English | Telugu

సినిమా పేరు:అశ్వథ్థామ
బ్యానర్:ఐరా క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jan 31, 2020

తారాగణం: నాగశౌర్య, మెహ్రీన్ పిర్జాడ, జిషుసేన్ గుప్తా, హరీశ్ ఉత్తమన్, ప్రిన్స్, సత్యా, జయప్రకాశ్, పవిత్రా లోకేశ్‌, పోసాని కృష్ణమురళి
కథ: నాగశౌర్య
స్క్రీన్‌ప్లే: రమణతేజ, ఫణీంద్ర బిక్కిన
సంభాషణలు: పరశురాం శ్రీనివాస్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
బ్యాగ్రౌండ్ స్కోర్: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
యాక్షన్: అన్బరివు
లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి
నిర్మాత: ఉష ముల్పూరి
దర్శకుడు: రమణతేజ

 

నాగశౌర్య స్వయంగా కథ రాసి, హీరోగా నటించిన 'అశ్వథ్థామ' మూవీపై కొద్ది రోజులుగా పాజిటివ్ బజ్ నడుస్తూ వచ్చింది. ఇప్పటివరకూ ఒక లవర్ బాయ్ లేదా మన పక్కింటి కుర్రాడుగా సాఫ్ట్ క్యారెక్టర్లలోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చిన అతను తొలిసారి ఒక యాక్షన్ రోల్‌లో, కండలుపెంచి కనిపిస్తూ చేసిన సినిమాగా సోషల్ మీడియాలోనూ బాగానే ప్రచారం పొందింది ఈ సినిమా. రమణతేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగశౌర్య సొంత ప్రొడక్షన్ కంపెనీ ఐరా క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ మన ముందుకొచ్చేసింది. ఇంటర్వ్యూల్లో, మూవీ ఈవెంట్స్‌లో నాగశౌర్య చెప్పినట్లే 'అశ్వథ్థామ' బ్లాక్‌బస్టర్ అయ్యే రేంజిలో ఉందా...

 

కథ:
చెల్లెలు ప్రియ నిశ్చితార్థానికి అటెండ్ కావడానికి యుఎస్ నుంచి వస్తాడు గణ (నాగశౌర్య). నిశ్చితార్థం అయ్యాక ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో, కారణం తెలుసుకొని హతాశుడవుతాడు. తను ప్రెగ్నెంట్‌ననీ, దానికి కారణం తను చేసుకోబోయే వ్యక్తి కాదనీ, అసలు తను ఎలా ప్రెగ్నెంట్ అయ్యిందో కూడా తెలీదని ప్రియ చెప్పడంతో మరింత దిగ్భ్రాంతికి గురవుతాడు. ఆమె కాబోయే భర్త (ప్రిన్స్) సహకారంతో చెల్లికి అబార్షన్ చేయిస్తాడు గణ. చెల్లి పెళ్లయిపోతుంది. అయితే ప్రియకు జరిగిన తరహాలోనే పలు కేసులు గణ దృష్టికి రావడంతో, వాటి సంగతి తేల్చుకోవడానికి, దాంతోపాటు తన చెల్లికి జరిగిన అన్యాయం వెనుక ఎవరున్నారో కనిపెట్టడానికి రంగంలోకి దిగుతాడు. అతడి పరిశోధనలో ఏం తెలిసింది? అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న ఆ కిరాతకుడు ఎవరు?.. అనే విషయాలు మిగతా కథలో తెలుస్తాయి.


ఎనాలసిస్ :

ఆడపిల్లల జీవితాల్లో ప్రమాదం ఎలా పొంచివుండొచ్చో తెలియజేసే కథలు తెలుగులో ఇప్పటికే కొన్ని వచ్చాయి. అయితే తమకు తెలియకుండానే అమ్మాయిలు ఎలా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశముందో, అసలు అలాంటి సందర్భం ఎప్పుడు తమకు తటస్థించిందో కూడా తెలియని స్థితి వాళ్లకు ఎలా ఎదురుకావచ్చో తెలియజేసే కథ 'అశ్వత్థామ'. తన స్నేహితుడి చెల్లెలి జీవితంలో జరిగిన ఘటన తనను కదిలించి ఈ కథ రాసేలా చేసిందని నాగశౌర్య ఇదివరకే చెప్పాడు. అయితే కథగా చూసినప్పుడు ఒక పెయిన్‌ఫుల్ స్టోరీగా, అదే సమయంలో, తన చెల్లి జీవితంలో జరిగిన ఒక అవాంఛనీయ ఘటనను హీరో ఎలా తెలుసుకుంటాడనే ఆసక్తిని రేకెత్తించే స్టోరీగా ఇది కనిపిస్తుంది. కానీ దానికి తగ్గట్లు ఆసక్తికరంగా, భావోద్వేగపూరితంగా సన్నివేశాలు రాసుకోవడంలో స్క్రీన్‌ప్లే రైటర్స్ విఫలమయ్యారు. ఫణీంద్ర బిక్కినతో కలిసి డైరెక్టర్ రమణతేజ స్వయంగా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. ఒకదానివెంట ఒకటిగా సన్నివేశాలు వేగంగా వస్తున్నా, కథాంశంలోని పెయిన్‌ను ఆ సీన్లు ఎమోషనల్‌గా క్యారీ చెయ్యలేకపోయాయి. దాంతో హీరో క్యారెక్టర్‌తో, అతని ఎమోషన్‌తో మనం కనెక్ట్ కాలేం. హీరో పెయిన్ మన పెయిన్ కావాలంటే, సహానుభూతి అనేది చాలా ప్రధానం. అది లోపించడమే ఈ సినిమాకు పెద్ద మైనస్.  

ప్రథమార్ధంలో ప్రియకు జరిగిన అన్యాయానికి బాధ్యులు కావచ్చనే అనుమానంతో వరుసగా ఒకరి తర్వాత ఒకర్ని గణ చితగ్గొడుతూ వెళ్లడం ఇంప్రెసివ్‌గా లేదు. అనుమానితులనే కాకుండా, వాళ్ల పక్కనున్న వాళ్ల స్నేహితుల్ని కూడా అతడు రూత్‌లెస్‌గా బాదేస్తూ ఉంటే, మనం హీరో క్యారెక్టర్‌తో ఎలా కనెక్టవుతాం! పైగా లౌడ్ రీరికార్డింగ్ ఒకటి!! ఆ సన్నివేశాల్ని మరో రకంగా, ఎమోషనల్‌గా చిత్రీకరించి ఉండాల్సింది. అలాగే ప్రియ ఆత్మహత్యాయత్నం, తను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పే సందర్భాన్ని సృష్టించిన తీరు చాలా సాధారణంగా ఉంది. ఇది దర్శకుడి అనుభవ రాహిత్యమే! డాక్టర్ మనోజ్ కుమార్ క్యారెక్టర్‌ను భయానకంగా తీర్చిదిద్దిన దర్శకుడు, అనేకమంది నటుల్ని సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఇటీవలి కాలంలో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తూ వస్తోన్న సత్యాతో ఏమాత్రం కామెడీ పండించలేకపోయాడు. హీరోయిన్ నేహ (మెహ్రీన్) పాత్రలోనూ డెప్త్ లేదు. హీరో తండ్రి క్యారెక్టర్లో తమిళ యాక్టర్ జయప్రకాశ్ కనిపించినప్పుడు, కచ్చితంగా ఆ క్యారెక్టర్‌తో ఏవైనా ఎమోషనల్ సీన్స్ చేయిస్తారని ఆశిస్తాం. కానీ ఆ పాత్రను సరిగా ఉపయోగించుకోలేదు. ఇవన్నీ ఒకెత్తు.. కథ ఎవరి పాత్రను ఆధారం చేసుకొని నడుస్తుందో.. ఆ పాత్రకు అన్యాయం ఎలా జరిగిందో విజువల్‌గా చూపించకపోవడం స్క్రీన్‌ప్లేలో దొర్లిన అతిపెద్ద లోపం. ప్రియ ప్రెగ్నెంట్ కావడమే మెయిన్ ప్లాట్ పాయింట్ అయినప్పుడు, ఆమెకు ఆ అన్యాయం ఎలా జరిగిందో విజువల్‌గా చూపించినప్పుడే ఎమోషనల్‌గా మనం కనెక్ట్ అవుతాం.

టెక్నికల్‌గా చూస్తే.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి. హీరో హీరోయిన్ల మధ్య మొదటి డ్యూయెట్, ఒక మాంటేజ్ సాంగ్ బాగున్నాయి. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఓవర్‌బోర్డ్ వెళ్లి ఫీల్‌ని దెబ్బకొట్టింది. సన్నివేశాల్లో ఫీల్ లేకపోవడానికి ఎడిటింగ్ కూడా ఒక కారణం. ఓవరాల్‌గా డైరెక్షన్‌లో, స్క్రీన్‌ప్లేలో వీక్నెస్ స్పష్టం.

 

ప్లస్ పాయింట్స్:
ప్రయోజనాత్మక కథ
నాగశౌర్య, జిషుసేన్ గుప్తా (విలన్) నటన
సినిమాటోగ్రఫీ
విజువల్‌గా, మ్యూజికల్‌గా బాగున్న పాటలు

మైనస్ పాయింట్స్:
వీక్ స్క్రీన్‌ప్లే
ఎమోషన్, ఫీల్ క్యారీ కాని సన్నివేశాలు
పలు పాత్రల్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం
ఎడిటింగ్ లోపాలు
అనుభవరాహిత్య దర్శకత్వం
తేలిపోయిన క్లైమాక్స్

 

నటీనటుల అభినయం:
ఇప్పటివరకూ మనం చూడని పాత్రలో నాగశౌర్య కనిపించి, మెప్పించాడు. యాక్షన్ రోల్ కాబట్టి ఫిజిక్ పెంచాడు. హావభావాలతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లలో మెప్పించాడు. ఎమోషనల్ సీన్లను ఇంకా బాగా తియ్యగలిగితే, అతని నటన ఇంకా ఆకట్టుకొని ఉండేది. నేహ పాత్రలో మెహ్రీన్ క్యూట్‌గా ఉంది. నటించడానికి పెద్ద అవకాశం రాలేదు. నాగశౌర్య చెల్లిగా నటించిన తార ఆకట్టుకుంది. 'యన్.టి.ఆర్: కథానాయకుడు' మూవీలో ఎల్వీ ప్రసాద్ రోల్‌లో కనిపించిన బెంగాలీ నటుడు జిషుసేన్ గుప్తా ఈ సినిమాలో నెగటివ్ రోల్‌కు సరిగ్గా సరిపోయాడు. చెప్పాలంటే నటనాపరంగా అందరికంటే ఎక్కువ మార్కులు అతనికే ఇవ్వొచ్చు. హరీష్ ఉత్తమన్‌కు కూడా అతని స్థాయికి తగ్గ పాత్ర లభించలేదు. హీరో తండ్రిగా చేసిన జయప్రకాశ్ కంటే, తల్లిగా చేసిన పవిత్రా లోకేశ్‌కు మెరుగైన పాత్ర లభించింది. హీరో బావగా ప్రిన్స్ ఓకే. పోసాని ఒక సీన్‌లో కనిపించి, దానివరకు న్యాయం చేశాడు. అప్పుడప్పుడు కనిపించే సత్యా సినిమాకి ఏ రకంగానూ ఉపయోగపడలేదు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

స్టోరీలో ఉన్న ఎమోషన్‌ను స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌తోనూ ఎమోషనల్‌గా తీర్చిదిద్దినట్లయితే, మంచి సినిమా అయ్యే అవకాశాలున్న 'అశ్వథ్థామ'.. అవి వీక్ కావడం వల్లే ఫీల్‌లెస్, ఎమోషన్‌లెస్‌గా తయారయ్యింది. కంటెంట్ కోసం ఒకసారి చూడొచ్చు.

- బుద్ధి యజ్ఞమూర్తి

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25