్ కూర్చీ నుంచి దింపేయాల‌ని కుట్ర ప‌న్నుతారు. మ‌రి భ‌ర‌త్‌ని దించేశారా?  ఈ కుట్ర‌ల నుంచి త‌న‌ని తాను ఎలా కాపాడుకున్నాడు?రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భ‌ర‌త్ చేసిన మేలేంటి?  అనేదే భ‌ర‌త్ అనే నేను సినిమా.


ఎనాలసిస్ :

ఈ క‌థ‌ని చూచాయిగా చ‌ర్చించుకుంటుంటే.. లీడ‌ర్ సినిమా గుర్తుకురావ‌డం స‌హ‌జం. భ‌ర‌త్ అనే నేను లైన్ కూడా అలాంటిదే. ఓ హీరో ముఖ్య‌మంత్రి అయితే త‌ప్ప‌కుండా మంచి ప‌నులే చేస్తాడు. ఈసినిమాలోనూ అంతే.  రాష్ట్రంలో స‌మ‌స్య‌ల‌పై నిజాయ‌తీగా పోరాడ‌తాడు. ఆ క్ర‌మంలో ఎదుర‌య్యేఎదురు దెబ్బ‌లేంటి?  అందులోంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? ప‌్ర‌జ‌ల మ‌న‌సు ఎలా గెలుచుకున్నాడు?  అనేదే క‌థ‌. ఈ పాయింట్‌ని ఇలానే చూపిస్తే జ‌నం ఎందుకు చూస్తారు?  స‌ర‌దాగా కాసేపు ఏ టీవీ 9 లోనో వార్త‌లు చూస్తే చాలు. మ‌హేష్ ఫ్యాన్స్ ఇలా అనుకుంటార‌నే, దానికి క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించాడు. కైరా అద్వానిని తీసుకొచ్చి ఓ ల‌వ్ స్టోరీ క‌లిపాడు. ముఖ్య‌మంత్రి ఫైటింగులు చేస్తాడా?  అనే అనుమానాలు రాకుండా... భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ని ఇమిచ్చాడు. పాట‌లు పెట్టాడు. సీఎమ్‌తో స్టెప్పులు వేయించాడు. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై, మీడియా వ్య‌వ‌స్థ‌పై కౌంట‌ర్లు వేశాడు. చివ‌ర్లో ఓ ట్విస్టు పెట్టాడు. రివైంజ్ డ్రామా న‌డిపాడు.  అలా మొత్తానికి.. దీన్నో మాంఛి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేసేశాడు.

`ప్రామిస్ ఇస్తే దాన్ని నిల‌బెట్టుకోవాలి` అనేది మంచి పాయింటు. నేటి రాజ‌కీయ నాయ‌కులంతా తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన పాయింట్‌. క‌థ ప్రారంభం అలానే సాగింది. అక్క‌డ‌క్క‌డ `ప్రామిస్‌` అంటూ గుర్తు చేస్తూ ఆ థ్రెడ్‌ని మిస్ అవ్వ‌కుండా చూసుకున్నాడు.  అయితే... అంతకు మించి బ‌ల‌మైన డ్రైవింగ్ ఫోర్స్ ఉంటే మ‌రింత బాగుండేది. క‌థానాయ‌కుడి ల‌క్ష్యం.. ప్ర‌జ‌ల‌కు మంచి ప‌నులు చేసి పెట్ట‌డ‌మే. సీఎం అయిన ద‌గ్గ‌ర్నుంచి చివ‌రి వ‌ర‌కూ అదే ప‌ని. దాంతో చూసిన స‌న్నివేశ‌మే మ‌ళ్లీ చూస్తున్న‌ట్టు అనిపిస్తుంది. ఫ‌స్టాఫ్‌లో బ్ర‌హ్మాజీని అడ్డుపెట్టుకుని కాస్త కామెడీ న‌డిపాడు. సెకండాఫ్‌లో అందుకు ఆస్కార‌మే లేకుండా పోయింది. భ‌ర‌త్ రాజీనామా చేయ‌డం వెనుక కూడా బ‌ల‌మైన పాయింట్ లేదు. ట్రాఫిక్ రూల్స్ గురించి ఓ ప‌ది నిమిషాల సీన్ చూపించారు. దాని వ‌ల్ల ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన మార్పేంటో క‌నీసం ఒక్క ఫ్రేములో అయినా చూపించ‌లేదు. ద్వితీయార్థం మొద‌లైన చాలా సేప‌టి వ‌ర‌కూ హీరోయిన్ క‌నిపించ‌దు. క్లైమాక్స్ పైపైన తేల్చేయ‌డం.. కొర‌టాల బ‌ల‌హీన‌త‌. ఇక్క‌డా అదే క‌నిపించింది. లాజిక్కులు మిస్ అయిన స‌న్నివేశాలు కోకొల్ల‌లు. క్లైమాక్స్‌లో `అత‌డు` ఛాయ‌లు క‌నిపిస్తాయి.


* న‌టీన‌టులు

శ్రీ‌మంతుడులా మ‌రో మ‌హేష్ వ‌న్ మ్యాన్ షో ఈ చిత్రం. ప్ర‌తీ ఫ్రేములోనూ మ‌హేష్ క‌నిపిస్తాడు. అల‌రిస్తాడు. మ‌హేష్‌లో గ్లామ‌ర్ రోజురోజుకీ రెట్టింపు అవుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. అత‌ని న‌వ్వుకి మ‌రోసారి దాసోహం అయిపోతాం. డైలాగులు చెప్పే విధానంలోనూ చాలా మారాడు. అత‌ని ఎమోష‌న్‌, ల‌వ్ ఫీల్‌, ఫ‌న్‌.. ఇవ‌న్నీ న‌చ్చేస్తాయి. సీఎమ్ ప‌దవికి రాజీనామా చేసిన సంద‌ర్భంలో ఓ ప్రెస్ మీట్ పెడ‌తాడు మ‌హేష్‌. సుదీర్ఘంగా సాగిన ఆస‌న్నివేశంలో మ‌హేష్‌న‌ట‌న ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది.  కైరా అడ్వానీ అందంగా ఉంది. మ‌హేష్‌తో కెమిస్ట్రీ బాగానే కుదిరింది. ల‌వ్ సీన్లు కూడా పండాయి. కానీ.. ద్వితీయార్థంలో ఆమె ఎక్కువ సేపు క‌నిపించ‌దు. మొత్తంగా చూసినా స్క్రీన్ టైమ్ చాలా త‌క్కువ‌. బ్ర‌హ్మాజీ, రావు ర‌మేష్ ఓకే అనిపిస్తారు. ప్ర‌కాష్ రాజ్ చాలా రోజుల త‌ర‌వాత స‌హ‌జంగా న‌టించ‌డానికి ప్ర‌య‌త్నించాడు.


* సాంకేతిక వ‌ర్గం

టెక్నిక‌ల్‌గా ఈ సినిమా చాలా చాలా బాగుంది. సంగీతం, కెమెరా వ‌ర్క్‌, సినిమాలో క్వాలిటీ.. ఏ విష‌యంలోనూ వంక పెట్ట‌లేం. ఫైట్లు రెండే రెండు.కానీ వాటిని డిజైన్ చేసిన ప‌ద్ధ‌తి బాగుంది. కొర‌టాల శివ ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అయ్యాడు. ద్వితీయార్థంలో టెంపో మిస్ అయిన‌ట్టు క‌నిపిస్తుంది. చాలా చోట్ల సంభాష‌ణ‌ల‌తో సినిమాని నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. లీడ‌ర్‌, ఒకే ఒక్క‌డు ఛాయ‌లు పోవ‌డానికి చాలా ప్ర‌య‌త్నించినా... అక్క‌డ‌క్క‌డ దొరికేశాడు.


* ప్ల‌స్ పాయింట్స్‌

మ‌హేష్‌
ల‌వ్ సీన్లు
సాంకేతిక వ‌ర్గం

* మైన‌స్ పాయింట్స్‌

ద్వితీయార్థం

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ప్రామిస్ నిల‌బెట్టుకున్నాడు

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25