Read more!

English | Telugu

సినిమా పేరు:అ ఆ
బ్యానర్:హారిక అండ్ హాసిని క్రియేషన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Jun 2, 2016

త్రివిక్ర‌మ్ అంటే ఏమిటి?
-పంచ్‌..
ఈ మాట విన‌డానికి బాగానే విన్నా.. మ‌ళ్లీ మ‌ళ్లీ విన‌డానికి మాత్రం బోర్‌కొడుతుంది. త్రివిక్ర‌మ్ అంటే పంచ్ త‌ప్ప ఇంకేం లేదా?  అన్న అనుమానం వ‌స్తుంది. అందుకే త్రివిక్ర‌మ్ త‌న బ‌లాన్ని వ‌దిలి మ‌రో కోణంలో త‌న‌లోని ద‌ర్శ‌కుడ్ని ఆవిష్క‌రించుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం... అ.ఆ!
త్రివిక్ర‌మ్ సినిమాల్లోలా.. అ.ఆలో బ‌ల‌వంత‌పు పంచ్‌లు లేవు. సంతోషం.
మ‌రి ఏముంది??  అ.ఆ. ఎవ‌రి క‌థ‌..?  త్రివిక్ర‌మ్‌లో, స‌మంత‌లో, నితిన్‌లో క‌నిపించిన కొత్త కోణం ఏమిటి?  తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లిపోవాల్సిందే.


క‌థ‌:

రామ‌లింగం (న‌రేష్‌), మహాలక్ష్మి (నదియా) ల కూతురు అన‌సూయ (స‌మంత‌). ఆ ఆంట్లో మ‌హానే లీడ‌ర్‌. రామ‌లింగం కూడా భార్య మాట‌కు త‌లొగ్గేవాడే. అన‌సూయ‌కు అమ్మంటే భ‌యం. నాన్నంటే ప్రేమ‌. అమ్మ గీసిన గీటు దాట‌దు... దాట‌కూడ‌దు. అనసూయని త‌న‌కంటే ధ‌న‌వంతుల కుటుంబానికి  ఇచ్చి పెళ్లి చేయాలనుకొంటుంది మహాలక్ష్మి. కానీ ఆ సంబంధం అన‌సూయ‌కు న‌చ్చ‌దు. అందుకే అమ్మ‌కు తెలియ‌కుండా త‌న నాన్న స‌హాయంతో ఊర్లో ఉన్న అత్త ఇంటికి వెళ్తుంది. అక్క‌డ‌ బావ ఆనంద్‌ విహారి (నితిన్‌)ని ప్రేమిస్తుంది.  కానీ ఆనంద్‌.. వ‌ల్లి (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌)ని పెళ్లి చేసుకోవాల్సిన అవ‌స‌రం వ‌స్తుంది. అదెందుకు?  మ‌హాల‌క్ష్మికీ, ఆనంద్ కుటుంబానికీ ఉన్న లింకేంటి?  అన‌సూయ ప్రేమ ఫ‌లించిందా?  ఇవ‌న్నీ అ.ఆ చూసి తెల‌సుకోవాలి.


ఎనాలసిస్ :

విశ్లేష‌ణ‌:

బేసిగ్గా క‌థార‌చ‌యిత అయిన‌ త్రివిక్ర‌మ్ ఈసారి  క‌థ‌కు అంత ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నే చెప్పాలి. ఎక్కువ‌గా క్యారెక్ట‌రైజేష‌న్స్‌, ఎమోష‌న్స్‌ల‌పైనే ఆధార‌ప‌డ్డాడు. ఈరోజుల్లో అదేం నేరం కాదు కాబ‌ట్టి.. చ‌ల్తా. పైగా త్రివిక్ర‌మ్‌లాంటి ద‌ర్శ‌కుడికి పిస‌రంత లైను దొరికినా చెల‌రేగిపోతారు. వాళ్ల బ‌లం 'తీత‌'లో ఉంటుంది. అయితే అది అ.ఆలో క‌నిపించింది కొంతే! అన‌సూయ‌, ఆనంద్‌, మ‌హాల‌క్ష్మి. వ‌ల్లి.. ఈ నాలుగు పాత్ర‌లూ క‌థ‌లో కీల‌కం. అయితే వ‌ల్లి పాత్ర‌కు అంత సీన్ లేదు. ఆమెది జ‌స్ట్ గెస్ట్ రోల్‌. అన‌సూయ అమాయ‌క‌త్వం, అమ్మ‌కు త‌లొగ్గే గుణం.. బావ అంటే ఇష్ట‌ప‌డినా అది నేరుగా చెప్ప‌లేని త‌త్వం.. అత్త ఇంట్లో చేసిన అల్ల‌రి, ఆనంద్ బాధ్య‌త‌లు.. ఇది సినిమా ఫ‌స్టాఫ్‌కి మూలం. ఇంట్ర‌వెల్ అయిన త‌ర‌వాత ఇప్ప‌టి వర‌కూ జ‌రిగిన క‌థేమిటి?  అంటే రెండే రెండు లైన్ల‌లో తేలిపోతుంది. అయితే ఇక్కడున్న ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కాబ‌ట్టి... కాస్త‌లో కాస్త సినిమాబోర్ కొట్ట‌కుండా కాస్త ప‌ద్ధ‌తిగానే న‌డిపించే ప్ర‌య‌త్నం చేశాడు. అన‌సూయ డిమాండ్ల‌కు ఆనంద్ ఎలా హ‌డ‌లిపోయాడో చూపించిన సీన్‌.. పెళ్లి చూపుల తంతు.. ఇవ‌న్నీ న‌వ్వించేవే. అయితే త్రివిక్ర‌మ్ ఈ సారి కామెడీ కంటే ఎమోష‌న్స్‌నే న‌మ్ముకొన్నాడు. దానిపైనే ఫోక‌స్ పెట్టాడు. సెకండాఫ్ అంతా అదే క‌నిపిస్తుంది. అత్త ద‌గ్గ‌ర కూర్చుని ఆనంద్ 'నాలుగు ముక్క‌లు చెబుతా' అన్న సీన్‌... అత్తారింటికి దారేది క్లైమాక్స్‌ని త‌ల‌పిస్తుంది. అన‌సూయ‌తో ప్రేమిస్తున్నా, నాతో వ‌స్తావా అనే అర్థం వ‌చ్చేలా సాగే సీన్ త్రివిక్ర‌మ్‌లోని ర‌చ‌యిత నైపుణ్యానికీ, ద‌ర్శ‌కుడిగా ప్ర‌తిభ‌కూ అద్దం ప‌డుతుంది. అలాంటి ఒక‌ట్రెండు స‌న్నివేశాలు త‌ప్ప‌.. 'అరె.. ఇక్క‌డ త్రివిక్ర‌మ్ అద‌ర‌గొట్టేశాడు' అనే స్థాయిలో సీన్లేం లేవు. ఫ‌స్టాఫ్‌లో నాలుగు.. సెకండాఫ్‌లో మ‌రో నాలుగు సీన్లు ప‌డితే... అ.ఆ మ‌రో అత్తారింటికి అయ్యేది.

పెర్‌ఫార్మ్సెన్స్‌:

అ అంటే అన‌సూయ కాబ‌ట్టి ముందు స‌మంత గురించి చెప్పుకొందాం. పూర్తిగా స‌మంత పాయింట్ ఆఫ్ వ్యూలోంచి సాగే సినిమా ఇది. దాంతో బేసిగ్గా ఆ పాత్ర‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కూడా. అన‌సూయ‌గా సమంత న‌ట‌న అద్వితీయం, అమోఘం అని చెప్ప‌లేం గానీ... బాగుంది. ఆ పాత్ర‌కు త‌గిన న్యాయం చేసింది. చిన్న చిన్న ఎక్స్‌ప్రెష‌న్స్ కూడా క్యూట్‌గా చూపించ‌డం స‌మంత బ‌లం. ఈసారీ అదే క‌నిపించింది. హీరోయిజం చూపించే సినిమా కాదిది. కానీ... నితిన్ ఒప్పుకొన్నాడంటే గ్రేటే. నితిన్ పాత్ర కూడా ఎమోష‌న్స్ చుట్టూ న‌డిచేదే. చాలా సెటిల్డ్ గా చేశాడు. అత్తారింటికి దారేదిలో పొగ‌రున్న అత్తాలా న‌దియా ఏం చేసిందో, ఇందులోనూ అంతే. న‌రేష్ చాలా కాలం త‌ర‌వాత కాస్త కూల్‌గా న‌టించాడు. అది త్రివిక్ర‌మ్ మ‌హిమే అనుకోవాలి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అద‌ర‌గొట్టేస్తుంది అనుకొన్నారు గానీ అంత లేదు.

టెక్నిక‌ల్‌గా:

త్రివిక్ర‌మ్ టెక్నిక‌ల్‌గా చాలా స్ట్రాంగ్‌. రాసుకొన్న స‌న్నివేశంలో బ‌లం లేక‌పోయినా.. తీసే విధానం, క‌న్వెన్స్ చేసే ప‌ద్ధ‌తి బాగుంటాయి. ఈ సినిమాలోనూ అదే క‌నిపించింది. ఛాయాగ్ర‌హ‌ణం క‌నుల‌కు ఇంపుగా సాగింది. బ్రిడ్జ్‌మీద ఫైట్‌.. సీజీలో తీయాల్సినంత అవ‌స‌రం ఏమొచ్చిందో?  మిక్కీ పాట‌ల కంటే.. నేప‌థ్య సంగీతం బాగుంది. పాట‌లూ కూల్‌గానే ఉన్నాయి. ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్‌... ర‌చ‌యిత‌గా త్రివిక్ర‌మ్ అక్క‌డ‌క్క‌డ‌గా మెరిశారు. త్రివిక్ర‌మ్ సినిమాల్లో వినోదం పాళ్లు ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ఈసారి ఆ డోసు త‌గ్గింది. పంచ్‌ల్ని పూర్తిగా వ‌ద్ద‌నుకొన్నా... అక్క‌డ‌క్క‌డా త‌న స్థాయి డైలాగులు మెరుపులా మెరిశాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మొత్తానికి అ..ఆ  'ఆహా' అనేలా లేదు. 'అ'.. వ‌చ్చిందా..? అనేలానే సాగింది.