English | Telugu
బ్యానర్:విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్
Rating:2.50
విడుదలయిన తేది:Dec 1, 2016
హారర్, థ్రిల్లర్ లాంటి మాటలు వినీ వినీ తెలుగు ప్రేక్షకులకు రోత పుట్టేసింది. పేర్లు, అందులో నటించే హీరో హీరోయిన్లు మారినా.. ఆ జోనర్‌లో వచ్చే ప్రతీ సినిమా ఒకేలా తయారవుతోంది. ఓ ఇల్లు.. దాని చుట్టూ ఓ దెయ్యం, మధ్యలో కామెడీ గ్యాంగ్.. అంతే. దాంతో ఈ జోనర్‌లో సినిమా వస్తోందంటేనే థియేటర్‌కి వెళ్లకుండానే భయం పట్టుకొంటోంది. ఇదే జోనర్‌ని సైకలాజికల్ థ్రిల్లర్‌నీ, గత జన్మ అనే ఫాంటసీనీ, డ్రగ్స్ మాఫియానీ మిక్స్ చేసి తీసిన సినిమా.. 'భేతాళుడు'. కథలో, పాత్రల్లో పార్శ్వాలు ఎక్కువే ఉండడంతో.. 'భేతాళుడు' కాస్త వైవిధ్య భరితమైన ప్రయత్నంగానే అనిపిస్తోంది. పైగా 'బిచ్చగాడు' సినిమాతో ఓ ఊహించని హిట్ అందుకొన్న విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి కథానాయకుడు. మరి అదే మ్యాజిక్ 'భేతాళుడు' కూడా రిపీట్ చేసిందా? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
దినేష్ (విజయ్ ఆంటోనీ) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. చాలా తెలివైనోడు. అన్నిటికంటే మించి.. మంచోడు. ఓ అనాథ (అరుంధతి నాయర్)ని పెళ్లి చేసుకొంటాడు. అయితే అతని జీవితం అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. ఓ గొంతు తనని వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. 'చచ్చిపో.. చంపేయ్' అనే మాటలు వినిపిస్తుంటాయి. దాంతో మానసికంగా కృంగిపోతాడు. తన రుగ్మతకు స్నేహితుడు కూడా బలైపోతాడు. 'జయలక్ష్మి' అనే పేరు పదే పదే వినిపిస్తుంటుంది. ఆమెను వెదుక్కొంటూ పిచ్చోడిలా తిరుగుతుంటాడు. లాభం లేదని మానసిక వైద్యుడు దగ్గరకు వెళ్తాడు. ఆ క్రమంలో తనకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మాచర్ల అనే ఓ గ్రామంలో తన గత జన్మ తాలుకూ జ్ఞాపకాలున్నాయని తెలుస్తుంది. వెంటనే ఒక్కడే.. అక్కడకు వెళ్తాడు. అక్కడ ఓ పురాతన లైబ్రరీలో జయలక్ష్మి ఫొటో కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు.. తన భార్యే. జయలక్ష్మికీ తన భార్యకీ ఉన్న సంబంధం ఏమిటి? దినేష్ గత జన్మ ఎలాంటిది? అసలు దినేష్ ఇలా అయిపోవడానికి గల కారణం ఏమిటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎనాలసిస్ :
* విశ్లేషణ
సినిమా ప్రారంభించిన విధానం చూస్తే ఇదేదో హారర్ సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. గడిచే కొద్దీ.. గత జన్మకి సంబంధించిన కథ అనిపిస్తుంది. ఆ తరవాత సైకలాజికల్ డిజార్డర్ అనిపిస్తుంది. అలా ఈ కథా నేపథ్యం రకరకాల మలుపులు తిరుగుతుంటుంది. తొలి సన్నివేశంతోనే టైమ్ వేస్ట్ చేయకుండా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. ఆ విధానం బాగుంది. దినేష్ తన అనుభవాలూ, గత జన్మ జ్ఞాపకాలు డాక్టర్‌తో పంచుకోవడం, అందుకు సంబంధించిన సన్నివేశాలు తెరపై రావడం ఇవన్నీ ఉత్కంఠత కలిగించేవే. చివరికి తాను వెదుతుతున్న జయలక్ష్మి ఎవరో తెలిసే సరికి.. ఇంట్రవెల్ పడుతుంది. ఈలోగా ఈ సినిమాపై, కథపై ఆసక్తి క్రమక్రమంగా మొదలవుతుంది. ఇంట్రవెల్ పడే సరికి చాలా ప్రశ్నలు ప్రేక్షకుడ్ని తొలుస్తుంటాయి. జయలక్ష్మి ఎవరు? హీరో ఇలా ఎందుకు మారాడు? ఈ సినిమాని ఎలా ముగించబోతున్నాడు? అనే ఉత్కంఠత కలుగుతుంది.
ద్వితీయార్థంలో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఆయా సన్నివేశాలు కూడా ఆసక్తిగానే ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్‌లో సన్నివేశాలకూ, ప్రజెంట్‌లో జరిగే సన్నివేశాలకూ.. ఆయా పాత్రలకు లింకప్ చేయడం చాలా బాగుంది. అక్కడే స్క్రీన్ ప్లే టెక్నిక్ తెలుస్తుంది. అయితే సడన్‌గా డ్రగ్స్ మాఫియా కోణం బయటకు వస్తుంది. దాంతో మనం చూసిందంతా హీరో తాలుకూ భ్రమా, లేదంటే నిజంగా అతనికంటూ గత జన్మ ఉందా అనే కన్‌ఫ్యూజన్ మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో వేసుకొన్న చిక్కుముడుల తాలుకూ రహస్యాలన్నీ విడిపోయిన తరవాత సినిమాలో చూడ్డానికీ, చెప్పడానికీ ఏం మిగల్లేదు. కానీ అక్కడ్నుంచి కనీసం అరగంట సినిమా ఉంటుంది. ఆయా సన్నివేశాలన్నీ బోర్ కొట్టించేవే. ఓ కథని ఆసక్తికరంగా మొదలెట్టి... ఊహించని మలుపులు తిప్పి.. చివరికి ఉసూరుమనిపించినట్టైంది. కొన్ని కీలకమైన పాయింట్లకు, ప్రశ్నలకు సమాధానం దొరకదు. దాంతో ప్రేక్షకుడిలో అసంతృప్తి రేగుతుంది. ఓ వినూత్నమైన కథని రొటీన్ గా ముగించిన చిత్రాల్లో భేతాళుడు చేరుతుంది.
* నటీనటుల ప్రతిభ
ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ విజయ్ ఆంటోనీ నటన. దినేష్, శర్మలుగా రెండు పాత్రల్లో కనిపిస్తాడు. రెండు పాత్రల్లోనూ తన నటన ఆకట్టుకొంటుంది. గత సినిమాల్లానే చాలా సహజంగా నటించాడు. అయితే పతాక సన్నివేశాల్లో కాస్త హీరోయిజం చూపించాలన్న ప్రయత్నం కనిపించింది. అరుంధతి నాయర్ ఐశ్వర్య పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటన కూడా అత్యంత సహజంగా ఉంది. మిగిలినవాళ్ల పాత్రలన్నీ చిన్నవే. చెప్పుకొనేంత విశేషాలేం లేవు.
* సాంకేతిక వర్గం
ఈ సినిమాకి మరో ప్రాణం.. నేపథ్య సంగీతం. విజయ్ ఆంటోనీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. జయలక్ష్మీ అనే సిగ్నేచర్ ట్యూన్ ఉలిక్కిపడేలా చేస్తుంటుంది. సినిమా అంతటా వినిపించే నేపథ్య గీతం కూడా కథకీ, భావోద్వేగాలకూ తగ్గట్టుగానే ఉంది. సినిమాటోగ్రఫీ పనితనం కూడా నచ్చుతుంది. వీలైనంత ఎక్కువగా సహజమైన లొకేషన్లలోనే తెరకెక్కించారు. ఫస్టాఫ్‌ని నడిపించిన విధానం తప్పకుండా ఆకట్టుకొంటుంది. ద్వితీయార్థంలో సాగదీత కనిపిస్తుంది. సినిమాని ముగించిన పద్దతి కూడా ఆకట్టుకోదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
* ఫైనల్ టచ్: బిచ్చగాడుతో విజయ్ ఆంటోనీపై గౌరవం పెరిగింది. దాన్ని భేతాళుడు పెంచదు.. అలాగని తగ్గించదు. బిచ్చగాడు ఫీవర్‌తో సినిమా చూస్తే.. కచ్చితంగా నచ్చే అవకాశాలున్నాయి.