English | Telugu

నేతన్నలకు ఉచిత కరంట్..ఈనెల 7 నుంచి అమలు

రాష్ట్రంలో మగ్గాలున్న నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో జెట్ స్పీడ్ లో ముందుకు సాగుతున్న చంద్రబాబు ఒక్క ఆగస్టు నెలలోనే మూడు పథకాల అమలును ప్రారంభిస్తున్నారు. శనివారం (ఆగస్టు 2) నుంచి అన్నదాతా సుఖీభవ పథకం నిధులను విడుదల చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఇదే నెల 15 నుంచి అమలులోకి తీసుకువస్తున్నారు. ఇక ఈ నెల 7 నుంచి మగ్గాలున్న నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నారు.

నేతన్నలకు ఈ ఉచిత విద్యుత్ పథకం ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు పవర్ లూమ్స్ ఉన్నవారికి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్‌ ఉన్నవారికి 200 యూనిట్ల మేర విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం అయిన ఆగస్టు 7 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజావేదిక వేదికగా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించడమే కాకుండా, రాష్టరానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం చేస్తున్న ప్రయత్నాలనూ వివరించారు.

అలాగే జగన్ హయాంలో వైసీపీ సర్కార్ అనుసరించిన విధానాలను విమర్శించారు. దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా తేలిక.. నిలబెట్టడమే చాలా కష్టం అన్న చంద్రబాబు జగన్ హయాంలో రాష్ట్రంలో ఐదేళ్లు విధ్వంసమే జరిగిందనీ, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టాలు, కష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయేలా జగన్ పాలన సాగిందని విమర్శించారు. అంతకు ముందు జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామంలో చంద్రబాబు పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. లబ్ధిదారులతో ముచ్చటించారు.